పోలవరంపై ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం.. టీడీపీ ఆరోపణలకు సీఎం జగన్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

19 Sep, 2022 10:28 IST|Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం విషయంలో ఆర్‌ అండ్‌ ఆర్‌ పరిహారం కింద గత ప్రభుత్వం కంటే ఎక్కువే ఇస్తామని చెప్పామని, దానికి సంబంధించిన జీవో కూడా ఇష్యూ చేశామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గుర్తు చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడవ రోజు.. సోమవారం పోలవరంపై చర్చ సందర్భంగా టీడీపీ విమర్శలు, ఆరోపణలకు ఆయన గట్టి కౌంటర్‌ ఇచ్చారు. 

పోలవరం ప్రాజెక్టు కోసం ఏం చెప్పామో.. ఆ చెప్పినదానికి ఒక జీవోను 30 జూన్‌ 2021న ఇచ్చామని జీవో ప్రతిని టీడీపీ సభ్యులకు చూపించారు సీఎం జగన్‌. చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామన్న ఆయన.. ఆర్‌ అండ్‌ ఆర్‌ కింద గత ప్రభుత్వంలో రూ.6.86 లక్షలపరిహారం ప్రకటిస్తే.. తాము అధికారంలోకి వస్తే పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పామని, అందుకు సంబంధించిన జీవో స్పష్టంగా ఉందని తెలియజేశారు. 

లెక్క వేస్తే ఆ ఖర్చు రూ.500 కోట్లు మాత్రమే అన్న ఆయన.. ఎవరూ భయపడాల్సిన, బాధపడాల్సిన అవసరం లేదని.. అమ్మ ఒడి, ఆసరా లాంటి పథకాలకే అంతకు మించి సొమ్ము బటన్‌ నొక్కి బదిలీ చేశామని, కాబట్టి పొలవరం బాధితులకు పునరావాసం పూర్తికాగానే పరిహారం బదిలీ చేస్తామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును నాశనం చేసిందే చంద్రబాబు అని పేర్కొన్న సీఎం జగన్‌.. దాని రిపేర్‌కు తమ ప్రభుత్వం కుస్తీలు పడుతోందని తెలిపారు.

కేంద్రం నుంచి రూ.2,900 కోట్ల నిధులు రావాల్సి ఉందని, ఆ నిధులు బ్లాక్‌ కావడం వెనుక ఘనత చంద్రబాబుదేనని ఎద్దేవా చేశారు సీఎం జగన్‌. ఆనాడే కేంద్రాన్ని నిలదీయాల్సింది పోయి ఇప్పుడు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. పోలవరం పనులు.. నిర్వాసితులకు అందిన పరిహార విషయంలో చంద్రబాబుగారి హయాంలో గణాంకాలు.. తమ ప్రభుత్వ గణాంకాలు పరిశీలిస్తే ఎవరికి చిత్తశుద్ధి ఎంత ఉందో స్పష్టం అవుతుందని సీఎం జగన్‌ తెలిపారు. అంతేకాదు.. ప్రాజెక్టు పనులకు సంబంధించిన స్లైడ్స్‌ వేసి మరీ టీడీపీకి ‘సినిమా’ చూపించారాయన.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు