తిరుపతి రుయా ఘటన బాధాకరం: మంత్రి ఆళ్ల నాని

12 May, 2021 11:40 IST|Sakshi

సాక్షి, విజయవాడ: మంత్రి ఆళ్లనాని అధ్యక్షతన మంగళగిరి ఏపీఐఐసీ భవనంలో జరిగిన ఏపీ కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం మంత్రి ఆళ్లనాని మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆక్సిజన్, బెడ్స్‌, రెమిడెసివర్‌ అంశాలపై చర్చించాం. రుయా లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఆక్సిజన్ సరఫరాపై సీఎం జగన్‌ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఆక్సిజన్ పైప్‌లైన్లను పరిశీలించాలని కలెక్టర్లను ఆదేశించాం. జిల్లాల్లో ఆక్సిజన్ బెడ్ల సంఖ్య పెంచాం. ఆక్సిజన్ వృథా కాకుండా ప్రతి జిల్లాలో మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేస్తాం. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా ఆక్సిజన్‌ మేనేజ్‌మెంట్‌ ఉండాలి. ఆక్సిజన్ కోటా పెంచాలని కేంద్రాన్ని కోరాం. రాష్ట్రంలో ఆక్సిజన్ అవసరాలపై ఇప్పటికే ప్రధానికి సీఎం లేఖ రాశారు. 910 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరముంటుందని విజ్ఞప్తి చేశారు. వ్యాక్సినేషన్‌పై గ్లోబల్ టెండర్లకు వెళ్తాం. వ్యాక్సినేషన్‌పై విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయి.

ఏపీలో ఒకే రోజు 6 లక్షల డోసులు వేశాం. 6 కోట్ల మందికి వ్యాక్సిన్లు ఇవ్వాలని కేంద్రానికి లేఖలు కూడా రాశాం. ప్రజలందరికీ వ్యాక్సిన్ వేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలిపాం. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ, ఆక్సిజన్ అంశం కేంద్రం చేతిలో ఉన్న అంశాలు.. వ్యాక్సినేషన్‌పై కేంద్రం సుప్రీంలో అఫిడవిట్ వేసింది చంద్రబాబుకు తెలియదా?.. క్లిష్ట పరిస్థితుల్లో కూడా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. తిరుపతి రుయా ఘటన బాధాకరం. కలెక్టర్ నివేదిక వచ్చిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’’ అని అన్నారు.

కాగా, ఈ భేటీలో మంత్రులు మేకతోటి సుచరిత, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాధ్, కన్నబాబు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు