ఖమ్మంలో కార్పొరేటర్‌గా గెలవలేని ఆమె అమరావతి గురించి మాట్లాడటమా?

15 Sep, 2022 14:33 IST|Sakshi

సాక్షి, అమరావతి: మూడు ప్రాంతాలు అభివృద్ధి కావాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాలనే సీఎం జగన్‌ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఒక కులానికో, మతానికో వ్యతిరేకంగా వికేంద్రీకరణ చేయడం లేదని.. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ అని స్పష్టం చేశారు. అసెంబ్లీలో గురువారం వికేంద్రీకరణపై స్వల్పకాలిక చర్చ జరిగింది.

ఈ సందర్భంగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ.. 'సీఎం జగన్‌పై బురద​ జల్లడమే కొందరు పనిగా పెట్టుకున్నారు. వాళ్లకు రాష్ట్రాన్ని బాగుచేయాలనే ఉద్దేశం లేదు. చంద్రబాబు బినామీలు దళితులను భయపెట్టి అసైన్డ్‌ భూములను లాక్కున్నారు. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తామంటే కోర్టుకెళ్లి అడ్డుకున్నారు. అశ్వనీదత్‌, రాఘవేంద్రరావు వంటి వారికి కోరుకున్న చోట అమరావతిలో భూములిచ్చారు. చంద్రబాబు తనకు కావాల్సిన వారికి కారుచౌకగా భూములు కట్టబెట్టారు.

అమరావతిలో ధనికులే ఉండాలా.. పేదలు ఉండొద్దా?. అమరావతిని కమరావతి, భ్రమరావతి చేసింది చంద్రబాబు కాదా?. అమరావతి ప్రకటించక ముందు ఎకరం రూ.50లక్షలు ఉంటే గ్రాఫిక్స్‌తో ఎకరం రూ.5కోట్లకు తీసుకెళ్లారు. అమరావతిలో టీడీపీ నేతలందరికీ భూములు ఉన్నాయి. ఇతర ప్రాంతాల్లోని భూములు అమ్మి అమరావతిలో కొన్నారు. అమరావతిని చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ కంపెనీగా మార్చారు. భూములుకొన్నవాళ్లే అమరావతి రాజధాని కావాలంటున్నారు.

టీడీపీ నేతలకు రాష్ట్రాభివృద్ధి అవసరం లేదు.. స్వార్థ ప్రయోజనాలే కావాలి. దుర్మార్గులంతా కలిసి రోడ్లపైకి వచ్చారు. పాదయాత్ర రాజధాని కోసమా.. చంద్రబాబు కోసమా?. ఖమ్మంలో కార్పొరేటర్‌గా గెలవలేని రేణుకా చౌదరి అమరావతి గురించి మాట్లాడటమా?. ఒక్క ప్రాంతమే అభివృద్ధి అయితే.. మిగతా ప్రాంతాలు ఏం కావాలి?. ఓ నలుగురి చేతిలో చంద్రబాబు కీలుబొమ్మ అయ్యారు. 40 ఆలయాలు కూల్చిన దుర్మార్గుడు చంద్రబాబు. ఇప్పుడు దేవుడి గురించి మాట్లాడుతున్నారు' అంటూ కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చదవండి: (బీఏసీలో అచ్చెన్నాయుడికి సీఎం జగన్‌ ఆఫర్‌)

మరిన్ని వార్తలు