AP Budget 2021: ఆరోగ్యమే మహాభాగ్యం.. 13,830 కోట్లు

21 May, 2021 11:07 IST|Sakshi

మొత్తంగా రూ.13,830.44 కోట్లు కేటాయింపు 

బడ్జెట్‌లో ఆరోగ్యశ్రీ పథకానికి రూ.2,258 కోట్లు

నాడు నేడు కింద ఆస్పత్రుల అభివృద్ధికి రూ.1,535 కోట్లు

కోవిడ్‌ నియంత్రణ, టీకాలకు రూ.1,000 కోట్లు

శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌కు రూ.50 కోట్లు

ఆరోగ్య రంగానికి గతేడాదితో పోలిస్తే ఈసారి అదనంగా రూ.4,403 కోట్లు

సాక్షి, అమరావతి: ఆరోగ్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం 2021–22 బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరం ఆరోగ్య రంగానికి రూ.9,426.49 కోట్లు కేటాయించగా ఈ ఏడాది ఈ మొత్తాన్ని రూ.13,830.44 కోట్లకు పెంచింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, 104, 108 పథకాలకు నిధుల కొరత లేకుండా కేటాయింపులు చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా నాడు నేడు కింద ఆస్పత్రుల అభివృద్ధి పనులకు రూ.1,535 కోట్లు కేటాయించింది. వైద్యవిధాన పరిషత్‌కు గతేడాది కంటే రూ.77.32 కోట్లు ఎక్కువగా ఇచ్చింది. తొలిసారిగా బడ్జెట్‌లో కోవిడ్‌ టీకా కోసం రూ.500 కోట్లు, కోవిడ్‌ నియంత్రణకు రూ.500 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఆరోగ్య రంగానికి బడ్జెట్‌లో 4,403.95 కోట్లు అధికంగా కేటాయించడం విశేషం. 

పేద రోగులకు భరోసా
పేద రోగులకు భరోసానిస్తూ 2,400 జబ్బులను ఆరోగ్యశ్రీలో చేర్చడంతోపాటు దేశంలోనే మొదటిసారిగా కోవిడ్‌ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చిన ఘనత రాష్ట్రానిది. అంతేకాకుండా రెండ్రోజుల క్రితమే ఖరీదైన బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సనూ ఆరోగ్యశ్రీలో చేర్చారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ పథకానికి బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. మన రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉచిత చికిత్సకు అవకాశం కల్పిస్తున్న ఈ పథకానికి ఈ ఏడాది రూ.2,258.94 కోట్లు కేటాయించింది. రూ.5 లక్షల వార్షికాదాయంలోపు ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఈ పథకాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. 

అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 1,088 కొత్త అంబులెన్సు (108, 104)లను కొనుగోలు చేసిన ఘనత ప్రభుత్వానిది. ఇప్పుడు ప్రతి మండలానికి 108, 104 వాహనాలు ఉన్నాయి. కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో  108 అంబులెన్సులు అద్భుతమైన సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. గ్రామీణుల్లో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 104 వాహనాలు ఇంటి వద్దకే వెళ్లి మందులిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు పథకాలకు కలిపి బడ్జెట్‌లో రూ.300 కోట్లు కేటాయించారు. 

చదవండి: ప్రాణం విలువ తెలిసిన వాడిని: సీఎం జగన్‌

మరిన్ని వార్తలు