మైనింగ్, విద్యుదుత్పత్తి జోరు

17 Oct, 2021 02:58 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: కోవిడ్‌ సంక్షోభం నుంచి పారిశ్రామిక రంగం వేగంగా పుంజుకుంటోంది. ముఖ్యంగా మైనింగ్, విద్యుత్‌ ఉత్పత్తి రంగాల్లో దేశీయ సగటు కంటే రాష్ట్రం మెరుగైన వృద్ధిరేటు నమోదు చేసినట్లు గణాంకాల శాఖ తాజా నివేదికలో పేర్కొంది. కోవిడ్‌తో భారీగా దెబ్బతిన్న మైనింగ్‌ రంగం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల కాలానికి (ఏప్రిల్‌ – జూలై) 37.4 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా మైనింగ్‌ రంగంలో 25.3 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది. ఇక 2020–21 ఏప్రిల్‌ – జూలైతో పోలిస్తే విద్యుత్‌ ఉత్పత్తిలో రాష్ట్రంలో 23.1 శాతం వృద్ధి నమోదైంది.

ఇదే సమయంలో దేశవ్యాప్తంగా విద్యుత్‌ ఉత్పత్తిలో వృద్ధి రేటు 15.2 శాతానికే పరిమితమైంది. నాలుగు నెలల కాలానికి రాష్ట్ర తయారీ రంగంలో 20.7 శాతం వృద్ధి నమోదు కాగా దేశవ్యాప్తంగా 39 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం మీద చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల కాలంలో రాష్ట్ర పారిశ్రామికోత్పత్తిలో 22.8 శాతం వృద్ధి నమోదైనట్లు గణాంకాల శాఖ తెలిపింది. 

పెరుగుతున్న కొనుగోళ్ల శక్తి
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో కొనుగోళ్ల శక్తిని పెంచుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది నాలుగు నెలల కాలంలో వివిధ రంగాల్లో ప్రజల వినియోగంలో గణనీయమైన వృద్ధిరేటు నమోదైంది. గతేడాది నిర్మాణ రంగంలో నాలుగు నెలల కాలంలో 41.7 శాతం క్షీణత నమోదు కాగా ఈ ఏడాది ఏకంగా 56 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం.

ఎలక్ట్రానిక్‌ వస్తువుల వినియోగంలో 57.8 శాతం, పేస్టులు, సౌందర్య సాధనాలు, ఇంటిని శుభ్రపరచే నాన్‌ కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ వినియోగంలో 156.4 శాతం వృద్ధి నమోదైనట్లు గణాంకాల శాఖ పేర్కొంది. గతేడాది కోవిడ్‌తో దెబ్బతిన్న ప్రైమరీ, క్యాపిటల్‌ గూడ్స్, ఇంటర్‌మీడియట్‌ గూడ్స్‌ రంగాలు కూడా క్రమంగా వృద్ధి బాట పట్టాయి.  

మరిన్ని వార్తలు