Darbarevu Land: దశాబ్దాల సమస్యకు ఏపీ కేబినెట్‌ పరిష్కారం.. రెండు, మూడు రోజుల్లో జీవో

14 May, 2022 11:40 IST|Sakshi

1,485 మంది రైతులకు 1,754 ఎకరాల భూపంపిణీ 

ఎకరం రూ.100కే రిజిస్ట్రేషన్‌ 

నరసాపురం తీర గ్రామాల్లో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న భూముల సమస్యకు పరిష్కారం దొరికింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టడంతో.. బ్రిటీష్‌ హయంలో లీజుకు తీసుకుని తరతరాలుగా అనుభవిస్తున్న సాగుభూములకు వారికే అప్పగించేందుకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

నరసాపురం: నరసాపురం మండలం దర్భరేవు కంపెనీ భూములను ప్రస్తుతం అనుభవిస్తున్నవారికే రూ.100 నామమాత్రపు కనీస ధరకు అప్పగించాలని, రిజిస్ట్రేషన్‌ చార్జీలు ప్రభుత్వమే భరించాలని కేబినెట్‌ నిర్ణయించింది. 1754 ఎకరాల భూమిని సాగుచేసుకుంటున్న 1485 మంది రైతులకు పంపిణీ చేయనున్నారు. త్వరలో నరసాపురంలో ముఖ్యమంత్రి పర్యటనలో ఈ పంపిణీ జరుగుతుంది. 1921లో అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వం దర్భరేవు చుట్టు పక్కల గ్రామాల్లో ఉన్న 1814 ఎకరాల భూమిని సాగు చేసుకునేందుకు పేదలకు ఇవ్వాలని నిర్ణయించింది.

ది అగ్రికల్చర్‌ సొసైటీ కంపెనీతో ఓ సొసైటీని ఏర్పాటు చేసి దానికి 1,814 ఎకరాల భూమిని 100 ఏళ్ల లీజుకు అప్పగిస్తూ జీవో విడుదల చేసింది. మళ్లీ ఓ ఐదేళ్ల తరువాత అదే బ్రిటీష్‌ ప్రభుత్వం సర్వే చేపట్టి కాలువలు, డ్రెయిన్ల తవ్వడం కోసం 1,814 ఎకరాల్లో 60 ఎకరాలు అవసరమని తీసుకుంది. మిగిలిన 1,754 ఎకరాలు వ్యవసాయానికి పనికి రాకుండా అడవిలా ఉండేవి. స్వాతంత్య్రం వచ్చాక మన ప్రభుత్వాలు ఈ భూముల జోలికి వెళ్లలేదు. రైతులు కష్టపడి వాటిని సాగుభూములుగా మార్చుకున్నారు. 

కోట్లు దండుకున్న టీడీపీ ప్రభుత్వం 
గత టీపీపీ ప్రభుత్వం ఈ భూములపై కన్నేసింది. 2019లో అమలు సాధ్యంకాని జీవో హడావుడిగా తీసుకొచ్చింది. ఎకరాకు రూ.1000 నామమాత్రం ధర తీసుకుని సాగుదారులకు కంపెనీ భూముల పట్టాలిస్తున్నామని మభ్యపెట్టారు. తీరా ఎకరాకు రూ.1000 కాకుండా స్థానిక టీడీపీ నాయకులు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకూ వసూలు చేశారు. అయితే పట్టాలు ఇవ్వలేదు. 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక రైతులు ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుకు తాము మోసపోయిన వైనాన్ని మొరపెట్టుకున్నారు. ముఖ్యమంత్రికి, అప్పటి వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబుకు ఫిర్యాదు చేశారు. దీంతో నరసాపురం సబ్‌కలెక్టర్‌తో విచారణ చేయించారు. అవకతవకలు జరిగినట్టు అప్పటి సబ్‌ కలెక్టర్‌ నివేదిక ఇవ్వడంతో సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ అంశంపై సీఐడీ విచారణ సాగుతుంది.  

చదవండి: (Palle Vs JC: పల్లె అక్రమాలపై జేసీ లొల్లి..)

న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు 
రైతుల నుంచి వసూలు చేసిన సొమ్ము తిరిగి ఇచ్చేలా ప్రభుత్వ ముదునూరి కృషి చేస్తున్నారు. ఇప్పుడు సాగుదారులగా ఉన్న కొందరి రైతుల చేతుల్లో 10, 12 ఎకరాలు కూడా ఉన్నాయి. నిబంధనల మేరకు రెండున్నర ఎకరాలకు మించి ప్రభుత్వ భూములు పంచడానికి వీలులేదు. భూముల్లో అసలు సాగుదారుల ఎవరు అనే అంశంపై సర్వే చేయించి, భవిష్యత్‌లో ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్ణయించారు.  

నిజమైన సాగుదారులకే భూముల పంపిణీ 
దర్బరేవు కంపెనీ భూముల సమస్య చెప్పగానే ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు నిజమైన సాగుదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ భూములు పంచుతాం. గత ప్రభుత్వంలో ఈ భూముల విషయంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు సాగుతుంది.  
– ముదునూరి ప్రసాదరాజు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌    

మరిన్ని వార్తలు