Visakhapatnam: ఆ ఊహలన్నీ త్వరలోనే నిజం కానున్నాయి..

19 Nov, 2021 19:27 IST|Sakshi

సిద్ధమవుతున్న మరో యుద్ధ విమాన మ్యూజియం 

రూ.40 కోట్లతో చురుగ్గా పనులు 

వచ్చే ఏడాది మార్చి నాటికి అందుబాటులోకి.. 

సాక్షి, విశాఖపట్నం: అందమైన బీచ్‌రోడ్డులో సరదాగా విహరిస్తూ ముందుకు సాగుతుంటే.. సాగరగర్భంలో శత్రు సైన్యానికి వణుకు పుట్టించిన సబ్‌మెరైన్‌.. దాని ఎదురుగా గగనతలంలో శత్రువులను గడగడలాడించిన టీయూ–142.. ఆ పక్కనే గాల్లో దూసుకుపోయే సీ హారియర్‌ యుద్ధ విమానం.. ఇలా వీటన్నింటిని చూస్తూ.. ఒక కప్పు కాఫీ తాగుతూ.. బీచ్‌ రోడ్డులో సరదాగా షాపింగ్‌ చేస్తే ఎంతో బాగుంటుందో కదా.. ఈ ఊహలన్నీ త్వరలోనే నిజం కానున్నాయి. బీచ్‌రోడ్డులో ఇంటిగ్రేటెడ్‌ మ్యూజియం ఏర్పాట్లకు సన్నహాలు సాగుతున్నాయి. విశాఖ నగరాన్ని నంబర్‌ వన్‌ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మార్గదర్శకాలకు అనుగుణంగా సందర్శకులకు మరింత శోభను అందించేలా బీచ్‌రోడ్డులో ఇంటిగ్రేటెడ్‌ మ్యూజియం, టూరిజం కాంప్లెక్స్‌ నిర్మాణానికి వీఎంఆర్‌డీఏ చురుగ్గా అడుగులు వేస్తోంది. రూ.40 కోట్లతో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రణాళికలు, డీపీఆర్‌ సిద్ధం చేసింది. రూ.10కోట్లతో సీహారియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మ్యూజియం పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి.  

సిద్ధమవుతున్న సీహారియర్‌ 
ఆర్కే బీచ్‌లో టీయూ–142 ఎయిర్‌క్రాఫ్ట్‌ సందర్శకులను ఎంతగానో అలరిస్తోంది. కురుసుర జలాంతర్గామి సందర్శకుల మనసు దోచుకుంటోంది. సాగరతీరానికి అదనపు ఆభరణంలా ఇప్పుడు సీ హారియర్‌ యుద్ధ విమానం సన్నద్ధమవుతోంది. 1983లో బ్రిటిష్‌ ఏరోస్పేస్‌ నుంచి కొనుగోలు చేసిన ఈ సీహారియర్‌ నౌకాదళం ఏవియేషన్‌ విభాగంలో చేరింది. గోవాలోని ఐఎన్‌ఎస్‌ హంస యుద్ధనౌకలో 32 ఏళ్ల పాటు దేశానికి సేవలందించింది. 2016లో సేవల నుంచి నిష్క్రమించింది. ఈ యుద్ద విమానాన్ని వీఎంఆర్‌డీఏ సాగరతీరంలో మ్యూజియంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాజీవ్‌ స్మృతి భవన్‌లో దీనికి సంబంధించిన మ్యూజియం నిర్వహించనున్నారు. ప్రస్తుతం దీనిని టీయూ–142 యుద్ధ విమాన మ్యూజియం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఉంచారు. సముద్రపు గాలులకు ఇది తుప్పు పట్టకుండా వీఎంఆర్‌డీఏ ప్రత్యేక కోటింగ్‌ పెయింట్‌ వేయించింది. త్వరలోనే ఇది రాజీవ్‌ స్మృతి భవన్‌కు చేరనుంది. 

చదవండి: (WorkFromHomeTowns: 24/7 విద్యుత్‌ సరఫరా.. హై స్పీడ్‌ ఇంటర్‌నెట్‌)



ఇంటిగ్రేటెడ్‌ మ్యూజియం 
సీ హారియర్‌ మ్యూజియం అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా ఇంటిగ్రేటెడ్‌ మ్యూజియంగా తీర్చిదిద్దనున్నారు. బీచ్‌రోడ్డుకు వచ్చే ప్రతి సందర్శకుడికీ సరికొత్త అనుభూతి కలిగించేలా మ్యూజియంను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించిన నేపథ్యంలో వీఎంఆర్‌డీఏ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న టీయూ–142, కురుసుర మ్యూజియంతో పాటు సీ హారియర్‌ను అనుసంధానం చేస్తూ ఇంటిగ్రేటెడ్‌ మ్యూజియంగా తీర్చిదిద్దనున్నారు. మొత్తంగా రూ.40 కోట్ల అంచనా వ్యయంతో ఇంటిగ్రేటెడ్‌ మ్యూజియం బీచ్‌రోడ్డులో అందుబాటులోకి రానుంది. రాజీవ్‌ స్మృతి భవన్‌లో సీహారియర్‌ మ్యూజియం పనులు వేగవంతం చేశారు. కోవిడ్‌ కారణంగా ఆలస్యమైనా.. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసేందుకు వీఎంఆర్‌డీఏ ఇంజినీరింగ్‌ విభాగం ప్రయత్నిస్తోంది. 2022 మార్చి నాటికి అందుబాటులోకి తీసుకురావడానికి ఆలోచన చేస్తున్నారు. 

ఫుడ్‌ కోర్టులు.. షాపింగ్‌లు... 
ఇంటిగ్రేటెడ్‌ మ్యూజియంలో భాగంగా రాజీవ్‌ స్మృతి భవన్‌లో సీ హారియర్‌ మ్యూజియం మార్చి నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. రూ.10 కోట్లతో మ్యూజియం అభివృద్ధి చేస్తున్నారు. అదే విధంగా రూ.10 కోట్లతో సబ్‌మెరైన్‌ మ్యూజియంకు సరికొత్త హంగులు అద్దనున్నారు. మరో రూ.20 కోట్లతో ఫుడ్‌ కోర్టులు, షాపింగ్‌ చేసుకునేలా సరికొత్త దుకాణాలు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని వీఎంఆర్‌డీఏ సిద్ధమవుతోంది. సీహారియర్‌ మ్యూజియంలో వివిధ రకాల యుద్ధ విమానాల గురించి తెలుసుకునేలా సమగ్ర సమాచార ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. టీయూ–142 మ్యూజియం ముందు భాగంలో ఏర్పాటు చేసిన ఆర్చ్‌ మాదిరిగా సబ్‌మెరైన్‌ మ్యూజియంను తీర్చిదిద్దనున్నారు. వీటికి తోడుగా ఇంటిగ్రేటెడ్‌ మ్యూజియంలో విభిన్న హంగులు కొత్త అనుభూతిని అందివ్వనున్నాయి. సావనీర్‌ షాప్, సిమ్యులేషన్‌ గేమ్స్, కాఫీషాప్‌తో పాటు జోన్ల వారీగా విభిన్నతలు అందుబాటులోకి తీసుకురానున్నారు. టీయూ–142, సబ్‌మెరైన్, సీ హారియర్‌ విమానాలకు గుర్తులుగా కీచైన్లు, పుస్తకాలు, ట్రేలు, కాఫీ కప్పులు, జ్ఞాపికలు.. ఇలా ఎన్నో విభిన్నమైన వస్తువులతో కూడిన షాపింగ్‌ దుకాణాలు కొలువుదీరనున్నాయి. 

చదవండి: (చంద్రబాబు మంగమ్మ శపథాలను ఎవరూ నమ్మరు: కొడాలి నాని)

సరికొత్త బీచ్‌ను చూస్తారు 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా మూడు ప్రధాన మ్యూజియంలను అనుసంధానం చేస్తూ ఇంటిగ్రేటెడ్‌ మ్యూజియంగా తీర్చిదిద్దే ప్రణాళికలు తయారు చేశాం. దీనికి సంబంధించిన రూట్‌మ్యాప్‌ను కమిషనర్‌ సూచనల మేరకు అమలు చేస్తున్నాం. సీహారియర్‌ మ్యూజియం అందుబాటులోకి వచ్చాక.. ప్రతి సందర్శకుడూ బీచ్‌ను సరికొత్తగా చూస్తారు. మ్యూజియంను సందర్శించడంతో పాటు జ్ఞాపకాలను తీసుకెళ్లేలా షాపింగ్‌ సౌకర్యం, పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. రాజీవ్‌ స్మృతిభవన్‌ మునుపటి రూపు చెక్కు చెదరకుండా నిర్మిస్తున్నాం. బీచ్‌లో నడుస్తుంటే వేలాడే సీహారియర్‌ని ప్రతి ఒక్కరూ చూడొచ్చు. ప్రత్యేకమైన విద్యుత్‌ దీపాల ధగధగలతో మ్యూజియం మెరవనుంది.         – భవానీశంకర్, వీఎంఆర్‌డీఏ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ 

ఇంటిగ్రేటెడ్‌ ప్రాజెక్ట్‌ ఇలా..
సీహారియర్‌ మ్యూజియం వ్యయం - రూ.10 కోట్లు 
సబ్‌మెరైన్‌ హెరిటేజ్‌ మ్యూజియం వ్యయం - రూ.10 కోట్లు 
అండర్‌ గ్రౌండ్‌ పార్కింగ్‌ - రూ.17 కోట్లు 
ల్యాండ్‌ స్కేపింగ్, విద్యుదీకరణ వ్యయం - రూ.3 కోట్లు 
మొత్తం ఇంటిగ్రేటెడ్‌ ప్రాజెక్టు వ్యయం - రూ.40 కోట్లు 

మరిన్ని వార్తలు