బ్లాక్‌ ఫంగస్‌ పనిపట్టే ఔషధాలు ఇవే

11 Jun, 2021 20:31 IST|Sakshi

దేశవ్యాప్తంగా బ్లాక్‌ఫంగస్‌ ఇంజక్షన్లకు కొరత ఏర్పడటంతో సమస్యలు తలెత్తుతున్నాయి. బ్లాక్‌ ఫంగస్‌ బాధితుల చికిత్స కోసం వినియోగించే యాంఫోటెరిసిన్‌ బి, పొసకొనజోల్‌ ఇంజక్షన్ల ఉత్పత్తి తగినంతగా లేకపోవడం, ఒక్కో పేషెంటుకు ఎక్కువ ఇంజక్షన్లు వాడాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 10 శాతం మంది పేషెంట్లకు కూడా యాంఫోటెరిసిన్‌ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రత్యామ్నాయాలపై కృషి జరుగుతోంది. ఈ క్రమంలో ఆయుర్వేద మందులకు ప్రాధాన్యం పెరుగుతోంది. గతంలో ఎన్నో రకాల ఫంగస్‌లను నియంత్రించిన చరిత్ర ఆయుర్వేద ఔషధాలకు ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయామాలు చేస్తూ ఆయుర్వేద మందులు వాడితే బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడకుండా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.

సాక్షి, అమరావతి: కేంద్ర ఆయుష్‌ శాఖ మూడు రకాల ఆయుర్వేద మందులను బ్లాక్‌ఫంగస్‌ నిరోధక ఔషధాలుగా ప్రకటించింది. శంషమన వటి 500 మిల్లీగ్రాములు, నిషామలకి వటి 500 మిల్లీ గ్రాములు, సుదర్శన ఘణవటి 500 మిల్లీ గ్రాముల మోతాదులో మాత్రలను ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వాడితే మ్యూకార్‌ మైకోసిస్‌ బారిన పడకుండా కాపాడుకోవచ్చని మార్గదర్శకాలు జారీచేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మంచి ప్రత్యామ్నాయమని ఆయుష్‌ శాఖ పేర్కొంది. దీంతోపాటు ఆయుష్‌ – 64 అనే మందునూ వాడుకోవచ్చని అధికారికంగా ప్రకటించారు. నిపుణుల పర్యవేక్షణలో వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. అల్లోపతి మందులు వాడుకుంటూనే ఆయుర్వేద మందులూ తీసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. 

ఆహారంలో ఇవి తీసుకోవాలి.. 
ఆహారంలో ప్రధానంగా ఔషధ గుణాలున్నవి ఉండేలా చూసుకోవాలని ఆయుర్వేద వైద్యులు పేర్కొంటున్నారు పసుపు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి తప్పకుండా ఉండాలి. తులసి, దాలి్చన చెక్క, నల్లమిరియాలు కూడా మంచివి. నల్లద్రాక్ష, వేరుశనగ పప్పు, పిస్తా, మల్బరీస్, స్ట్రాబెర్రీ లాంటివి రోగ నిరోధక శక్తి పెరిగేలా దోహదం చేస్తాయి. జామకాయ, బత్తాయి, కమలా, నిమ్మ, కాప్సికం లాంటి వాటితోపాటు, మునగాకుతో వండిన కూరలతో  మంచి ఉపయోగం ఉంటుంది.

చికిత్స, నివారణ.. రెండిటికీ
‘‘ఆయుర్వేద మందులకు ఉన్న గొప్ప గుణం ఏమిటంటే చాలా రకాల వ్యాధులు వచి్చన తర్వాత వాటిని తగ్గించేందుకు, రాకుండా కాపాడేందుకూ ఉపయోగపడతాయి. ఈ ఔషధాలను వైద్యుడి పర్యవేక్షణలోనే తీసుకోవాలి. బ్లాక్‌ఫంగస్‌ ప్రధానంగా ఇమ్యూనిటీ తగ్గినప్పుడే వస్తుంది. రోగ నిరోధక శక్తి పెంచే గుణాలు ఆయుర్వేద మందుల్లో ఉన్నాయి. క్రమం తప్పకుండా సూచించిన మేరకు వాడితే మంచి ఫలితాలు వస్తాయి. శతాబ్దాల క్రితమే చరక సంహితలో ఈ వ్యాధులకు సంబంధించి సూచనలు చేశారు’’ 
–డా.కె.విజయభాస్కర్‌రెడ్డి, ప్రొఫెసర్, శల్య విభాగం, ఎస్వీ ఆయుర్వేద కాలేజీ, తిరుపతి

నియంత్రించే నేత్ర బిందువులు.. 
‘‘నిషామలకి, మహాలక్ష్మీ విలాస రస్‌ మందులతో పాటు ఎలనీర్‌ కుజాంబు అనే నేత్ర బిందువులు వేసుకుంటే బ్లాక్‌ ఫంగస్‌ నియంత్రణకు బాగా ఉపయోగపడతాయి. కబాసురా కుడినీర్‌ అనే మందు ఉదయం పూట, ఆయుష్‌ క్వాత అనే మందు రాత్రిపూట తీసుకుంటే ఫంగస్‌ నియంత్రణకు ఎంతో ఉపకరిస్తాయి. క్రమం తప్పని వ్యాయామం శరీర పటుత్వాన్ని పెంచుతుంది’’ 
–డా.కేదార్‌నాథ్, ఆయుర్వేద వైద్యుడు

బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స, నివారణకు ఆయుర్వేద ఔషధాలు ఇలా
►  పంచ వల్కల కషాయంతో వ్యాధి సోకిన ప్రాంతాన్ని శుభ్రపరచి ఆరిన తర్వాత మహాతిక్త ఘృతం పూయాలి. 
►  పథ్యాది కాడ మూడు పూటలా 15 ఎంఎల్‌ మోతా దు మించకుండా వాడాలి 
►  నింబామృతాది ఏరండ తైలం 10 ఎంఎల్‌ పడుకునే ముందు 3 రోజుల పాటు వాడాలి 
► సంశమనవటి/గిలోయి ఘణవటి మూడు పూటలా వాడాలి  
► గంధక రసాయనం 500 ఎంజీ మోతాదుతో మూడు పూటలా వాడాలి 
►  నిషామలకి 500ఎంజీ ఉదయం, సాయంత్రం వాడాలి 
►  సుదర్శన ఘణవటి 500 ఎంజీ మూడు పూటలా వాడాలి 
► బృహత్‌వాత చింతామణి ఉదయం, సాయంత్రం వాడాలి 
►  క్రమేవృద్ధి లక్ష్మీ విలాస రస్‌ ఉదయం, సాయంత్రం వాడాలి.

చదవండి: రాష్ట్రంలో 1,551 బ్లాక్‌ఫంగస్‌ కేసులు

మరిన్ని వార్తలు