సూపర్‌బగ్స్‌ పెనుప్రమాదం.. యాంటీ బయోటిక్‌ ఎప్పుడు వాడాలంటే

6 Dec, 2021 09:17 IST|Sakshi

యాంటీబయోటిక్స్‌ను అతిగావాడితే ముప్పే

శరీర వ్యవస్థపై తీవ్ర దుష్ప్రభావం  

లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఏ మందునైనా అవసరమైనప్పుడు నిర్ణీత మోతాదులో వాడితేనే మంచి ఫలితం వస్తుంది. అనవసరంగా వాడితే మంచి జరగకపోగా దుష్ప్రభావాలు కనిపిస్తాయి. ఒకప్పుడు కలరా తదితర అంటువ్యాధులు ప్రబలినప్పుడు పెన్సిలిన్‌ వంటి యాంటీబయోటిక్స్‌ ప్రజల ప్రాణాలు నిలిపాయి. ఇప్పుడు పలు రకాల యాంటీబయోటిక్స్‌ను మితిమీరి వాడటం వల్ల తీవ్ర దుష్ఫలితాలు కనిపిస్తున్నాయని ఫార్మకాలజీ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నేడు ఏ చిన్న అనారోగ్య సమస్య తలెత్తినా యాంటీబయోటిక్స్‌ వాడేస్తున్నారు. విచ్చలవిడిగా ఈ మందులను వినియోగిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.

దీంతో యాంటీ మైక్రోబయల్‌ రెసిస్టెన్స్‌పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. జలుబు చేసినప్పుడు సిట్రజెన్‌ వంటి ఎలర్జిక్‌ డ్రగ్‌ వాడితే తగ్గిపోతుంది. దానికి కూడా యాటీబయోటిక్స్‌ వాడుతున్నారు. పంటి నొప్పి వంటి సమస్యలకు యాంటీబయోటిక్స్‌ వినియోగం మంచిది కాదని వైద్యులు స్పష్టంచేస్తున్నారు. ఈ మందులను అవసరం మేరకు మాత్రమే వినియోగించి, విచ్చలవిడితనాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు సైతం ప్రణాళికా బద్ధంగా కృషి చేస్తున్నాయి.

యాంటీ బయోటిక్‌ ఎప్పుడు వాడాలంటే.. 
మనకు ఏదైనా జబ్బు చేసినప్పుడు వైరల్‌ ద్వారా వ్యాప్తి చెందిందా? లేక బ్యాక్టీరియా కారణమా అన్నది నిర్ధారించుకోవాలి. బ్యాక్టీరియా కల్చర్‌ పరీక్ష ద్వారా నిర్ధారించుకుని అవసరం మేరకు మూడు నుంచి ఐదు యాంటీబయోటిక్స్‌ వాడాలి. మన శరీరంలో మంచి, చెడు బ్యాక్టీరియాలు ఉంటాయి. చెడు బ్యాక్టీరియా నివారణకు అతిగా యాంటీబయోటిక్స్‌ వాడటం వల్ల వాటి ప్రభావం మంచి బ్యాక్టీరియాపై పడుతుంది. ఫలితంగా శరీరంలోని వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒక్కోసారి తీవ్రమైన నీరసం వంటి సమస్యలు తలెత్తుతాయి. యాంటీబయోటిక్స్‌ రెండు రకాలుగా ఉంటాయి. నేరో స్ప్రెక్టమ్‌ యాంటీబయోటిక్స్‌ ఒకే రకమైన బ్యాక్టీరియాకు పనిచేస్తాయి. బ్రాడ్‌ స్ప్రెక్టమ్‌ యాంటీబయోటిక్స్‌ రెండు మూడు రకాల బ్యాక్టీరియాల నివారణకు పనిచేస్తాయి.

సూపర్‌బగ్స్‌ పెనుప్రమాదం 
యాంటీబయోటిక్స్‌ విచ్చలవిడిగా వాడటం వల్ల శరీరంలో బ్యాక్టీరియాకు డ్రగ్‌ రెసిస్టెన్స్‌ (ఔషధ నిరోధకత) ఏర్పడుతుంది. ఔషధ నిరోధకతను సంతరించుకున్న బ్యాక్టీరియా నుంచి వచ్చే తరువాతి తరాల బ్యాక్టీరియాలను సూపర్‌ బగ్స్‌ అంటారు. ఇవి సాధారణ యాంటీ బయోటిక్స్‌కు లొంగవు. ఎక్కువ డోస్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇవ్వడం ద్వారా సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం కొందరిలో సూపర్‌ బగ్స్‌ను గుర్తిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

వ్యాధిని గుర్తించడం ముఖ్యం 
నిమోనియా వ్యాధి వైరల్, బ్యాక్టీరియా, ఫంగస్‌ వంటి మూడు కారణాలుగా వస్తుంది. వైరల్‌ నిమోనియా చాలా వేగంగా వ్యాప్తి చెంది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధికి మందులు వాడేటప్పుడు సరైన నిర్ధారణ చేసి యాంటీబయోటిక్స్‌ వాడాలి. లేకుంటే నివారించడం కష్టం. నిమోనియానే కాదు ఏ వ్యాధినైనా యాంటీబయోటిక్స్‌ వినియోగించే సమయంలో బ్యాక్టీరియా కల్చర్, అవసరమైతే డ్రగ్‌ కల్చర్‌ పరీక్షలు చేయడం ఉత్తమం.

గర్భిణుల విషయంలో జాగ్రత్తలు అవసరం 
గర్బిణులకు కొన్ని రకాల యాంటీబయోటిక్స్‌ వాడటం చాలా ప్రమాదకరమని ఫార్మకాలజీ నిపుణులు చెపుతున్నారు. వారు వైద్యుల సూచన లేకుండా యాంటీబయోటిక్స్‌ వాడటం వలన గర్భస్థ శిశువులో అవయవలోపాలు ఏర్పాడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు