రాష్ట్రంలో ఎన్నికల నిర్వహించే పరిస్థితి లేదు: నీలం సాహ్ని

28 Oct, 2020 18:38 IST|Sakshi

సాక్షి, విజయవాడ :  స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే పరిస్థితి రాష్ట్రంలో లేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అన్నారు. ఈ మేరకు బుధవారం ఆమె రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను కలిసి ప్రభుత్వ నివేదికను సమర్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం తెలపాలని రమేష్ కుమార్ కోరిన నేపథ్యంలో సీఎస్‌ సాహ్ని ఆయనతో భేటీ అయి ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలియజేశారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు కరోనా బారిన పడ్డారని, ఇలాంటి సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో కరోనాను నియంత్రిస్తున్నాం కానీ పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని నివేదికలో పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు రాగానే సమాచారం ఇస్తామని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కు తెలియజేశారు. ఈ భేటీలో పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.
(చదవండి : టీడీపీ డిమాండ్‌ హాస్యాస్పదంగా ఉంది: అంబటి)

‘కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటోంది. దేశంలోనే అత్యత్తమంగా ఏపీ ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రభుత్వ చర్యలతో కరోనాను నియంత్రిస్తున్నాం. కానీ పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. అధికారులు, ఉద్యోగులు కూడా కరోనా బారిన పడ్డారు. 11వేల మందికిపైగా పోలీస్ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. క్షేత్రస్థాయిలో వాలంటీర్లు, ఇతర ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు.అయినా సమర్థవంతంగా నియంత్రణ చర్యలు చేపడుతున్నాం. స్థానిక ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు రాగానే సమాచారం ఇస్తాం. వాయిదా పడ్డ ఎన్నికల నిర్వహణపై తెలియజేస్తాం.‘ అని ఎస్‌ఈసీకి ఇచ్చిన నివేదికలో అధికారులు పేర్కొన్నారు.
(చదవండి : ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి: సీపీఎం)

మరిన్ని వార్తలు