రూ.2.65 లక్షల టిడ్కో ఇల్లు ఒక్క రూపాయికే

24 Feb, 2021 10:43 IST|Sakshi

1,43,600 మందికి ప్రభుత్వం వరం

సాక్షి, అమరావతి: పాలకుడికి మనసుంటే పేదలకు ఎంత మేలు జరుగుతుందో మరోసారి రుజువైంది. 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఏపీ టిడ్కో ఇళ్లను కేవలం ఒక్క రూపాయికే లబ్ధిదారులకు అందించాలన్న నిర్ణయాన్ని కేబినెట్‌ ఆమోదించింది.

పేదలపై రుణభారం మోపిన టీడీపీ సర్కారు..
రాష్ట్ర పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీ టిడ్కో) 88 మున్సిపాలిటీల పరిధిలో జీ + 3 విధానంలో గృహ సముదాయాలు నిర్మించింది. వాటిల్లో 300 ఎస్‌ఎఫ్‌టీ ఇళ్ల యూనిట్‌ ధర రూ.2.65 లక్షలుగా నిర్ణయించింది. అలా  1,43,600 యూనిట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ముందుగా రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద రూ.500 చొప్పున చెల్లించాలని పేర్కొంది. ఇక ఇళ్ల ధర రూ.2.65 లక్షలు బ్యాంకు రుణంగా ఇప్పిస్తామని, లబ్ధిదారులు ఏళ్ల తరబడి ప్రతి నెలా వడ్డీ చెల్లించాలని తెలిపింది.

ఒక్క రూపాయికే ఇచ్చేద్దాం..
300 ఎస్‌ఎఫ్‌టీ విస్తీర్ణంలోని ఇళ్లలో ఉండేందుకు సిద్ధపడ్డారంటేనే ఆ లబ్ధిదారులు పేదవారని సీఎం జగన్‌ గుర్తించారు. నిరుపేదలపై రూ.2.65 లక్షల చొప్పున రుణభారం మోపితే ఎన్నాళ్లకు తీర్చగలరనే ఉద్దేశంతో ఆ లబ్ధిదారులకు ఇళ్లను కేవలం ఒక్క రూపాయికే ఇవ్వాలని చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇక బ్యాంకు రుణం లేదు... వడ్డీలూ ఉండవు. రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.500 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరైనా రూ.500 చెల్లిస్తే ఆ మొత్తం వెనక్కి ఇచ్చేస్తారు. కేవలం ఒక్క రూపాయి చెల్లించి 300 ఎస్‌ఎఫ్‌టీ ఇంటిని సొంతం చేసుకునే అపూర్వ అవకాశాన్ని సీఎం జగన్‌ పట్టణ పేదలకు కల్పించారు. దీని వల్ల 1,43,600 మందికి రూ.3,812.58 కోట్ల మేర ప్రయోజనం కలగనుంది.

చదవండి: ఎన్నికల ఘట్టం.. వైఎస్‌ కుటుంబానికే పట్టం..

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు