ఇవేంటో గుర్తుపట్టగలరా?

7 Sep, 2020 11:14 IST|Sakshi

రైల్వేకోడూరు రూరల్‌: సాంకేతికతతో పురాతన పనిముట్లు కాల గమనంలో ఇమడలేక పోతున్నాయి.. ముఖ్యంగా నాడు ఆహార అవసరాలకు ఉపయోగించుకునే రోలు కుదేలయ్యింది.. తిరగలి(విసురురాయి) తిరగలేక కనుమరుగయ్యింది.. జాడీ(కాగులు) జాడలేకుండా పోయింది. నేడు మానవుడు కాలంతో పరిగెత్తుతూ ఆధునిక యంత్రాల మీద ఆధారపడి జీవించాల్సిన పరిస్థితి. నాడు గ్రామాల్లోని ప్రతి ఇంటిలో ఒక రోలు ఉండేది. ఇంటి మధ్యలో రోలు ఏర్పాటు చేసుకునేవారు. ఆ రోలులో వివిధ రకాల పచ్చళ్లు నూరుకోవడం, పొడులు చేసుకునేవారు. అలాగే అక్కడక్కడా పెద్దవారి(పలుకుబడి ఉన్న) పెద్దపెద్ద రోళ్లను ఉపయోగించుకుని వడ్లు, కొర్రలు దంచుకునేవారు. నేడు మిక్సీలు రావడంతో పాత రోళ్లు మూలనపడ్డాయి.

అయితే రోళ్లలో దంచుకుని తింటే ఆ రుచి భలేగుండేదని పెద్దలు గుర్తుచేసుకుంటున్నారు. అలాగే రైతులు పండించిన రాగులు, సజ్జలు తిరగలి(విసురురాయి) లో విసురుకుని పిండి చేసుకుని వాడేవారు. పిండి మిషను రాకతో తిరగలి కాస్త తిరగకుండా మూలనపడింది. మహిళలు తిరగలి వద్ద కూర్చుని పనిచేసుకుంటూ ఊరి ముచ్చట్లు పెట్టుకునేవారు. టీవీలు, మిక్సీలు రావడంతో అలాంటి వాతావరణం కాసింతయినా కానరాదు. నేటి తరం పిల్లలకు కూడా తిరగలి అంటే ఏంటో తెలియని స్థితిలో ఉన్నారు. గతంలో రైతులు పండించిన ధాన్యాన్ని జాడీలు (కాగులు)లో నిల్వ ఉంచేవారు. వీటిని ప్రత్యేకంగా తయారు చేయించుకునేవారు. ఒక్కో కాగులో 80 సేర్లు నుంచి 120 సేర్ల వరకు వడ్లు నిల్వ చేసుకునే వారు. ఏదిఏమైనా పాత కాలంలోనే ప్రజలు ఆరోగ్యంగా ఉండేవారని పలువురు అంటున్నారు.             

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా