భారత్‌ ఆవిష్కరణల సూచీలో పైపైకి ఏపీ

21 Jan, 2021 03:57 IST|Sakshi

పదో ర్యాంకు నుంచి ఏడో ర్యాంకుకు రాష్ట్రం 

ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌–2020 విడుదల చేసిన నీతి ఆయోగ్‌ 

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌ ఆవిష్కరణల సూచి (ఇండియా ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌)–2020లో ఆంధ్రప్రదేశ్‌ మెరుగైన పనితీరు కనబరిచి 3 స్థానాలు ఎగబాకింది. ఈ ఇండెక్స్‌ను బుధవారం ఢిల్లీలో నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌ కుమార్, సీఈవో అమితాబ్‌ కాంత్‌ తదితరులు విడుదల చేశారు. 2019 అక్టోబర్‌ 17న తొలిసారి వెల్లడించిన ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ ర్యాంకుల్లో పెద్ద రాష్ట్రాల కేటగిరీలో 10వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌.. ఈ రెండో ఎడిషన్‌లో 7వ ర్యాంకు సాధించింది. టాప్‌–10లో నిలిచిన రాష్ట్రాల్లో మూడు స్థానాలు మెరుగుపరుచుకున్న రాష్ట్రంగా కూడా ఏపీ నిలిచింది. నీతి ఆయోగ్, ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ కాంపిటీటివ్‌నెస్‌ సంస్థ సంయుక్తంగా ఈ సూచిని రూపొందించాయి. నూతన ఆవిష్కరణలకు అందించిన సహకారం, ఆవిష్కరణల పాలసీలను మెరుగుపరచడం వంటి విషయాల్లో ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పనితీరును పరిగణనలోకి తీసుకుని 36 సూచికల ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చారు. రాష్ట్రాలను 17 పెద్ద రాష్ట్రాలు, 10 ఈశాన్య, పర్వత ప్రాంత రాష్ట్రాలు, 9 నగర, కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించి ర్యాంకులు ప్రకటించారు.  

తొలిస్థానం నిలబెట్టుకున్న కర్ణాటక.. 
ఇండెక్స్‌–2020లో పెద్ద రాష్ట్రాల కేటగిరీలో తొలి స్థానంలో కర్ణాటక నిలిచింది. గత ఎడిషన్‌ సాధించిన తొలి ర్యాంకును తిరిగి నిలబెట్టుకుంది. తదుపరి స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, కేరళ, హరియాణా, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, యూపీ, పంజాబ్, పశి్చమ బెంగాల్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, బిహార్‌ నిలిచాయి. కేంద్ర పాలిత ప్రాంతాలు, నగరాలు రాష్ట్రాలుగా ఉన్న కేటగిరీలో ఢిల్లీ, చండీగఢ్, డామన్‌ అండ్‌ డయ్యూ తొలి మూడుస్థానాల్లో నిలవగా.. ఈశాన్య, పర్వత ప్రాంత రాష్ట్రాల కేటగిరీలో హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్‌ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. 

ఏపీ ప్రతిభ ఇలా.. 
ఆంధ్రప్రదేశ్‌ ఇండెక్స్‌–2020లో ఓవరాల్‌గా 24.19 స్కోరు సాధించింది. సాధికారత అన్న అంశంలో 2019 ఇండెక్స్‌లో 18.8 స్కోరు ఉండగా ఇప్పుడు 33.14 స్కోరు సాధించింది. పనితీరు అంశంలో 2019లో 10.21 స్కోరు ఉండగా.. ఇప్పుడు 15.25 స్కోరు సాధించింది. నాలెడ్జ్‌ అవుట్‌పుట్‌లో 2019లో 6.11 స్కోరు ఉండగా.. ఈసారి 9.35కు పెరిగింది. విజ్ఞాన విస్తరణ అంశంలో 2019లో 14.31 స్కోరు ఉండగా.. ఇప్పుడు 21.14 స్కోరు సాధించింది.   

మరిన్ని వార్తలు