FSBS: వీర్యోత్పత్తిలో ఘన కీర్తి బనవాసి

19 Dec, 2021 10:04 IST|Sakshi

దేశంలోనే ప్రత్యేక గుర్తింపున్న ఘనీకృత పశు వీర్యోత్పత్తి కేంద్రం

మేలు జాతి పశు సంతతి అభివృద్ధికి దశాబ్దాలుగా కృషి

‘ఏ’ గ్రేడ్‌ గుర్తింపు ఇచ్చిన కేంద్ర బృందం

నెలకు 1.5 – 2.0 లక్షల డోసుల నాణ్యమైన వీర్యం ఉత్పత్తి

ఎమ్మిగనూరు రూరల్‌: నాణ్యమైన పశు వీర్యానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది కర్నూలు జిల్లాలోని బనవాసి ఘనీకృత వీర్యోత్పత్తి కేంద్రం. మన రాష్ట్రంలో నంద్యాల, విశాఖపట్నం, బనవాసిలలో, తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌లో ఘనీకృత పశు వీర్యోత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. వీటిలో బనవాసి కేంద్రానికి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ ఏటా లక్షల డోసుల నాణ్యమైన పశు వీర్యాన్ని ఉత్పత్తి చేయడంతోపాటు దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నారు. దశాబ్దాలుగా మేలు జాతి పశు సంతతి అభివృద్ధికి ఈ కేంద్రం దోహదపడుతోంది. దీంతోపాటు గొర్రెలు–మేకల పరిశోధన కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. త్వరలో యంగ్‌ బుల్‌ (ఒంగోలు జాతి ఎద్దులు) పెంపక కేంద్రం ఏర్పాటుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. 

ఐఎస్‌వో గుర్తింపు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని బనవాసి ఫారంలో 1986వ సంవత్సరంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 8.98 ఎకరాల్లో ఈ కేంద్రం విస్తరించి ఉంది. మేలు జాతి ఆబోతుల నుంచి నాణ్యత గల వీర్యాన్ని ఉత్పత్తి చేయటం, తద్వారా అధిక పాల దిగుబడినిచ్చే పశు సంతతిని అభివృద్ధి చేయటం, కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా నాణ్యమైన దూడలను ఉత్పత్తి చేయటం ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశం.

బనవాసి ఆబోతు వీర్య కేంద్రానికి బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌ సంస్థ 2010 అక్టోబర్‌లో ఐఎస్‌వో సర్టిఫికెట్‌ను జారీ చేసింది. అలాగే, 2020 మార్చిలో గ్రేడింగ్‌ చేయటానికి వచ్చిన కేంద్ర బృందం ఈ కేంద్రానికి ‘ఏ’ గ్రేడ్‌ ఇచ్చింది. మేలు జాతి పశు సేకరణ మొదలు పర్యవేక్షణ, వీర్య ఉత్పత్తి, వీర్యాన్ని భద్రపరచటం, సరఫరా చేయటం వంటి ప్రతి అంశం ఇక్కడ సాంకేతిక పరిజ్ఞానంతో జరుగుతుంది. 

ప్రత్యేక పర్యవేక్షణ
బనవాసి వీర్యోత్పత్తి కేంద్రంలో ప్రధానంగా పశువుల వ్యాధి నిరోధకతపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇక్కడ పశువుల ఆరోగ్య పరిరక్షణను అనుభవజ్ఞులైన వైద్యాధికారులు, వీర్య సేకరణ పరీక్షలను నిపుణులైన శాస్త్రవేత్తలు చేపడుతున్నారు. ఆబోతులకు నాణ్యమైన దాణా సరఫరా చేయటం, క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయటం, గొంతు వాపు, గాలికుంటు వ్యాధి, తెలిరియస్, అంత్రాక్స్‌ వంటి వ్యాధులను నిర్ధారించేందుకు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించటం చేస్తుంటారు. వ్యాధి నిర్ధారణ కోసం రక్త నమునాలు, పేడ, మూత్రంను బెంగళూరులోని ఎస్‌ఆర్‌డీడీఎల్‌ ల్యాబ్‌కు పంపుతారు. అదే విధంగా రాష్ట్రంలోని వీబీఆర్‌ఐ–హైదరాబాద్, ఏడీడీఎల్‌–కర్నూల్‌ వారికి పంపి వ్యాధి నిర్ధారణ, పరిరక్షణలో ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారు. 

వీర్యోత్పత్తి – సరఫరా 
బనవాసి ఆబోతు వీర్య కేంద్రంలో నెలకు సరాసరి లక్షన్నర నుంచి రెండు లక్షల డోసుల వరకు నాణ్యమైన వీర్యాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. 2018–2019లో 21,59,442 వీర్యాన్ని ఉత్పత్తి చేయగా 20,44,098 డోసులను పంపిణీ చేశారు. 2019–2020లో 17,61,951 డోసుల వీర్యాన్ని ఉత్పత్తి చేస్తే, 13,61,985 డోసులను పంపిణీ చేశారు. 2020–2021 (నవంబర్‌ వరకు)లో 14,48,713 డోసుల వీర్యాన్ని ఉత్పత్తి చేయగా, 13,28,803 లక్షల డోసులను పంపిణీ చేశారు. ఈ కేంద్రంలో ఉత్పత్తి చేసిన వీర్యాన్ని గతంలో మన రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాలకు సరఫరా చేసేవారు. కరోనా నేపథ్యంలో ఏడాది నుంచి రాష్ట్రంలోని 13 జిల్లాలకు మాత్రమే వీర్యాన్ని సరఫరా చేస్తున్నారు.

87 రకాల పశువులు
మేలి రకం జాతి సంతతి పశువులను అభివృద్ధి చేసేందుకు ఈ కేంద్రంలో కొన్ని దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ వివిధ జాతులకు చెందిన 87 రకాల పశువులు ఉన్నాయి. ఇందులో ముర్రా జాతి సంతతికి చెందిన 39 రకాలు, జెర్సీ జాతి రకాలు 12, హోల్‌స్టీమ్‌ ఫ్రీషిమన్‌ జాతి (హెచ్‌ఎఫ్‌) 9, క్రాస్‌ బీడ్‌ జెర్సీ జాతి (సీబీజేవై) 14, సీబీహెచ్‌ఎఫ్‌ రకాలు 7, జీఐఆర్‌ రకం 2, సహివాల్‌ రకం 1, మేహసన 3 చొప్పున మొత్తం 87 రకాల పశువులు ఇక్కడ ఉన్నాయి. 

మేలి రకం పశుగ్రాసం సాగు
బనవాసి కేంద్రంలో వినియోగించే పశుగ్రాసం సాగుకు 400 ఎకరాల అటవీ భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం 210 ఎకరాల్లో పశుగ్రాసాన్ని పెంచుతున్నారు. ప్రధానంగా మొక్కజొన్న, జొన్నతోపాటు సూపర్‌ నేపియర్, పారాగడ్డి వంటి నాణ్యమైన పశుగ్రాసాలను పండిస్తున్నారు. 

మంచి డిమాండ్‌..
దేశంలో బనవాసి ఘనీకృత ఆబోతు వీర్య కేంద్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ ఉత్పత్తి చేస్తున్న వీర్యానికి మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్‌ ఉంది. మేలు జాతి పశువుల అభివృద్ధి, ఆబోతుల పరిరక్షణకు ప్రత్యేక పద్ధతులు పాటిస్తూ లక్ష్యాన్ని సాధిస్తున్నాం. 
– డిప్యూటీ డైరెక్టర్, బనవాసి ఆబోతు కేంద్రం

మరిన్ని వార్తలు