టీడీపీ తీరు షరా మామూలే

20 Sep, 2022 08:13 IST|Sakshi

‘వ్యవసాయం’పై బుధవారం చర్చిస్తామన్న ప్రభుత్వం

అయినా సభా కార్యకలాపాలను అడ్డుకునేందుకు గలాభా 

దీంతో ఒకరోజుపాటు టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌ 

వారి తీరుపై స్పీకర్‌ అసంతృప్తి

సాక్షి, అమరావతి: శాసనసభలో వరుసగా మూడోరోజు కూడా ప్రతిపక్ష టీడీపీ సభ్యుల తీరు మారలేదు. పాలనాపరమైన అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధమన్నా సరే సభలో గలాభా సృష్టించేందుకే ఆ పార్టీ మొగ్గుచూపింది. ప్రజలకు ఉపయోగపడే అంశాలపై చర్చల కంటే సభ నుంచి పలాయనానికే మరోసారి ప్రాధాన్యమిచ్చింది. సోమవారం మధ్యాహ్నం భోజన విరామానంతరం సభ ప్రారంభం కాగానే రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిపై సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడేందుకు స్పీకర్‌ తమ్మినేని సీతారాం అనుమతించారు. కానీ, టీడీపీ సభ్యులు వ్యవసాయ రంగంపై చర్చించాలని పట్టుబట్టారు. వ్యవసాయం, రైతుల అంశాలపై బుధవారం సభలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పీకర్‌ చెప్పినప్పటికీ వారు వినిపించుకోలేదు. ప్రభుత్వం చర్చకు వెనుకంజ వేస్తే అభ్యంతరం తెలపాలి గానీ, చర్చించేందుకు సిద్ధమని ప్రకటించాక అడ్డుకోవడం తగదని స్పీకర్‌ ఎంతగా చెప్పినా వారు వినిపించుకోలేదు. ప్లకార్డులు పట్టుకుని స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టారు. అంతేకాక, ఎమ్మెల్యేలు బాలవీరాంజనేయస్వామి, వెలగపూడి రామకృష్ణబాబు, మంతెన రామరాజు, జోగేశ్వరరావు, బుచ్చయ్యచౌదరి తదితరులు స్పీకర్‌ పోడియంపైకి చేరుకుని సభను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీనిపై చీఫ్‌ విప్‌ ముదునూరు ప్రసాదరాజు మాట్లాడుతూ ప్రజలకు సంబంధించిన అంశాలపై చర్చించే విషయంలో టీడీపీ సభ్యులకు ఏమాత్రం చిత్తశుద్ధిలేదని విమర్శించారు. ఎంత త్వరగా సస్పెండై బయటకు వెళ్లిపోవాలన్నదే వారి ఉద్దేశంగా ఉందని మూడు రోజులుగా తెలుస్తూనే ఉందన్నారు.

వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతుల అంశంపై మాట్లాడేందుకు టీడీపీ సభ్యులకు ధైర్యంలేదని విమర్శించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇప్పటికే సభకు ముఖం చాటేయగా ఆ పార్టీ సభ్యులూ బయటకెళ్లి తమ పచ్చ మీడియాతో మాట్లాడాలని భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎంతగా సర్దిచెప్పినప్పటికీ టీడీపీ సభ్యుల తీరు మారకపోవడంతో వారిని సస్పెండ్‌ చేసేందుకు తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని శాసనసభా వ్యవహారాల శాఖను సోమవారం పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషాను ఆదేశించారు. దాంతో టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్, బుచ్చయ్యచౌదరి, ఆదిరెడ్డి భవానీ, పెతకంశెట్టి గణబాబు, చినరాజప్ప, జోగేశ్వరరావు, పయ్యావుల కేశవ్, వెలగపూడి రామకృష్ణబాబు, రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, బాలవీరాంజనేయ స్వామిలను సస్పెండ్‌ చేయాలని అంజాద్‌బాషా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. దాంతో స్పీకర్‌ వారిని ఒకరోజు సస్పెండ్‌ చేశారు.  

సభను అడ్డుకునేందుకే వస్తున్నారు : సీఎం జగన్‌ 
ఇక కేవలం అసెంబ్లీ కార్యక్రమాలను అడ్డుకోవాలనే దురాలోచనతోనే టీడీపీ సభ్యులు సభకు వస్తున్నారని సీఎం వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. శాసనసభ కార్యకలాపాలను వారు అడ్డుకోవడంపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. ప్రజలకు ఉపయోగపడే అంశాలపై చర్చ జరగకూడదు.. ప్రజలకు నిజాలు తెలియకూడదనే ఉద్దేశంతోనే వారు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వ్యవసాయ అంశాలపై బుధవారం చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. అందుకు స్పీకర్‌ అనుమతించిన తరువాత కూడా టీడీపీ సభ్యుల ప్రవర్తన మారకపోవడాన్ని సీఎం తప్పుబట్టారు. చంద్రబాబు సభకు రారు.. వీళ్లను పంపించి సభను అడ్డుకోవాలని ప్రయత‍్నింస్తారని విమర్శించారు. టీడీపీ సభ్యులను అవసరమైతే సస్పెండ్‌చేసి సభా కార్యక్రమాలను సజావుగా సాగేలా.. ప్రజలకు ఉపయోగపడేలా చూడాలని ఆయన స్పీకర్‌కు సూచించారు.

ప్రజలే నిర్ణయిస్తారు: స్పీకర్‌ తమ్మినేని సీతారాం
మరోవైపు.. అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రజలకు ఉపయోగపడే అంశాలపై చర్చించేందుకు ఉద్దేశించిన సభా కార్యక్రమాలను ప్రతిపక్ష సభ్యులు పదేపదే అడ్డుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఉద్దేశపూర్వకంగానే సభను అడ్డుకుంటున్న వారిని ఈ సమావేశాల వరకూ సస్పెండ్‌ చేయవచ్చన్నారు. కానీ, ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశమివ్వాలన్న ఉద్దేశంతో సంయమనంతో వ్యవహరిస్తున్నానన్నారు. అందుకే వారికివ్వాల్సిన సమయం కంటే ఎక్కువ సేపు మాట్లాడేందుకు అనుమతిస్తున్నా వారు ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని స్పీకర్‌ తమ్మినేని సీతారాం చెప్పారు. ప్రజలకు అన్ని విషయాలను తెలియాలని, వారే అంతిమ నిర్ణేతలన్నారు.

ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై ‘సుప్రీం’ స్పందన.. మార్గదర్శి, రామోజీకి నోటీసులు

>
మరిన్ని వార్తలు