AP Assembly Session 2021: త్వరలోనే సమగ్రమైన పూర్తి వికేంద్రీకరణ బిల్లుతో ముందుకు వస్తాం: సీఎం జగన్‌

22 Nov, 2021 09:19 IST|Sakshi

Time: 03:20 PM

► మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది. త్వరలోనే సమగ్రమైన పూర్తి వికేంద్రీకరణ బిల్లుతో ముందుకు వస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడింది.

Time: 03:10 PM

► రాజధాని అంశంపై అసెంబ్లీలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. కనీస వసతులకు ఎకరానికి 2 కోట్లు అవుతాయని సీఎం జగన్ తెలిపారు. 50 వేల ఎకరాలకు లక్ష కోట్లు ఖర్చు అవుతుందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. 

Time: 03:05 PM
► రాజధాని అంశంపై ఏపీ అసెంబ్లీలో  సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ... ఈ  ప్రాంతం అంటే తనకు వ్యతిరేకత లేదని, తన ఇల్లు కూడా ఇక్కడే ఉందని అన్నారు. 

Time: 02:55 PM

► రాజధాని అంటే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కాదని మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌ అన్నారు. చంద్రబాబుది ఊహాజనిత రాజధాని మాత్రమే అని.. బుగ్గన రాజేంద్రనాథ్‌ విమర్శించారు.

Time: 02:50 PM

► కోస్తాను వెనుకబడిన ప్రాంతంగా శ్రీకృష్ణ కమిటీ చెప్పలేదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తెలిపారు. అన్ని రాష్ట్రాలు వికేంద్రీకరణకే ప్రాధాన్యత ఇచ్చాయని బుగ్గన పేర్కొన్నారు. ఒకే ప్రాంతం అభివృద్ధి చెందితే.. వేర్పాటు వాదం వస్తుందని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందన్నారు. 

Time: 02:40 PM

ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లులపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మాట్లాడుతూ.. రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాలని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని శివరామకృష్ణన్‌ కమిటీ స్పష్టం చేసిందని తెలిపారు.

Time: 02:30 PM
► ఏపీ అసెంబ్లీ ముందుకు మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లు చర్చకు వచ్చింది. ఈ బిల్లును ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అసెంబ్లీలో ప్రవేశపెట‍్టగా.. బిల్లుపై చర్చకు ఏపీ అసెంబ్లీ స్పీకర్‌  తమ్మినేని సీతారాం  అనుమతించారు. బిల్లుపై అసెంబ్లీలో చర్చ కొనసాగుతోంది. 

Time: 02:13 PM

► రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు కారణంగా కొన్ని  జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించామన్నారు. అన్ని రకాల సహాయక చర్యలు ప్రభుత్వం చేపట్టిందన్నారు.

Time: 10:46 AM

ఏపీ శాసనమండలి రేపటికి వాయిదా పడింది.

ఎమ్మెల్సీ కరీమున్నీసా మృతికి శాసనమండలిలో సభ్యులు నివాళర్పించారు. కరీమున్నీసా సేవలను మంత్రులు, ఎమ్మెల్సీలు కొనియాడారు. శాసనమండలిలో ఎమ్మెల్సీ కరీమున్నీసాకు సంతాప తీర్మానాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరీమున్నీసా హఠాన్మరణం చాలా బాధ కలిగిస్తుందన్నారు.

‘‘నిన్నటి వరకు మన మధ్యలో ఉన్న సోదరి ఇవాళ లేరు.  కరీమున్నీసా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ గా ఎదిగారు. విజయవాడ నగర కార్పొరేటర్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొని అందరి మన్ననలను పొందారు. సామాన్యులు కూడా  రాజకీయంగా సముచిత స్థానం ఇవ్వాలన్న ఆలోచనతో కరీమున్నీసాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శాసనమండలికి పంపారు.  కరీమున్నీసా ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నామని.. వారి కుటుంబానికి అండగా ఉంటామని’’ బుగ్గన రాజేంథ్రనాథ్‌ అన్నారు.
 

Time: 10:25 AM

బీసీల సమగ్ర అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. వెనుక బడిన తరగతుల అభివృద్దికి అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నమన్నారు. వెనుకబడిన తరగతుల అభివృద్దికి కొత్తగా మూడు చట్టాలు తీసుకొచ్చామని అన్నారు.

Time: 10:02 AM

జగనన్న విద్యాదీవెన కింద ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చామని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. సుమారు 37 లక్షల మందికిపైగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చామన్నారు. జగనన్న విద్యాదీవెన పథకంతో స్కూళ్లలో అడ్మిషన్లు పెరిగాయన్నారు. పిల్లల భవిష్యత్‌ను గత ప్రభుత్వం పక్కనపెట్టిందని గోవర్థన్‌రెడ్డి అన్నారు.

Time: 9:32 AM

మహిళ భద్రతకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. అసెంబ్లీలో దిశ చట్టంపై చర్చలో ఆమె మాట్లాడుతూ, మహిళలపై జరిగే నేరాలను నియంత్రించ గలిగామని తెలిపారు. 89 లక్షల మందికిపైగా దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ప్రతి పీఎస్‌లో ఉమెన్‌ హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశాం. దిశ చట్టంపై ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు చేపట్టామని సుచరిత పేర్కొన్నారు.

Time: 9:15 AM

సాక్షి, అమరావతి: మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. హార్టికల్చర్‌ నర్సరీల రిజిస్ట్రేషన్‌ సవరణ బిల్లును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రవేశపెట్టనున్నారు. బీసీ కుల జనాభా గణన తీర్మానాన్ని మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ఎస్సీ,బీసీ,మైనార్టీల సంక్షేమంపై స్వల్ప కాలిక చర్చ జరగనుంది.

మరిన్ని వార్తలు