పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.3,673.34 కోట్లు 

21 May, 2021 10:29 IST|Sakshi

గతేడాది బడ్జెట్‌లో రూ.2,705 కోట్లు 

xతేడాదితో పోలిస్తే రూ.968.34 కోట్లు అదనం 

పారిశ్రామిక రాయితీలకు రూ.1,000 కోట్లు 

వైఎస్సార్‌ ఈఎంసీకి  రూ.200 కోట్లు 

కడప స్టీల్‌ ప్లాంట్‌ కోసం రూ.250 కోట్లు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక వసతులను పెంచడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించింది. ముఖ్యంగా కొప్పర్తిలోని వైఎస్సార్‌ ఈఎంసీ, విశాఖలోని నాయుడుపేట క్లస్టర్లను ఈ ఏడాది అందుబాటులోకి తీసుకురావడం ద్వారా కొత్త పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2020–21లో పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పనకు రూ.2,705 కోట్లు కేటాయించగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.968.34 కోట్లను పెంచి రూ.3,673.34 కోట్ల నిధులను కేటాయించింది. గతేడాదితో పోలిస్తే 35.79 శాతం అదనపు నిధులను పరిశ్రమల శాఖకు కేటాయించారు.

ముఖ్యంగా రాష్ట్రంలో విశాఖ–చెన్నై, చెన్నై–బెంగళూరు, హైదరాబాద్‌–బెంగళూరు పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేస్తున్న ఏపీఐఐసీకి రూ.200 కోట్లు, వైఎస్సార్‌ జిల్లాలో నిర్మిస్తున్న వైఎస్సార్‌ ఈఎంసీకి రూ.200 కోట్లు కేటాయింపులు చేసింది. ఇదే సమయంలో సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమల్లో మౌలిక వసతులు కల్పించడానికి రూ.60.93 కోట్లను కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్మిస్తున్న వైఎస్సార్‌ కడప స్టీల్‌ ప్లాంట్‌కు గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా రూ.250 కోట్లను కేటాయించింది. రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించేందుకు రూ.1,000 కోట్లు కేటాయించింది. రొయ్యల ప్రాసెసింగ్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాలకు రాయితీల నిమిత్తం రూ.50 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు.  

కోవిడ్‌ సమయంలోనూ కొత్త పెట్టుబడులు 
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌ సంక్షోభం వెన్నాడుతున్నప్పటికీ కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రం ముందంజలో ఉంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.6,234.64 కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రానికి రాగా, తద్వారా 39,578 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. రాష్ట్రంలో మరో 117 కంపెనీలు రూ.31,668 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నాయి. వీటిద్వారా 67,716 మందికి ఉపాధి లభించనుంది. ఈ ఏడాది కేవలం ఎంఎస్‌ఎంఈ రంగంలో రూ.4,383.24 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వీటిద్వారా 87,944 మందికి ఉపాధి లభించనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో ఈ ఏడాది ఎలక్ట్రానిక్స్‌ రంగంలో రూ.2 వేల కోట్ల పెట్టుబడులు, ఐటీ రంగంలో రూ.250 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. తద్వారా ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రంగంలో 30 వేల మందికి ఉపాధి లభించనుంది.   

చదవండి: AP Budget 2021: వ్యవసాయ రంగానికి భారీగా నిధులు 

మరిన్ని వార్తలు