తొలిరత్నం రైతుభరోసా

1 Dec, 2020 05:15 IST|Sakshi

వ్యవసాయ రంగంపై శాసనసభలో చర్చ సందర్భంగా సీఎం జగన్‌

మొదట చెప్పిన దానికన్నా రైతు భరోసా ఎక్కువ ఇస్తున్నాం

18 నెలల కాలంలో దాదాపు రూ. 13 వేల కోట్లు 

రైతులకు అన్ని దశల్లో అండగా నిలబడేందుకే రైతు భరోసా కేంద్రాలు

వైఎస్సార్‌ జలకళ ద్వారా ఉచితంగా బోర్లు, మోటార్లు

పగటి పూట 9 గంటల నాణ్యమైన విద్యుత్‌కు రూ. 1,800 కోట్లు

అమూల్‌తో ఒప్పందంతో రైతులకు మెరుగైన ధరలు

సాక్షి, అమరావతి: ఇచ్చిన మాట తప్పకుండా అమలు చేస్తున్న అందరి ప్రభుత్వం కాబట్టే దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా అర కోటి మందికి పైగా రైతులకు.. రైతు భరోసా సొమ్ము నేరుగా వారి బ్యాంక్‌ ఖాతాలలో జమ అవుతోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. అలా జమ చేసిన సొమ్ము వారి పాత అప్పుల కింద బ్యాంకులు మినహాయించుకోలేని విధంగా ఇస్తున్నామని తెలిపారు. దాదాపుగా 50 లక్షల మంది రైతులకు సంవత్సరానికి రూ. 13,500 చొప్పున 5 సంవత్సరాలలో మొత్తం రూ. 67,500 నేరుగా వారి చేతుల్లో పెట్టబోతున్నామని తెలిపారు.

నవరత్నాలలో మొట్టమొదటి పథకం రైతు భరోసా అని, నాలుగేళ్లలో ఒక్కో రైతుకు రూ. 12,500 చొప్పున మొత్తం రూ. 50 వేలు ఇస్తామని మొదట్లో చెప్పామని, కానీ ఇప్పుడు రైతుగా తోడుగా ఉండేందుకు మానవత్వంతో ఒక్కో రైతుకు రూ. 13,500 చొప్పున ఇస్తున్నామని వివరించారు. అంటే, మాట ఇచ్చిన దానికన్నా ఒక్కో రైతుకు రూ.17,500 అదనంగా అందుతోందన్నారు. కౌలు రైతులకు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ గిరిజన రైతులకు కూడా రైతు భరోసా అందిస్తున్నామని, కోటికి పైగా రైతు కుటుంబాలకు ఈ 18 నెలల కాలంలోనే దాదాపు రూ.13 వేల కోట్లు రైతు భరోసా కింద ఇచ్చామని తెలిపారు. వచ్చే జనవరిలో ఇచ్చే రూ.2 వేలు కూడా ఇందులో కలిపామని చెప్పారు. వ్యవసాయ రంగంపై శాసనసభలో చర్చ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు. ఆ ప్రసంగం ఆయన మాటల్లోనే..

ఆర్‌బీకేలతో అన్నదాతలకు సేవలు
విత్తనం నుంచి అమ్మకం వరకు ప్రతి దశలోనూ రైతుకు అండగా నిలబడేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. రైతు అవస్థ తెలిసిన వ్యక్తిని కాబట్టి, వారిని అన్ని విధాలుగా ఆదుకునే కార్యక్రమం ఇది. రాష్ట్ర వ్యాప్తంగా పేద రైతులకు అండగా ప్రతి నియోజకవర్గంలోనూ వారికి వైఎస్సార్‌ జలకళ ద్వారా బోర్లు వేయించడమే కాకుండా మోటార్లు కూడా ఉచితంగా అందించబోతున్న ప్రభుత్వం మనది మాత్రమే. ఏటా 50 వేల బోర్లు వేసే దిశగా అడుగులు వేస్తున్నాం.

ఈ కార్యక్రమానికి రూ. 4 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం. గత ప్రభుత్వం ఉచిత విద్యుత్‌కు చెల్లించకుండా పెట్టిన రూ. 8,655 కోట్ల బకాయిలను ఈ ప్రభుత్వమే చెల్లించింది. ధాన్యం సేకరణ బకాయిలు రూ. 960 కోట్లు. అవి కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదు. అందుకే ధాన్యం సేకరణ తర్వాత రెండు వారాల్లోనే చెల్లించాలని చెబుతున్నాం. ఇంకా గత ప్రభుత్వం పెట్టిన విత్తనాల సబ్సిడీ బకాయిలు రూ. 384 కోట్లు, రైతులకు వడ్డీ లేని రుణాల కింద చెల్లించాల్సి ఉన్న రూ. 1,030 కోట్లు.. ఇవన్నీ మన రైతుల మీద ప్రేమతో మన ప్రభుత్వం చెల్లించింది.

పగటి పూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్‌
రైతులకు పగటిపూటే 9 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను రూ. 1,800 కోట్లు వెచ్చించి అందిస్తున్న ప్రభుత్వం మనది. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం ద్వారా లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని సకాలంలో తిరిగి చెల్లించిన రైతుల వడ్డీని పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఇందుకోసం 2019 ఖరీఫ్‌కు సంబంధించి ఇప్పటికే రూ. 510 కోట్లు చెల్లించాం.

బీమా ప్రీమియం పూర్తిగా చెల్లిస్తున్నాం..
బీమా ప్రీమియంను కూడా పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తోంది. 2019 ఖరీఫ్‌కు సంబంధించి రైతులు తమ వాటాగా కేవలం ఒక్క రూపాయి చెల్లించగా, రాష్ట్రంలో రైతులందరి తరఫున కట్టాల్సిన రూ. 506 కోట్లు, ప్రభుత్వ వాటాగా చెల్లించాల్సిన రూ. 524 కోట్లు.. మొత్తం రూ. 1,030 కోట్లు బీమా ప్రీమియం చెల్లించగా, ఈ డిసెంబర్‌ 15న బీమా పరిహారం (క్లెయిమ్‌లు) రూ. 1,227 కోట్లు బీమా కంపెనీలు చెల్లించనున్నాయి.

రైతుకు సాంకేతికంగా వెన్నుదన్ను
13 జిల్లాల్లో జిల్లా స్థాయి అగ్రి ల్యాబ్‌లు, మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 147 ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్‌లు (గ్రామీణ నియోజకవర్గాల్లో) ఏర్పాటు చేస్తాం. వాటి ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరీక్షలు నిర్వహించి ధ్రువీకరించిన వాటినే రైతులకు అందిస్తున్న ప్రభుత్వం మనది.

వ్యవసాయ అనుబంధ రంగాలకూ పెద్దపీట..
కేవలం వ్యవసాయంతో మాత్రమే లాభసాటి కాదని చెప్పి, చేయూత కార్యక్రమం తీసుకువచ్చాం. అందులో భాగంగా డెయిరీకి ప్రోత్సాహం. అందు కోసం ఆవులు, గేదెలు 4.68 లక్షల యూనిట్లు కొనుగోలు చేయిస్తున్నాం. 2.49 లక్షల మేకలు, గొర్రెల యూనిట్లు కొనుగోలు చేస్తున్నాం. అమూల్‌ సంస్థతో అవగాహన కూడా కుదుర్చుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 9,899 బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు (బీఎంసీయూ) ఏర్పాటు చేస్తున్నాం.

అమూల్‌తో పాల ధర అధికం..
కడప, ప్రకాశం జిల్లాలలో చూస్తే లీటరు గేదె పాలను (6 శాతం ఫ్యాట్, 9 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌) హెరిటేజ్‌ సంస్థ రూ. 34కు, దొడ్ల డెయిరీ రూ. 32కు కొనుగోలు చేస్తుండగా, అమూల్‌ రూ. 39కి కొనుగోలు చేయబోతుంది. ఆ విధంగా రూ. 5 నుంచి రూ.7 ఎక్కువ ఇవ్వబోతుంది. గేదె పాలను ప్రకాశం జిల్లాలో లీటరు (10 శాతం ఫ్యాట్, 9 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌) సంగం, హెరిటేజ్‌ సంస్థలు రూ. 58 లకు, జెర్సీ రూ.60 లకు కొనుగోలు చేస్తుండగా, అమూల్‌ రూ. 64.97కు కొనుగోలు చేయనుంది.

ఆ విధంగా దాదాపు ఐదు నుంచి ఏడు రూపాయలు ఎక్కువగా చెల్లించబోతున్నది. ఇక ఆవు పాలకు సంబంధించి చిత్తూరు జిల్లాలో లీటరుకు హెరిటేజ్‌ సంస్థ రూ. 23.12లు, సంగం డెయిరీ రూ. 25.20లు, జెర్సీ రూ.24.89 లు చెల్లిస్తుండగా.. అమూల్‌ రూ.28 చెల్లించనుంది. ఆ విధంగా దాదాపు రూ.3 నుంచి రూ.5 ఎక్కువ ధర రైతులకు రానుంది. గ్రామీణ వ్యవస్థలో రైతులకు ఎలా మేలు చేయాలనే ప్రభుత్వం ఉండాలి తప్ప, వారిని ఎలా పిండాలన్న ఆలోచన ఉండకూడదు. అందుకే ఈ ప్రభుత్వం ఆ వ్యవస్థను మార్చబోతున్నది.

ఆక్వా రైతులకు భరోసా..
ఇంకా ఆక్వా రైతులకు రూ. 1.50కే యూనిట్‌ విద్యుత్‌ సరఫరా చేయడం వల్ల ప్రభుత్వంపై ఏటా రూ. 720 కోట్ల భారం పడుతోంది. అయినా చిరునవ్వుతో ప్రభుత్వం భరిస్తోంది. ఆక్వా ఉత్పత్తులు గ్రామాల్లోని జనతా బజార్లలో దొరుకుతాయి. ప్రాసెసింగ్‌ యూనిట్లు, కోల్డ్‌ స్టోరేజీ యూనిట్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. 35 చోట్ల ఆక్వా ల్యాబ్‌లు ఏర్పాటు చేయబోతున్నాం. ఆక్వా యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నాం.

రూ.15 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేశాం
2019–20లో దాదాపు రూ.15 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు, కోవిడ్‌ సమయంలో కూడా రైతులకు అండగా నిలబడుతూ మొక్కజొన్న, సజ్జ, జొన్న, పొగాకు, ఉల్లి, పసుపు, టమోటా, అరటి, బత్తాయి తదితర ఉత్పత్తులు 8,84,882 టన్నులు కొనుగోలు చేసి రూ. 3,491 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం మనది. ఇంకా సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కోసం మరో రూ. 666 కోట్లు ఖర్చు చేశాం. రైతులకు మంచి ధరలు అందించాలన్న లక్ష్యంతో ఫలానా పంటలను కొనుగోలు చేస్తామని ముందుగానే ధరలు నిర్ణయించి రైతులకు తెలియజేస్తున్నాం. అవన్నీ ఆర్బీకేలలో ప్రదర్శిస్తున్నాం.

తద్వారా మార్కెట్‌లో పోటీ వాతావరణం కల్పిస్తున్నాం. కనీస గిట్టుబాటు ధరలు లభించని పక్షంలో రైతుల నుంచి ప్రభుత్వమే పంటలను నేరుగా కొనుగోలు చేస్తుంది. కొనుగోలు చేసిన పంటలకు అదనపు విలువ (వాల్యూ యాడిషన్‌) జోడించి, తిరిగి మార్కెట్‌లో విక్రయించడం జరుగుతుంది. అందుకే సెకండరీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు రూ. 3 వేల కోట్లతో ఏర్పాటు చేయబోతున్నాం. త్వరలోనే గ్రామాల రూపురేఖలు మారబోతున్నాయి. గోదాములు, ఆర్బీకేలు, జనతా బజార్లు కనిపిస్తాయి. రెండో దశ ప్రాససింగ్‌ యూనిట్లు కూడా రాబోతున్నాయి. మొత్తం ఈ కార్యక్రమం కోసం రూ. 10 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం.
 

మరిన్ని వార్తలు