‘ఆ ఇద్దరి బెయిల్‌ రద్దు చేయండి’

19 Jun, 2021 08:11 IST|Sakshi
సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‌, టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్

ధూళిపాళ్ల, గోపాలకృష్ణన్‌లు నిబంధనలు ఉల్లంఘించారు

సాక్షులను ప్రభావితం చేస్తున్నారు

హైకోర్టులో ఏసీబీ పిటిషన్‌

సాక్షి, అమరావతి: సంగం డెయిరీ అక్రమాల వ్యవహారంలో ఆ కంపెనీ చైర్మన్, టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్, ఎండీ గోపాలకృష్ణన్‌లకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఏసీబీ హైకోర్టును ఆశ్రయించింది. కోవిడ్‌ను సాకుగా చూపి బెయిల్‌పై బయటకు వచ్చిన వారు హైకోర్టు విధించిన బెయిల్‌ షరతులను, దర్యాప్తులో ఏ రకంగానూ జోక్యం చేసుకోవద్దన్న ఆదేశాలను ఉల్లంఘించారని నివేదించింది. ఈ వ్యాజ్యంపై శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావు విచారణ జరిపారు. నరేంద్రకుమార్‌ న్యాయవాది కౌంటర్‌ దాఖలు చేసేందుకు రెండు వారాల గడువు కోరారు. న్యాయమూర్తి వారం మాత్రమే గడువు ఇస్తానన్నారు. ఈ సమయంలో ఏసీబీ న్యాయవాది ఎ.గాయత్రీరెడ్డి విచారణను ఈ నెల 23కు వాయిదా వేయాలని కోరగా అంగీకరించిన న్యాయమూర్తి ఆ మేరకు వాయిదా వేశారు. 

డైరెక్టర్లతో భేటీ దర్యాప్తును ప్రభావితం చేయడమే..
బెయిల్‌పై బయటకు వచ్చిన నరేంద్రకుమార్‌ ఇటీవల సంగం బోర్డు డైరెక్టర్లతో పాటు, ఇతర కీలక అధికారులను గుంటూరు నుంచి విజయవాడకు పిలిపించి వారితో నోవాటెల్‌ హోటల్‌లో సమావేశం నిర్వహించారని, రెండో నిందితుడైన గోపాలకృష్ణన్‌తో పాటు 25 మంది వరకు పాల్గొన్నారని ఏసీబీ పిటిషన్‌లో తెలిపింది. దర్యాప్తునకు ఎలా ఆటంకం కలిగించాలి, సహాయ నిరాకరణ వంటి అంశాలపై ఈ సమావేశంలో నరేంద్రకుమార్‌ మిగిలిన డైరెక్టర్లకు సూచనలిచ్చారని తెలిపింది. ఈ సమావేశంలో పాల్గొన్న పలువురిని గతంలో విచారించామని, ఇప్పుడు వారందరితో సమావేశం నిర్వహించడమంటే దర్యాప్తులో జోక్యం చేసుకోవడమేనంది.

నోటీసులకు స్పందించడం లేదు..
సమావేశం నిర్వహించిన తరువాత ఈ కేసులో సాక్షులుగా ఉన్న పలువురు డైరెక్టర్లకు సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 కింద దర్యాప్తు అధికారి నోటీసులు ఇచ్చినా.. అనారోగ్య కారణాలు సాకుగా చూపి విచారణకు రాలేదని తెలిపింది. నరేంద్రకుమార్‌కు రెండుసార్లు నోటీసులు జారీచేసి విచారణకు రావాలని కోరగా.. ఆయన కూడా అనారోగ్య కారణాలు సాకుగా చూపారని తెలిపింది. వారంతా ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నారని పేర్కొంది. సాక్షులను దారిలోకి తెచ్చుకోవడం, సాక్ష్యాలను తారుమారు చేయడం, నాశనం చేయడం వంటి ఉద్దేశాలతో నరేంద్ర వ్యవహరిస్తున్నారని, ఇది దర్యాప్తులో జోక్యం చేసుకోడమేనని తెలిపింది.

దర్యాప్తు అధికారి సీఆర్‌పీసీ సెక్షన్‌ 91 కింద నరేంద్రకుమార్‌కు నోటీసు ఇచ్చి కొన్ని డాక్యుమెంట్లను సమర్పించాలని కోరారని, ఇలా కోరే అధికారం దర్యాప్తు అధికారికి లేదంటూ ఆయన సమాధానం ఇచ్చారని తెలిపింది. సంగం అక్రమాలకు సంబంధించి నరేంద్రకుమార్‌ వద్ద ఉన్న డాక్యుమెంట్లు దర్యాప్తునకు ఎంతో కీలకమైనవని పేర్కొంది. సంగం డెయిరీలో జరిగిన పలు అంశాలకు సంబంధించిన సమాచారాన్ని దర్యాప్తులో రాబట్టాలని, వాటి ఆధారాలను తమముందు ఉంచాలని హైకోర్టు ఆదేశించిందని తెలిపారు. నరేంద్రకుమార్‌ మాత్రం దర్యాప్తుకు ఆటంకం కలిగిస్తున్నారని తెలిపింది.
చదవండి: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై అప్పీల్‌

మరిన్ని వార్తలు