పటిష్ట చర్యలతో విషజ్వరాలను కట్డడి చేశాం: మంత్రి రజనీ

20 Sep, 2022 10:35 IST|Sakshi

సాక్షి, అమరావతి: విషజ్వరాలతో మరణాలు రాష్ట్రంలో సంభవించలేదని, విషజ్వరాలను సమర్థవంతంగా కట్టడి చేయగలిగామని వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజనీ ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం.. వైద్యారోగ్య శాఖల నాడు-నేడు స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆమె ప్రసంగించారు.

గత ప్రభుత్వంలో(2015-19 మధ్య) 74 వేలకు పైగా మలేరియా కేసులు నమోదు అయ్యాయి. కానీ, ఈ ప్రభుత్వంలో నాలుగు వేల కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. భారీ వర్షాలు, వరదలు పొటెత్తినా కూడా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుని విషజ్వరాలను రికార్డు స్థాయిలో కట్టడి చేయగలిగామని విడదల రజనీ తెలియజేశారు. ప్రాణాంతకంగా మారుతున్న మలేరియా కట్టడి కోసం కూడా చర్యలు తీసుకున్నామని ఆమె తెలిపారు.

వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్న ఆమె.. ఆరోగ్య శ్రీ పథకాన్ని గత ప్రభుత్వం నీరుగార్చిందని, కానీ.. జగనన్న ప్రభుత్వం మాత్రం డెంగ్యూ, మలేరియాలను ఆరోగ్యశ్రీలో చేర్చిందని చెప్పుకొచ్చారు. అదే విధంగా విష జ్వరాల నియంత్రణకు జిల్లా స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించడం, ప్రత్యేక బృందాల క్యాంపులను ఏర్పాటు చేసిన విషయాన్ని ఆమె లేవనెత్తారు.  గత ప్రభుత్వం దోమలపై దండయాత్ర పేరుతో చాలా ఆర్భాటాలు.. ప్రజాధనాన్ని దుబారా చేసిందని మంత్రి రజనీ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆనాడూ ‘దోమలపై దండయాత్ర’ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రకటనను సైతం ఆమె చదివి వినిపించారు. 

సంధ్య ఘటనపై స్పందిస్తూ..
చింతూరు మండలానికి చెందిన చిన్నారి సంధ్య మృతి ఘటన బాధాకరం. వాస్తవానికి.. వైరల్‌ డిసీజ్‌తో చిన్నారి మృతి చెందింది. ఈ విషయాన్ని వైద్యులు ఇచ్చిన రిపోర్టులతో పాటు ఉన్నతాధికారులు ఇచ్చిన నివేదికలు కూడా ఇచ్చారని ఆమె ప్రతులు చూపించారు. పొరుగు రాష్ట్రానికి సంధ్య కుటుంబం వెళ్లిందని టీడీపీ విమర్శిస్తోందని.. భద్రాచలం పరిధిలో అందుబాటులో ఉంది కాబట్టే సంధ్య కుటుంబం అక్కడికి వెళ్లిందని మంత్రి రజనీ తెలిపారు. ఈ ఘటనపై కూడా టీడీపీ సభ్యులు రాజకీయం చేయడం సరికాదని, ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి విడదల రజనీ మండిపడ్డారు.

ఇదీ చదవండి: పారిశ్రామిక పరుగులపై సీఎం జగన్‌ ఏమన్నారంటే..

మరిన్ని వార్తలు