అక్కచెల్లెమ్మల ప్రగతే మా లక్ష్యం

5 Dec, 2020 03:05 IST|Sakshi

అమూల్‌తో ఒప్పందం ద్వారా పాలకు అధిక ధర చెల్లింపు, ఆపైన బోనస్‌

రూ.3 వేల కోట్లతో గ్రామాల్లో పాల సేకరణకు ఏర్పాట్లు

అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సహకార డెయిరీలను ఖూనీ చేసిన చంద్రబాబు

హెరిటేజ్‌ కోసం చిత్తూరు డెయిరీని మూసేసిన ఘనత ఆయనదే

బాబు అధికారంలో ఉంటే హెరిటేజ్‌ షేర్‌ పరుగులు  

అలా పెరగడం అంటే రిగ్గింగ్‌ చేశారనాలా?

అయినా మా లక్ష్యం చంద్రబాబు కాదు..

‘అమూల్‌ వల్ల హెరిటేజ్‌ చావదు. వేరే రాష్ట్రాలకు వెళ్లి పాలు సేకరిస్తుంద’ని నిన్న లోకేశ్‌ ఏదో టీవీలో అన్నారట. అంటే అర్థం వారు ఇంత కాలం తక్కువ ధర ఇస్తున్నారనే కదా? చంద్రబాబు మీద కోపంతోనో, హెరిటేజ్‌ టార్గెట్‌గానో అమూల్‌ను తేలేదు. మా రాడార్‌ లో చంద్రబాబు లేరు. మా లక్ష్యం చంద్రబాబు కాదు. మా మైండ్‌ సెట్‌ కూడా అది కాదు. అమూల్‌ అనేది సహకార దిగ్గజం. లక్షలాది మంది అక్క చెల్లెమ్మలకు మేలు చేయాలి.. చేయూత ఇవ్వాలనే తపన, ఆరాటంతోనే అమూల్‌తో ఒప్పందం చేసుకున్నాం. బాబు, హెరిటేజ్‌ అనేవి చాలా చిన్న విషయాలు.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 27 లక్షల మంది అక్క చెల్లెమ్మల ఆర్థిక, వ్యాపార ప్రగతి.. ప్రజలకు నాణ్యమైన పాలు, పాల ఉత్పత్తుల సరఫరా లక్ష్యంగా దేశంలోనే అతి పెద్ద సహకార డెయిరీ ‘అమూల్‌’తో ఒప్పందం కుదుర్చుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. 50 దేశాల్లో పోటీ పడుతున్న అతి పెద్ద సహకార డెయిరీ అమూల్‌ ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో ఉందని, ఇందులో రైతులే వాటాదారులని పేర్కొన్నారు. అధిక ధరకు పాలు కొనుగోలు చేయించడం ద్వారా పాడి రైతులు, అక్క చెల్లెమ్మల ఆదాయం పెంచడమే కాకుండా లాభాల్లో బోనస్‌ కూడా ఇప్పించడం కోసమే ప్రభుత్వం అమూల్‌ను తీసుకొచ్చిందని వివరించారు. అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం (ఎంఓయూ)పై అసెంబ్లీలో శుక్రవారం జరిగిన చర్చ సందర్భంగా సహకార రంగంలోని డెయిరీలను చంద్రబాబు సర్కారు ఖూనీ చేసిన తీరును సీఎం జగన్‌ ఆధార సహితంగా ఎండగట్టారు. ‘నా పాదయాత్ర సందర్భంగా కొందరు మినరల్‌ వాటర్‌ బాటిల్‌ చూపించి రూ.21కి కొన్నామన్నారు. లీటరు పాలకు కూడా దాదాపు అదే ధర వస్తోందని చెప్పారు. మినరల్‌ వాటర్‌తో సమాన ధరకు వారు పాలు అమ్ముకోవాల్సి రావడం దారుణం. పశువులను అమ్ముకుందామనుకున్నామని, ఇప్పుడు మంచి ధర వస్తుందనే నమ్మకం కలిగిందని మొన్న ఏపీ – అమూల్‌ ప్రారంభోత్సవం సందర్భంగా అక్కచెల్లెమ్మలు సంతోషం వ్యక్తం చేశారు’ అని వివరించారు. సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

రాష్ట్రంలో ఎందుకు ఈ పరిస్థితి?
– రాష్ట్రంలో పాలు పోసే వారికి ఒక పద్ధతి ప్రకారం మంచి ధర రానివ్వకుండా చేశారు. అలా సహకార రంగాన్ని ఒక పద్ధతి ప్రకారం చంపేశారు. సహకార డెయిరీలను ఖూనీ చేసి ప్రయివేటు డెయిరీలు ఏకమై  స్వార్థంతో ఒకే ధర నిర్ణయిస్తున్నాయి.  
– దీంతో వాటికి పోలు పోయడం లేదా పాడి పశువులను అమ్ముకోవడం తప్ప రైతులకు, అక్క చెల్లెమ్మలకు గత్యంతరం లేకుండా పోయింది. ఒక వ్యక్తి ప్రైవేటు డెయిరీ స్థాపించి దాన్ని లాభాల్లో ముంచాలనే స్వార్థంతో రాష్ట్రంలోని మొత్తం సహకార రంగాన్ని చంపేయడం వల్లే ఈ దుస్థితి ఏర్పడింది. ఇందుకు ఆ ఒక్క వ్యక్తి స్వార్థమే కారణం.

‘మ్యాక్స్‌’ చట్టంతో గ్రహణం
– 1992లో హెరిటేజ్‌ డెయిరీ ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే 1995లో ‘పరస్పర సహాయ సహకార సంఘాల’ (మ్యాక్స్‌) చట్టం తెచ్చారు. నియమాలన్నింటినీ తుంగలో తొక్కి విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల డెయిరీలను చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా మ్యాక్స్‌ చట్టం పరిధిలోకి తెచ్చింది. 
– విశాఖ జిల్లా సహకార సంఘాన్ని 2006లో.. గుంటూరు, ప్రకాశం జిల్లాల సహకార సంఘాలను 2013లో ప్రొడ్యూసర్‌ కంపెనీల కింద మార్చేయడం ఇంకా అన్యాయం. ఇవాళ ఎవరైనా సంగం డెయిరీని సహకార రంగంలోని డెయిరీ అని చెబుతారా? ధూళిపాళ్ల నరేంద్ర అనే వ్యక్తి దాన్ని ప్రైవేటు సంస్థలా నడుపుతున్నారు. ఆ విధంగా సహకార రంగాన్ని ఒక పద్ధతి ప్రకారం ఖూనీ చేశారు. 

హెరిటేజ్‌ కోసం చిత్తూరు డెయిరీ మూసివేత
– చిత్తూరు డెయిరీ ఒకప్పుడు ‘హెరిటేజ్‌’కి పోటీ పడిందని, 2003లో చంద్రబాబు దానిని మూసేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 
– దొరబాబు.. (ఈయన్ను బీఎస్‌ రాజ నర్సింహులు అని కూడా అంటారు)ను చిత్తూరు డెయిరీ చైర్మన్‌ను చేసి.. ఆయన ద్వారా విజయవంతంగా మూసి వేయించారు. అందుకు రివార్డుగా ఆయన్ను ఎమ్మెల్సీ చేశారు. 
 – 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక రూ.100 ఉన్న హెరిటేజ్‌ షేర్‌ ధర 2017 డిసెంబర్‌ నాటికి రికార్డు స్థాయిలో రూ.827కు పెరిగింది. ?ఆయన సీఎంగా ఉన్నప్పుడు షేర్‌ విలువ ఇలా పెరగడాన్ని ఏమనాలి? షేర్‌ రిగ్గింగ్‌ చేశారేమో! బాబు అధికారం నుంచి దిగిపోయిన తర్వాత 2020 మార్చి నాటికి హెరిటేజ్‌ షేర్‌ ధర మళ్లీ రూ.205కు పడిపోయింది. 
– బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి రుణాలు తీసుకున్న వారు హెరిటేజ్‌ డెయిరీకే పాలు పోయాలనే దారుణమైన నిబంధన పెట్టారు. ఇంత దారుణమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? 

అమూల్‌ లాభాల్లోనూ అక్కచెల్లెమ్మలకు వాటా
– వీటన్నింటి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం 2020 జూలై 21న అమూల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అమూల్‌ రావడం వల్ల పాడి రంగంలో ఉన్న 27 లక్షలకు పైగా అక్క చెల్లెమ్మలకు ప్రయోజనం చేకూరుతుంది. రైతుల నుంచి పాలను అధిక ధరకు కొనుగోలు చేయించడం ఈ ఒప్పందం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం. ‘అమూల్‌’ లాభాల్లో కూడా పాలు పోస్తున్న అక్కచెల్లెమ్మలకు ఏటా రెండు సార్లు వాటా ఇప్పిస్తాం. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇదెంతో దోహదపడుతుంది.  
– రాష్ట్ర వ్యాప్తంగా 9,899 గ్రామాల్లో పాల ఉత్పత్తి ఎక్కువగా ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఆయా గ్రామాల్లో రూ.16.90 లక్షలతో భవనం, రూ.10 లక్షలతో బీఎంసీయూ, రూ.1.40 లక్షలతో ఆటోమేటిక్‌ పాల సేకరణ యూనిట్‌.. మొత్తం రూ.3 వేల కోట్లతో ఏర్పాటు చేస్తాం. తొలి దశలో వైఎస్సార్‌ కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో 400 గ్రామాల్లో పాల సేకరణ మొదలైంది. లంచాలు, దళారుల మాటే ఉండదు.
– ఇప్పటికే 7 వేల ఆవులు, గేదెలు పంపిణీ చేశాం. 2021 ఫిబ్రవరి నాటికి లక్ష యూనిట్ల ఆవులు, గేదెలు ఇస్తాం. 2021 ఆగస్టు నుంచి 2022 ఫిబ్రవరి వరకు మరో 3.69 లక్షల యూనిట్ల ఆవులు, గేదెలు ఇస్తాం.

అమూల్‌ ఇచ్చే ధర ఎంత ఎక్కువంటే..
– ? లీటరు గేదె పాలను (6 శాతం ఫ్యాట్, 9 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌) హెరిటేజ్‌ సంస్థ రూ.33.60తో, దొడ్ల డెయిరీ రూ.34.20, జెర్సీ సంస్థ రూ.34.80తో కొనుగోలు చేస్తుండగా, అమూల్‌ రూ.39కి కొనుగోలు చేయనుంది.  
?– 10 శాతం ఫ్యాట్, 9 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌ ఉన్న గేదె పాలను సంగం, హెరిటేజ్‌ సంస్ధలు రూ.58తో, జెర్సీ సంస్థ రూ.60కి కొనుగోలు చేస్తుండగా, అమూల్‌ రూ.64.97కు కొనుగోలు చేయనుంది. 
–  ఆవు పాలు లీటరు (3.5 శాతం ఫ్యాట్, 8.5 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌)కు హెరిటేజ్‌ సంస్థ రూ.23.12 ఇస్తుంటే, అమూల్‌ రూ.28 చెల్లించనుంది. 
  
చేయూతలో దాదాపు 24.55 లక్షల అక్క చెల్లెమ్మలకు, ఆసరాలో దాదాపు 87 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు డబ్బు ఇస్తున్నాం. ఈ డబ్బును సరైన పద్దతిలో రిస్క్‌ లేని చోట పెట్టిస్తే వారికి రెగ్యులర్‌గా ఆదాయం వస్తుంది. దాని వల్ల వారు లక్షాధికారులు అవుతారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూరుతుంది. ఈ సమున్నత ఆశయం, ఆరాటంతోనే అమూల్, ఐటీసీ, రిలయన్స్‌ లాంటి సంస్థలను తీసుకొచ్చాం. అంతే తప్ప, చంద్రబాబు, హెరిటేజ్‌లను దెబ్బ తీయాలని కాదు. మాది అంత చౌకబారుగా ఆలోచించే తత్వం కాదు.  

మరిన్ని వార్తలు