ఏపీ: వైద్యశాఖ నియామకాల్లో ఉమ్మడి విధానం

7 Aug, 2022 10:17 IST|Sakshi

సాక్షి, అమరావతి: వైద్య విభాగాన్ని బలోపేతం చేసే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో పోస్టుల భర్తీ చేపట్టనుంది. బయో మెడికల్‌ ఇంజినీర్, డైటీషియన్‌ తదితర 42 విభాగాల్లోని 2,572 పారామెడికల్‌ పోస్టులను ఈ నెలలోనే భర్తీచేయాలని నిర్ణయించింది. ఇందులో పబ్లిక్‌ హెల్త్‌ విభాగంలో 466 పోస్టులు, వైద్య విధాన పరిషత్‌లో 806 పోస్టులు, డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌లో 1,300 పోస్టులు ఉన్నాయి. అన్ని విభాగాలు, పోస్టులకు ఉమ్మడిగా నియామకాలు చేపట్టడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉమ్మడిగా నియామక ప్రక్రియను చేపట్టాలని జిల్లాల ఎంపిక కమిటీల (డీఎస్సీ)కు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ శనివారం ఆదేశాలు జారీచేసింది. దీంతో జిల్లాల్లో నోటిఫికేషన్‌ జారీచేసి ఈ నెలాఖరులోగా స్రూ్కటినీ ప్రక్రియ పూర్తిచేసేందుకు ప్రణాళిక సిద్ధంచేశారు. 

ఉమ్మడి నోటిఫికేషన్‌ జారీ
అభ్యర్థులు అన్ని విభాగాల నోటిఫికేషన్లకు వేర్వేరుగా దరఖాస్తు చేయాల్సిన అవసరంలేకుండా, ఉమ్మడిగా నోటిఫికేషన్‌ను జారీచేయనున్నారు. గతంలో టీచింగ్‌ మెడికల్‌ కాలేజీల అనుబంధ ఆస్పత్రులు, వైద్య విధాన పరిషత్, ప్రజారోగ్యం–కుటుంబ సంక్షేమ విభాగాలు ఖాళీలను వేర్వేరుగా భర్తీ చేసుకునేవి. దీనివల్ల అభ్యర్థులు వేర్వేరుగా దరఖాస్తు చేయడానికి ఇబ్బందులు పడేవారు.

ఇకపై అలాంటి ఇబ్బందులను తొలగించేందుకు తొలిసారిగా మూడు విభాగాలకు ఉమ్మడి నోటిఫికేషన్‌ ద్వారా నియామకాలు చేపట్టనున్నట్లు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఎంపిక ప్రక్రియలో అభ్యర్థుల మెరిట్‌ లిస్టును ఏడాదిపాటు పరిగణలోకి తీసుకుంటారు. ప్రస్తుత పోస్టుల భర్తీలో అవకాశం దక్కని వారికి, మెరిట్‌ ఆధారంగా తదుపరి నియామకాల్లో అవకాశం కల్పించనున్నారు. కరోనా కష్టకాలంలో సేవలు అందించిన వారికి నియామకాల్లో మార్కుల వెయిటేజీ కల్పించారు. 

ఉమ్మడి నోటిఫికేషన్‌తో అభ్యర్థులకు మేలు
గతంలో డీఎంఈ, వైద్యవిధాన పరిషత్, పబ్లిక్‌ హెల్త్‌ విభాగాల్లో ఉన్న ఖాళీ పోస్టులకు అర్హతలు ఒక్కటే అయినప్పటికీ భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇచ్చేవి. అభ్యర్థులు కూడా మూడు విభాగాలకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. అందుకు అప్లికేషన్‌ నుంచి మొదలు అన్ని దశల్లోనూ మూడుసార్లు అదనపు భారం, ప్రయాస పడాల్సి వచ్చేది. ఇకపై అలాంటి ఇబ్బందుల్లేకుండా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు విభాగాల్లోను ఉమ్మడిగా నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. అభ్యర్థులు మూడు విభాగాలకు ఒక్క దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఒక్కసారి రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. కౌన్సెలింగ్‌లో అభ్యర్థులు మూడు విభాగాల్లో ఎక్కడ పనిచేయదలచుకున్నారో ఆ విభాగాన్ని ఎంచుకునే అవకాశం వారికే కల్పించింది.

ఉమ్మడి ఎంపికవిధానం ద్వారా ఒక్కో అభ్యర్థికి దరఖాస్తు రుసుం రూ.500 కలిసి రావడంతో పాటు ప్రయాణ ఖర్చులు, సమయం కూడా ఆదా అవుతుంది. ఉమ్మడి భర్తీ ప్రక్రియ, అభ్యర్థుల అర్హతలకు సంబంధించి జిల్లా ఎంపిక కమిటీలకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలు సైతం జారీచేసింది. జిల్లా కలెక్టర్‌ అధ్యక్షుడిగా ఉండే ఎంపిక కమిటీలో వైద్య విధాన పరిషత్, ప్రజారోగ్యశాఖ, డీఎంఈ విభాగాలకు చెందిన అధికారులు కూడా సభ్యులుగా ఉంటారు. దరఖాస్తులను వీరు పరిశీలించి, రిజర్వేషన్లు పాటించి మెరిట్‌ జాబితాను రూపొందిస్తారు.

మరిన్ని వార్తలు