సీఎస్‌ సమీర్‌శర్మకు అస్వస్థత.. విజయానంద్‌కు బాధ్యతలు

20 Oct, 2022 03:21 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్‌శర్మ అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల ఆయన స్వల్ప అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. అయితే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరగా.. గుండె సంబంధిత చికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. కొద్ది రోజుల్లో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యి విధుల్లో చేరే అవకాశం ఉంది. కాగా, సమీర్‌శర్మను సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం ఫోన్‌లో పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పూర్తి అదనపు బాధ్యతలు విజయానంద్‌కు.. 
సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌శర్మ అస్వస్థతకు గురై సెలవులో ఉన్న నేపథ్యంలో ఇంధన శాఖ ప్రత్యేక సీఎస్‌ కె.విజయానంద్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పూర్తి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ(రాజకీయ) ముఖ్యకార్యదర్శి ముత్యాల రాజు ఉత్తర్వులిచ్చారు. 

మరిన్ని వార్తలు