AP Budget 2021: వ్యవసాయ రంగానికి భారీగా నిధులు 

21 May, 2021 08:50 IST|Sakshi

కష్టకాలంలో రైతన్నకు కొండంత అండ

2020–21 బడ్జెట్‌లో రూ.29,159.97 కోట్లు

ఈ ఏడాది రూ.31,256.35 కోట్లు కేటాయింపు

వ్యవసాయ, అనుబంధ రంగాలకూ భారీగా నిధులు

కరోనా దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది.  వ్యవసాయ రంగం కుదేలైంది. దేశంలోనూ ఇదే పరిస్థితి  నెలకొంది. కానీ.. మన రాష్ట్రంలో  ప్రభుత్వ అండతో వ్యవసాయ రంగం విపత్కర పరిస్థితులను తట్టుకుని నిలబడగలిగింది. అన్నదాతకు, వ్యవసాయ రంగానికి అండగా నిలబడాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కంటే మిన్నగా నిధులను కేటాయించింది.

సాక్షి, అమరావతి: వరుసగా రెండో ఏడాదీ కరోనా మహమ్మారి అన్ని రంగాలను అతలాకుతలం చేస్తోంది. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగానే ఉంది. అయినా సరే.. ఈ కష్టకాలంలో అన్నదాతకు అండగా నిలవాలని ప్రభుత్వం సంకల్పించింది. గతేడాది కన్నా మిన్న కేటాయింపులు జరçపడంతో రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్‌ను ప్రకటించడమే కాకుండా.. వరుసగా మూడో బడ్జెట్‌లోనూ ఈ రంగానికి పెద్దపీట వేస్తూ కేటాయింపులు చేసింది.

2019–20లో రూ.28,866 కోట్లతో తొలి వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం 2020–21లో కేటాయింపులను రూ.29,159.97 కోట్లకు పెంచింది. ఈ ఏడాది ఏకంగా రూ.31,256.35 కోట్ల కేటాయించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.2,096.38 కోట్లను అదనంగా బడ్జెట్‌లో కేటాయింపులు జరిపింది. గతేడాదితో పోల్చుకుంటే వ్యవసాయ, పశు సంవర్ధక, సహకార, పట్టు పరిశ్రమల శాఖలకు కేటాయింపులు భారీగా పెంచడం ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాలకూ నూతన జవసత్వాలనిచ్చింది.

అన్నదాతలకు అగ్రతాంబూలం
వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకం కింద గతేడాది 51.95 లక్షల రైతు కుటుంబాలకు రూ.6,928 కోట్లు పంపిణీ చేయగా.. ఈ ఏడాది ఈ పథకానికి రూ.6,976.50 కోట్లు కేటాయించింది. ఇప్పటికే మొదటి విడతగా ఈ నెల 13వ తేదీన 52.38 లక్షల రైతు కుటుంబాలకు రూ.3,928.88 కోట్లు జమ చేసింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఇప్పటివరకు రూ.17,029.88 కోట్లను రైతులకు పెట్టుబడి సాయంగా అందించారు. వ్యవసాయ సబ్సిడీ కోసం టీడీపీ సర్కారు 2018–19లో రూ.2,138.22 కోట్లు ఖర్చు చేస్తే గతేడాది రూ.4,450 కోట్లు కేటాయించిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఈ ఏడాది ఆ మొత్తాన్ని రూ.5 వేల కోట్లకు పెంచింది.

ఉపాధి హామీతో అనుసంధానం..
వ్యవసాయ రంగాన్ని ఉపాధి హామీ పథకంతో అనుసంధానించాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా గతేడాది కంటే మిన్నగా ఈ ఏడాది కేటాయింపులు జరిపారు. గతేడాది వ్యవసాయ రంగంలో ఉపాధి హామీ పథకం కింద రూ.6,270 కోట్లు కేటాయిస్తే.. ఈ ఏడాది ఏకంగా రూ.8,116.16 కోట్లు కేటాయించారు. వ్యవసాయ యాంత్రీకరణ కోసం గతేడాది 207.83 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది ఆర్‌బీకేలకు అనుసంధానంగా కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల ద్వారా యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు కోసం రూ.739.46 కోట్ల కేటాయింపులు పెంచారు. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం కింద గత బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయిస్తే.. ఈ ఏడాది మూడున్నర రెట్లు పెంచారు. ప్రస్తుత బడ్జెట్‌లో ఏకంగా రూ.1,802. 82కోట్లు కేటాయించారు.

మత్స్య, పశు సంవర్థక శాఖలకూ భారీగా..
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో పశు సంవర్థక, మత్స్య శాఖలకు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భారీగా కేటాయింపులు జరిపారు. గతేడాది పశు సంవర్థక శాఖకు రూ.854.78 కోట్లు కేటాయిస్తే.. ఈ ఏడాది రూ.1,026.37 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే 171.59 కోట్లను అదనంగా కేటాయించారు. మత్స్య శాఖకు గతేడాది రూ.299 కోట్లు కేటాయిస్తే.. ఈ ఏడాది రూ.329.48 కోట్లు కేటాయించారు. పశు నష్టపరిహారం, రాజన్న పశువైద్యం, పశు విజ్ఞాన బడి వంటి పథకాలకు కేటాయింపులు జరిపింది. పాల ఉత్పత్తి సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేటాయింపులు పెంచింది. వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్న సహకార శాఖకు గత బడ్జెట్‌లో రూ.248.38 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది రూ.303.04 కోట్లకు పెంచారు.

రూ.68 వేల కోట్లు 
గత రెండేళ్లలో వ్యవసాయ, అనుబంధ రంగాల కోసం రూ.68 వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. రైతు భరోసా–పీఎం కిసాన్‌ కింద రూ.17,029.88 కోట్లు, çసున్నా వడ్డీ పంట రుణాల కింద రూ.573 కోట్లు, ఉచిత పంటల బీమా కోసం రూ.1,252 కోట్లు, పంట నష్టపరిహారం కోసం రూ.1,038 కోట్లు, ధాన్యం కొనుగోలు కోసం రూ.18,343 కోట్లు, ఇతర పంటల ఉత్పత్తుల కొనుగోళ్ల కోసం రూ.4,761 కోట్లు, ఉచిత విద్యుత్‌ కోసం రూ.17,430 కోట్లు, విద్యుత్‌ ఫీడర్‌ ఛానళ్ల సామర్థ్యం పెంచేందుకు రూ.1,700 కోట్లు, సూక్ష్మ సేద్యం కోసం రూ.1,224 కోట్లు ఆక్వా రైతులకు విద్యుత్‌ రాయితీ కింద రూ.1,520 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014–19 మధ్య చెల్లించాల్సిన వడ్డీ లేని పంట రుణాలు, పావలా వడ్డీ బకాయిలు రూ.688 కోట్లు, విత్తన బకాయిలు రూ.384 కోట్లు, ధాన్యం కొనుగోలు బకాయిలు రూ.960 కోట్లు, పంటల బీమా బకాయిలు రూ.716 కోట్లు, రైతుల ఎక్స్‌గ్రేషియా రూ.23 కోట్లు కలిపి మొత్తం రూ.2,771 కోట్లు ప్రభుత్వం చెల్లించింది.

వరుసగా మూడో ఏడాది భారీగా 
కరోనా మహమ్మారి వల్ల రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి నిధులు కేటాయించడం నిజంగా గొప్ప విషయం. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి గతేడాది కంటే మిన్నగా కేటాయింపులు జరిపి రైతులకు అండగా నిలిచింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో 2,24,789 కోట్లతో ప్రతిపాదించిన బడ్జెట్‌లో రూ.29,159.97 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది రూ.2,29,779.27 కోట్ల బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రూ.31,256.35 కేటాయించారు. ఇది బడ్జెట్‌లో 13.6 శాతం. వరుసగా మూడేళ్లు వ్యవసాయ రంగానికి భారీగా నిధులను కేటాయించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వ్యవసాయ శాఖమంత్రి కురసాల కన్నబాబుకు కృతజ్ఞతలు.
– ఎంవీఎస్‌ నాగిరెడ్డి, వైస్‌ చైర్మన్, ఏపీ వ్యవసాయ మిషన్‌

వ్యవసాయానికి  ఊతం
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం వ్యవసాయ రంగానికి ఆశించిన స్థాయిలో కేటాయింపులు జరపడం నిజంగా ముదావాహం. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.2,096.38 కోట్లు అదనంగా కేటాయించడం విశేషం. ముఖ్యంగా నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ స్కీమ్, రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన, సబ్‌ మిషన్‌ ఆన్‌ అగ్రికల్చర్‌ మిషన్, సాయిల్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌కు కేటాయింపులు భారీగా పెంచడం నిజంగా గొప్ప విషయం.
– హెచ్‌.అరుణ్‌కుమార్, కమిషనర్‌ వ్యవసాయ శాఖ

చదవండి: AP Budget 2021: జన సాధికార బడ్జెట్‌  
ప్రాణం విలువ తెలిసిన వాడిని: సీఎం జగన్‌

మరిన్ని వార్తలు