అంతర్వేది : నూతన రథం ట్రయల్‌ రన్‌

28 Dec, 2020 13:09 IST|Sakshi

ఏడంతస్తులతో రూపుదిద్దుకున్న నూతన రథం 

సాక్షి, సఖినేటిపల్లి: తూర్పుగోదావరి జిల్లాలలోని  ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి నూతన రథం​ పూర్తయింది. ఏడంతస్తుల రథం పూర్తి స్ట్రక్చర్ నిర్మించడంతో పాటు చక్రాలు కూడా ఏర్పాటు చేశారు. మూడు నెలల రికార్డు సమయంలో అధికారులు ప్రధాన నిర్మాణాన్ని పూర్తి చేశారు. మంత్రి వేణు గోపాల కృష్ణ ,జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి కూడా రథాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో దేవాదాయశాఖ అధికారులు నేడు రథం ట్రయల్‌ రన్ నిర్వహించారు. ప్రధాన ఆలయానికి ఎదురుగా నిర్మితమవుతున్న రథాన్ని తాళ్ళుతో లాగుతూ బయటకు తీసుకు వెళ్లారు. రధం సునాయాసంగా కదలడంతో ట్రయల్‌ రన్ విజయవంతంగా ముగిసింది.  పాత రథానికి  భిన్నంగా కొత్త రథంలో బ్రేక్ సిస్టం కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు  రధం కింద జాకీలు అమర్చి అవసరమైన చోట సునాయసంగా వెనక్కి తీసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు.  



నాలుగు నెలల క్రితం  రథం దగ్ధమైన విషయం సంగతి విదితమే.  ఈ ఘటనను  తీవ్రంగా పరిగణించి, వెంటనే స్పందించిన  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొత్త రథం నిర్మాణం, రథశాల మరమ్మతులకు తక్షణం రూ.95 లక్షలు మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో పాత రథం నమూనాలోనే రథం 21 అడుగుల పొడవు,16 అడుగుల వెడల్పు, 41 అడుగుల ఎత్తున, ఆరు చక్రాలతో కొత్త రథం డిజైన్‌ దేవదాయ శాఖ ఖరారు చేసింది. నూతనరథం తయారీకి సుమారు 1,330 ఘనపుటడుగుల బస్తర్‌ టేకును వినియోగించారు. కొత్త రథం తయారీ పనులకు సెప్టెంబర్‌ 27న జిల్లా ఇన్‌చార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ పనులను దేవదాయ శాఖ ఇంజినీరింగ్‌ అధికారులు 90 రోజుల్లో పూర్తి చేశారు. పెయింటింగ్‌ మినహా ఇతరపనులన్నీ పూర్తయ్యాయి. ముక్కోటి ఏకాదశి పర్వదినమైన శుక్రవారం రథానికి శిఖరం కూడా అమర్చారు. 

 

మరిన్ని వార్తలు