ఇంధన పొదుపులో ఏపీనే లీడర్‌ 

4 Feb, 2023 07:57 IST|Sakshi

ఎనర్జీ ఎఫిషియన్సీలో మిగిలిన రాష్ట్రాలకు ఏపీ బ్రాండ్‌

రాష్ట్రంలో 12 వేల ఎనర్జీ క్లబ్స్‌ ఏర్పాటుకు ప్రణాళికలు

ప్రతి క్లబ్‌కి ఏటా రూ.10 వేల వరకు ప్రోత్సాహకాలు

ఏపీలో ఇంధన పొదుపు ద్వారా ఏటా రూ.3500 కోట్లు ఆదా

‘సాక్షి’తో బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ సెక్రటరీ ఆర్‌ కే రాయ్‌

సాక్షి, విశాఖపట్నం: ఇంధన సామర్థ్య నిర్వహ­ణలో అన్ని రాష్ట్రాలకు ఏపీ స్టేట్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌ మిషన్‌­(ఏపీఎస్‌ఈసీఎం) లీడర్‌గా వ్యవహరిస్తోందని బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) సెక్రటరీ రాకేష్‌ కే రాయ్‌ వెల్లడించారు. ఎనర్జీ ఎఫిషియన్సీలో మిగిలిన రాష్ట్రాలకు ఏపీని బ్రాండ్‌గా చూపిస్తున్నామని తెలిపారు. ఇంధన పొదుపునకు ప్రత్యేకంగా స్టేట్‌ డిజిగ్నేటెడ్‌ ఏజెన్సీ (ఎస్‌డీఏ)లు ఏర్పాటు చేయడం శుభ పరిణామమని చెప్పారు. ఆయన గురువారం ‘సాక్షి’తో మాట్లాడుతూ పలు అంశాలను వివరించారు. వాటిలో ప్రధానమైనవి..

ఏపీలో ఏటా రూ.3,500 కోట్లు ఆదా
ఇంధన సామర్థ్య చర్యల్ని పటిష్టంగా అమలు చేయడంలో ఏపీ ప్రభుత్వం ముందంజలో ఉంది. అన్ని రాష్ట్రాలకూ ఏపీఎస్‌ఈసీఎం ఆదర్శంగా నిలుస్తోంది. ఇందుకోసం ఏపీలో ప్రత్యేకంగా ఎనర్జీ కన్జర్వేషన్‌ మిషన్, స్టేట్‌ డిజిగ్నేటెడ్‌ ఏజెన్సీలు ఏర్పాటు చేయడం విశేషం. ఏపీ అనుసరిస్తున్న విధానాల్ని దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని నిర్ణయించాం. దేశంలో తొలిసారిగా రాష్ట్రపతి అవార్డుని ఏపీఎస్‌ఈసీఎం దక్కించుకోవడం ఇంధన పొదుపుపై ఏపీ విధానాలకు నిదర్శనం. ఇప్పటికే పవర్‌ ప్లాంట్స్, సిమెంట్, టెక్స్‌టైల్స్, డిస్ట్రిబ్యూషన్‌ సంస్థలు ఇలా.. రాష్ట్రంలోని మొత్తం 53 గుర్తింపు పొందిన భారీ పరిశ్రమలు బీఈఈ ప్రమాణాలకు అనుగుణంగా ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేస్తున్నాయి. దీని ద్వారా 3,430 మిలియన్‌ యూనిట్లు ఆదా చేస్తున్నాయి. దీని ద్వారా పెర్‌ఫార్మ్‌ అచీవ్‌ ట్రేడ్‌ (ప్యాట్‌) అమలులో ఏపీ ఇప్పటికే అద్భుతమైన పనితీరు కనబరుస్తోంది. ఏపీలోని పరిశ్రమల్లో ఇంధన పొదుపు ద్వారా ఏటా రూ.3,500 కోట్లు ఆదా అవుతోంది.

ఏపీలో 12 వేల ఎనర్జీ క్లబ్‌లు ఏర్పాటు
ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బీఈఈ విభిన్న కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా భవిష్యత్తు వారధులైన విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థలని భాగస్వామ్యం చేస్తూ దేశవ్యాప్తంగా లక్ష ఎనర్జీ క్లబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ఏపీలో 12 వేల క్లబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి క్లబ్‌కు ఏటా రూ.10 వేలు నిధులు సమకూరుస్తాం. ఈ క్లబ్‌లు విద్యార్థుల్లో ఇంధన పొదుపుపై అవగాహన కల్పిస్తాయి.

త్వరలో వలంటరీ కార్బన్‌ ట్రేడ్‌..
బీఈఈ అడ్మినిస్ట్రేటర్‌గా ఈ ఏడాది నుంచి వలంటరీ కార్బన్‌ ట్రేడింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌కు సిద్ధమవుతున్నాం. ఇంధన పొదుపు పాటించే ప్రతి పరిశ్రమకు కర్బన ఉద్గారాల నియంత్రణకు సంబంధించి బీఈఈ ఈ ట్రేడ్‌ ధ్రు­వపత్రం అందిస్తుంది. ఎందుకంటే గ్లోబల్‌ వార్మింగ్‌ మరో 1.5 డిగ్రీలు దాటితే మరింత కర్బన ఉద్గారాలకు దారితీసే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే రుతుపవనాల రాకలో కూడా తీవ్రమైన మార్పులుంటాయి. దీనిని నియంత్రించడానికి భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దేశంలో 2030 నాటికి కర్బన ఉద్గారాలు 45 శాతం తగ్గించే లక్ష్యంతో రోషనీ అనే కార్యక్రమాన్ని బీఈఈ అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇంధన సామర్థ్య 
సాంకేతికత సాయంతో విద్యుత్, ఇతర ఇంధన వనరుల వినియోగాన్ని తగ్గించేందుకు నిర్మాణాత్మక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. భవిష్యత్తులో కర్బన ఉద్గారాల 
నియంత్రణలో భారత్‌ దిక్సూచిగా మారబోతోంది.

మనం ఆదా చేసే విద్యుత్‌ శ్రీలంక సరఫరాతో సమానం
ఇంధన సామర్థ్యం విషయంలో భారత్‌.. మిగిలిన దేశాలతో పోలిస్తే.. అద్భుతంగా అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో తలెత్తబోయే ప్రమాదాలను ముందే పసిగట్టిన ఏపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు.. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. దేశంలోని 13 రంగాలకు చెందిన పరిశ్రమలు ఇంధన సామర్థ్యాల్ని అమలు చేస్తుండటం వల్ల ఏటా రూ.48 వేల కోట్లు ఆదా విద్యుత్‌ వినియోగం అవుతోంది. ఇది శ్రీలంక వంటి దేశాలకు విద్యుత్‌ సరఫరాతో సమానం. ఈ సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వార్తలు