డీజీపీ సవాంగ్‌ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు మారన్న

20 Apr, 2021 14:20 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్ర ఒరిస్సా స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు ముత్తన్నగిరి జలంధర రెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయారని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. మావోయిస్టు జలంధర్ రెడ్డి అలియాస్ మారన్నపై 20 లక్షల రివార్డ్ ఉందని డీజీపీ తెలిపారు. పోలీస్ స్టేషన్‌లపై దాడులు చేసిన సంఘటనల్లో మారన్న పాత్ర ఉందన్నారు. ముత్తన్నగిరి జలంధర్ అలియాస్ మారన్న అలియాస్ కృష్ణ (40) కొంపల్లి, సిద్దిపేట జిల్లా, తెలంగాణకు చెందిన మావోయిస్టు అని, మెదక్ డిస్ట్రిక్ట్ కమిటీలో మొదట జాయిన్ అయ్యాడని వెల్లడించారు. ఏఓబీలో పలు దాడులు, 2008 బలివెల సంఘటనలో మారన్న సభ్యుడుగా ఉన్నాడని డీజీపీ సవాంగ్‌ తెలిపారు. 

సున్నిపెంట, ఎర్రగొండపాలెంలో జరిగిన బాంబు పేలుళ్ళలో, విన్నికృష్ణ, మల్ఖాన్‌గిరి కలెక్టర్‌ను కిడ్నాప్ చేసిన ఘటనలో నిందితుడిగా ఉన్నాడని పేర్కొన్నారు. ఆరు హత్యలలో నిందితుడైన మారన్న.. ప్రజా బలం లేక తాను జనజీవనంలోకి రావాలని నిర్ణయించుకున్నాడని తెలిపారు. పార్టీ గతంలో లాగా లేకపోవడం, ఏజెన్సీ ప్రాంతాలలో పార్టీలో రిక్రూట్‌మెంట్‌ లేకపోవడం వల్ల కూడా మారాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఏఓబీలో ఎక్కువగా జరుగుతున్న పోలీస్ యాక్టివిటీస్‌తో రిక్రూట్‌మెంట్‌ లేదంటున్నాడని, ప్రభుత్వం ఇచ్చిన కొత్త లొంగుబాటు పాలసీకి ఆకర్షితుడై స్వయంగా లొంగిపోయాడని తెలిపారు. ఏపీ ప్రభుత్వం నుంచి అతను మారడానికి కావలసిన అన్ని సదుపాయాలు అందిస్తామని డీజీపీ హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు