ఏపీ: టీడీపీ పెగాసెస్‌ వ్యవహారంపై అసెంబ్లీ హౌస్‌ కమిటీ

25 Mar, 2022 14:17 IST|Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ పెగాసెస్‌ వ్యవహారంపై శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారం హౌస్‌ కమిటీ వేశారు. ఈ కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని నియమించారు. అదే విధంగా కమిటీ సభ్యులుగా భాగ్యలక్ష్మి, అబ్బయ్య చౌదరి, కొలుసు పార్థసారధి, అమర్నాథ్‌, మేరుగు నాగార్జున, మద్దాల గిరిధర్‌ను నియమించారు.

కాగా రాష్ట్రంలో పెగసస్‌ స్పైవేర్‌ బాగోతం గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. టీడీపీ హయాంలో పెగసస్‌ స్పైవేర్‌ను కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో దీనిపై పెద్దఎత్తున చర్చ మొదలైంది. రాష్ట్ర శాసనసభలోనూ సోమవారం తీవ్ర దుమారం రేపింది.

అప్పటి ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నేతల ఫోన్ల ట్యాపింగ్‌ వ్యవహారం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. దీంతో స్పైవేర్‌ ఉదంతంపై  హౌస్‌ కమిటీ ఏర్పాటుచేయాలని సోమవారమే అసెంబ్లీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజైన శుక్రవారం నాడు టీడీపీ పెగాసెస్‌ వ్యవహారంపై స్పీకర్‌ హౌస్‌ కమిటీ వేశారు.
చదవండి: మూడేళ్లలో 95 శాతం హామీలు నెరవేర్చాం​: సీఎం జగన్‌

మరిన్ని వార్తలు