అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు

23 Apr, 2021 09:09 IST|Sakshi

ప్రైవేట్‌ ఆస్పత్రులపై నిఘా ఉంచాం

అంతా సహకరిస్తే వైరస్‌ నియంత్రణ సాధ్యమే

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని

నేడు సీఎం సమీక్ష అనంతరం కీలక నిర్ణయాలు 

సాక్షి, అమరావతి: కోవిడ్‌ బాధితుల నుంచి ప్రైవేట్‌ ఆస్పత్రులు ఎక్కువ రేట్లు వసూలు చేస్తున్నట్లు అందుతున్న ఫిర్యాదులపై నిఘా వేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని, తీవ్ర చర్యలకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. తాజా పరిస్థితుల్లో కరోనా వ్యాప్తి వేగవంతంగా ఉన్నా ప్రజలు సహకరిస్తే వైరస్‌ నియంత్రణ సాధ్యమేనని చెప్పారు. దేశంలో ఒకేరోజు పెద్దఎత్తున వ్యాక్సినేషన్‌లో రికార్డు సృష్టించిన ఆంధ్రప్రదేశ్‌ వైరస్‌ కట్టడిలోనూ చురుగ్గా వ్యవహరిస్తోందని వివరించారు.

కోవిడ్‌ నియంత్రణపై ఏర్పాటైన మంత్రుల కమిటీ గురువారం ఉన్నతాధికారులతో సుమారు 3 గంటల పాటు సమావేశమై పలు అంశాలపై చర్చించింది. మంత్రుల కమిటీకి ఆళ్ల నాని కన్వీనర్‌గా వ్యవహరించగా పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, హోంమంత్రి సుచరిత, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఇందులో పాల్గొన్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అనివార్య కారణాలతో హాజరు కాలేదు. విద్యాశాఖ కీలకం కావడంతో సంబంధిత శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మంత్రుల కమిటీలో సభ్యుడు కాకపోయినా సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి ఆళ్ల నాని మీడియాతో మాట్లాడారు.

ఆక్సిజన్, మందులకు కొరత లేదు
రాష్ట్రంలో ఎక్కడా మందులు, ఆక్సిజన్, బెడ్‌లకు కొరత లేదు. ప్రభుత్వాసుపత్రుల్లో తగినంత ఆక్సిజన్‌ ఉంది. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఎక్కడైనా కొరత ఉంటే అది కూడా సరిదిద్దుతున్నాం. కొరత అంటే మహా అయితే 10 మెట్రిక్‌ టన్నులకు అటుఇటుగా ఉండవచ్చు. ఇతర రాష్ట్రాల నుంచి 100 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ దిగుమతి చేసుకోవడంపై చర్చలు జరుపుతున్నాం. కోవిడ్‌ నేపథ్యంలో ప్రజలంతా మాస్కులు వినియోగిస్తూ భౌతిక దూరం పాటించాలి. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలి. అందరూ సహకరిస్తే కరోనాను నియంత్రించడం కష్టమేమీ కాదు. కరోనా నియంత్రణ చర్యలపై సీఎం నిత్యం మాతో చర్చిస్తున్నారు. ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి ముఖ్యమని, వారికి ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూడాలని ఆదేశించారు. అవసరమైతే టెస్ట్‌లు పెంచాలని సూచించారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ నిర్మాణం సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నాం. కోవిడ్‌ సేవల కోసం 104 కాల్‌సెంటర్‌లో ఇప్పటికే 300 మంది వైద్యులను నియమించాం. ఈ సదుపాయాన్ని ప్రజలంతా వినియోగించుకునేలా విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించాం. 

నేడు ముఖ్యమంత్రి వద్ద సమీక్ష
మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలను శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించే సమీక్షలో నివేదించి అనంతరం ఓ నిర్ణయం తీసుకుంటాం. పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలకు సంబంధించి కూడా చర్చకు వచ్చింది. వీటిపై ముఖ్యమంత్రి నిర్వహించే సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. 


చదవండి:
ఏపీలో ఆక్సిజన్‌ కొరత లేదు: మంత్రి మేకపాటి
ఆంధ్రప్రదేశ్‌లో లైన్‌మెన్ ఉద్యోగాలు

మరిన్ని వార్తలు