అబద్ధాలు అచ్చేసిన రామోజీని సభకు పిలిచి విచారించాలి

16 Mar, 2023 04:17 IST|Sakshi

తప్పు కేశవ్‌దో.. రామోజీదో తేలాలి

సభా హక్కుల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకోవాలి

గవర్నర్‌ను అవమానించారంటూ ఈనాడు కథనంపై అధికారపక్ష సభ్యుల మండిపాటు

గవర్నర్‌కు స్వాగతం పలికిన దృశ్యాల వీడియో సభలో ప్రదర్శన

ఎల్లో మీడియా దుష్ప్రచారంపై సభలో ప్రత్యేక చర్చ జరపాలని విజ్ఞప్తి

సాక్షి, అమరావతి: చట్ట సభను, రాజ్యాంగ వ్యవస్థను, గవర్నర్‌ను కించపరిచేలా అబద్ధాలను ఈనాడులో అచ్చేసి రామోజీరావు సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని, ఆయన్ను సభకు పిలిచి విచారించి, కఠిన చర్యలు తీసుకోవాలని శాసనసభలో అధికారపక్షం డిమాండ్‌ చేసింది. సీఎం రాకకోసం గవర్నర్‌ వేచి ఉండాలా అని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అన్నట్టు ప్రస్తావిస్తూ ఈనాడు రాసిన తప్పుడు కథనంపై బుధవారం శాసనసభ అట్టుడికింది.

గవర్నర్‌ను కించపరుస్తూ ఈనాడు అచ్చేసిన కథనంపై సభా హక్కుల ఉల్లంఘన కింద ప్రివిలేజ్‌ కమిటీ విచారణ చేపట్టి కేశవ్‌ తప్పు మాట్లాడారా.. రామోజీ తప్పు రాశారా.. అనే విషయం తేల్చాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ సభ్యులు పట్టుబట్టారు. ఈనాడు వార్త క్లిప్పింగ్‌లతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించిన సభ్యులు.. ఎల్లో మీడియాను ఏకిపారేశారు. అలాంటి వ్యాఖ్యలు తాను చేయలేదని దమ్ముంటే నిరూపించాలని పయ్యావుల కేశవ్‌ అనడంపై అధికారపక్ష సభ్యులు మండిపడ్డారు.

సభకు దమ్ము ధైర్యం అని సవాలు చేయవద్దని, కేశవ్‌ తప్పు మాట్లాడినా, ఈనాడు తప్పు రాసినా ప్రివిలేజ్‌ కమిటీ విచారణలో నిర్ధారణ అయితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ చర్చకు అడుగడుగునా టీడీపీ సభ్యులు అడ్డుతగలడంతో సభ దృష్టికి వాస్తవాలు తెచ్చేందుకు తొలిరోజున గవర్నర్‌కు స్వాగతం పలికిన వీడియోను ప్రదర్శించి సభ్యులకు వాస్తవాలు చూపించారు. అయినప్పటికీ పయ్యావుల కేశవ్‌ పదే పదే వాదనకు దిగడంతో గవర్నర్‌ విషయంలో ఆయన చేసిన కామెంట్ల వీడియో సైతం సభలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, అధికారపార్టీ నేతలు మాట్లాడారు. 

రాజ్యాంగ వ్యవస్థను అవమానించడమే: మంత్రి బుగ్గన
గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు స్వాగతం పలకడంలో ప్రొటో­కాల్‌ పాటించలేదంటూ అబ­ద్ధపు రాతలు రాయడం రాజ్యా­ంగ వ్యవస్థను అవమానించడమే. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్వయంగా వెళ్లి గవర్నర్‌కు ఘనస్వాగతం పలికి సభలోకి తీసుకొచ్చారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఉదయం 9.45 గంటలకు అసెంబ్లీకి వచ్చారు. 9.53కు గవర్నర్‌ వచ్చారు. గవర్నర్‌ను రిసీవ్‌ చేసుకున్న సీఎం 10.02 గంటలకు స్పీకర్‌ చాంబర్‌కు తీసుకొచ్చారు.

గవర్నర్‌కు గొంతు ఇన్ఫెక్షన్‌ కారణంగా ఆయన అభ్యర్థన మేరకు కొంత సేపు ఆగి ఆయన రెడీ అయిన తర్వాత గౌరవ సభలోకి తీసుకొచ్చాం. ప్రభుత్వ పనితీరు, విజన్‌ను గవర్నర్‌ చదివితే.. ఆ ప్రసంగాన్ని సైతం టీడీపీ సభ్యులు చాలా హేళన చేశారు. తప్పుడు వార్తలతో గౌరవ సభను, గవర్నర్‌ను అవమానిస్తూ కథనాలు రాసిన ఈనాడుపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా స్పీకర్‌ను కోరుతున్నా.  

చంద్రబాబు, ఎల్లో మీడియా తోడుదొంగలు: మాజీ మంత్రి కన్నబాబు
టీడీపీకి విషపుత్రికలుగా ఎల్లో మీడియా రోజురోజుకు దిగజారిపోతోంది. చంద్రబాబు, ఎల్లోమీడియా తోడుదొంగలుగా కలిసి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ రాష్ట్రంలో భయానక పరిస్థితులు సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారు. ఎల్లో మీడియా వక్రీకరణపై అసెంబ్లీలో చర్చ జరపాలి. టీడీపీ, ఎల్లోమీడియా అబద్ధాలు ప్రచారం చేస్తూ, రాజ్యాంగ వ్యవస్థలను కించపరిచేలా వ్యవహరిస్తున్నాయి. 

విలువలులేని టీడీపీ: మంత్రి నాగార్జున
ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై గౌరవం ఉంటే గవర్నర్‌ ప్రసంగం కాగితాలను చించివేసి టీడీ­పీ సభ్యులు మధ్యలోనే వెళ్లిపో­యేవారు కాదు. విలువలు, విశ్వసనీయత లేని రాజకీయం చేస్తున్న టీడీపీ సభ్యులు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు. సభా హక్కుల ఉల్లంఘన విషయంలో రామోజీరావుపై చర్యలు తీసుకోవాలి.

చర్చ జరగాల్సిందే: మంత్రి అంబటి
సభలో చర్చ జరగకపోతే ఈనా­డు రాసిందే నిజ­మని ప్రజలు అను­కుంటారు. ప్రజలకు వా­స్త­వా­లను ఈ సభ ద్వారా తెలి­యచేయాలి. టీడీపీ సభ్యులు సభా సంప్రదా­యాలను మర్చిపోతున్నారు. సీనియర్‌ నాయకుడు పయ్యావుల కేశవ్‌ సభలో దమ్ము ఉందా అంటూ మాట్లాడటం శోచనీయం. మాకు దమ్ముంది కాబట్టే 151 స్థానాలు ఇచ్చారు. మిమ్మల్ని ప్రజలు దుమ్ముదుమ్ముగా ఓడించారు. మళీŠల్‌ మిమ్మల్ని ఓడించడం ఖాయం. స్పీకర్‌ను దమ్ముందా అంటూ మాట్లాడిన వారికి సభలో ఉండే అర్హత లేదు. 

దమ్ము లేకనే బాబు పారిపోయాడు: మంత్రి జోగి రమేశ్‌
చంద్రబాబుకు చాదస్తం పెరిగిపోయింది. ఆ పార్టీ సభ్యుడు పయ్యావుల కేశవ్‌కు పైత్యం పుట్టుకొచ్చింది. దమ్ములేకనే మీ నాయకుడు చంద్రబాబు సభ నుంచి పారిపోయాడు. బయట చంద్రబాబు, సభలో టీడీపీ సభ్యులు అసత్యాలతో ప్రభుత్వంపైన, సీఎంపైన బురద జల్లుతున్నారు. రాజ్యాంగ వ్యవస్థను కించపరిచినట్టు అంగీకరిస్తే కేశవ్‌ను, లేకుంటే ఈనాడులో అసత్యాలు ప్రచురించినందుకు రామోజీరావును సభకు పిలిపించి మోకాళ్లపై నిలబెట్టాలి.

రాష్ట్రానికి శని ఎల్లో మీడియా: మంత్రి దాడిశెట్టి రాజా
రాష్ట్రానికి ఎల్లో మీడియా శనిలా పట్టుకుంది. పూర్తి అసత్యాలతో కూడిన పేపర్లు నిత్యం ప్రభుత్వంపై విషం చిమ్ముతూనే ఉన్నాయి. అటువంటి సంస్థలను కచ్చితంగా శిక్షించాలి. రాజ్యాంగ వ్యవస్థను అవమానించేలా ఈనాడులో రాతలు రాసిన రామోజీరావును తీసుకొచ్చి సభలో నిలబెట్టాలి. 

బీసీలంటే బాబుకు అలుసు: మంత్రి అప్పలరాజు
ప్రభుత్వంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి స్పీక­ర్‌గా అవకాశం కల్పిస్తే ప్ర­తిపక్ష నాయకుడిగా చంద్ర­బాబు స­భ­లో ఉండి కూడా మిమ్మ­ల్ని­(స్పీకర్‌) చైర్‌లో కూర్చోబెట్టడానికి రాలే­దు. ఇ­ప్పుడు ఆ పార్టీ సభ్యుడు దమ్ముందా అంటూ చైర్‌ ప­ట్ల దురుసు ప్రవర్తన కూడా బీసీలను కించప­రిచేలా ఉంది. రాజ్యాంగ వ్యవస్థలు, ప్రభుత్వం, సీఎంను అవమానించేలా మాట్లాడిన కేశవ్‌ను ప్రి­విలేజ్‌ కమిటీ ద్వారా విచారించి కఠినంగా శిక్షించాలి. 

కేశవ్‌ ప్రవర్తనను సభ ఖండిస్తోంది: మంత్రి చెల్లుబోయిన వేణు
టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ దురుసు ప్రవర్తనను సభ మొత్తం ఖండిస్తోంది. సభా వ్యవహారాల్లో అధికార పక్షం సమన్వయం పాటిస్తూ, ప్రజలకు మేలు చేసే అంశాలను ప్రస్తావిస్తుంటే ప్రతిపక్షం అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. సభా మర్యాదకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నారు.  

చర్యలు తీసుకోవాల్సిందే: మంత్రి బొత్స
రాజ్యాంగ వ్యవస్థను కించపరిచేలా వ్యవహరించడం దారుణం. ఇటువంటి తప్పు కేశవ్‌ చేసినా, ఈనాడు పేపర్‌ చేసినా చర్యలు తీసుకోవాల్సిందే.

మరిన్ని వార్తలు