లోకేష్‌కి డ్రైవింగ్‌ రాక పార్టీకి ఏం అయ్యిందో చూశాం: కన్నబాబు

26 Oct, 2020 19:15 IST|Sakshi

మొత్తం 50.47 లక్షల మందికి రైతు భరోసా 

సాక్షి, విజయవాడ: రెండో విడత వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ కార్యక్రమాన్ని రేపు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభిస్తారని వ్యవసాయ శాఖమంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. నేరుగా రైతుల ఖాతాల్లోకే డబ్బులు జమ అవుతాయని.. అక్టోబర్ రెండున ఆర్ఓఎఫ్‌ఆర్‌ కింద గిరిజనులకిచ్చిన భూములకు రైతు భరోసా వర్తిస్తుంది అన్నారు. కన్నబాబు మాట్లాడుతూ.. ‘గిరిజనులకు సంబంధించి 11,500 రూపాయలు చెల్లిస్తున్నాం. మొత్తం 50.47 లక్షల మంది రైతులకు నిధులు చెల్లిస్తాం. గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన పంట నష్టం చెల్లించడంతో పాటు మేము మొత్తం ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లించాం. జూన్ - సెప్టెంబర్ వరకు జరిగిన పంట నష్టానికి సంబంధించి ఇన్‌పుట్ సబ్సిడీకి ఇప్పటికే జీఓ కూడా జారీ అయ్యింది’ అన్నారు.

లోకేష్‌ గతం మర్చిపోయినట్లు నటిస్తున్నారు
‘మంచి చేస్తునప్పుడు ప్రతిపక్షాలు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. చంద్రబాబు ధోరణి ఏపీలో పెత్తనం, హైదరాబాద్‌లో కాపురంలా తయారయ్యింది. లోకేష్ నడిపిన ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. ఎవ్వరికీ ఏమి కానందున ప్రభుత్వానికి ఊరట లభించింది. వరద పరిశీలనకు ట్రాక్టర్‌ను ముస్తాబు చేశారు. లోకేష్‌కి డ్రైవింగ్ రాక పార్టీ ఏమయ్యిందో చూశాం. మళ్లీ ట్రాక్టర్ ఎందుకు నడిపారు. రాజకీయం చేద్దాం అనే ప్రయత్నంలో గతాన్ని మరిచిపోయినట్టు లోకేష్ నటిస్తున్నారు. దసరా పండుగకు వచ్చినట్టు ట్రాక్టర్‌ని అలంకరించడం ఏంటి. అమరావతి రైతులు మాత్రమే టీడీపీ దృష్టిలో రైతులు.... మిగతా రైతుల కష్టాలు వారికి పట్టవు. గతంలో రైతులకు ఇస్తాం అన్న హామీలే టీడీపీ నెరవేర్చలేదు’ అని తెలిపారు. (చదవండి: ఆర్బీకేల నుంచే పండ్లు, విత్తనాలు, మొక్కలు)

కమ్యూనిస్ట్‌లు పచ్చజెండా మోస్తున్నారు
‘కమ్యూనిస్ట్‌లు ఎరజెండా బదులు పచ్చ జెండా మోస్తున్నారు. ఇది వరకు పేదలకు ఇళ్ళ పట్టాలు కావాలని, ఆక్రమణలు వద్దు అని ఆందోళన చేసే కమ్యూనిస్ట్‌లు ఇప్పుడు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. తెలుగు దేశం అజెండా మోసినప్పుడే కమ్యూనిస్ట్‌లు చులకన అయిపోయారు. గీతం ఆక్రమణలు సమర్ధించడం దారుణం. చంద్రబాబును కౌగిలించుకున్న ఏ ఒక్కరూ బ్రతికి బయటపడలేదు. పోలవరంపై టీడీపీ చిత్రమైన వాదన చేస్తుంది. లోకేష్‌కి పోలవరం గురించి ఏం తెలుసు. కమిషన్ల కోసం కేంద్రం నుంచి పోలవరం కడతాం అని తీసుకున్నారు. లోకేష్‌కి ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం కూడా రాదు. అమరావతి అని చెప్పి రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేశారు’ అని కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

>
మరిన్ని వార్తలు