కీలక పరిణామం.. భారీగా ‘మార్గదర్శి’ చరాస్తుల జప్తు!

30 May, 2023 09:04 IST|Sakshi

సీఐడీ వినతి మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

రూ.793.50 కోట్ల చరాస్తులపై కోర్టు అనుమతితో తదుపరి చర్యలు

డిపాజిట్‌దారులు, చందాదారుల ప్రయోజనాలే లక్ష్యంగా కీలక అడుగు

బ్యాంకులు, మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలకు సమాచారం 

సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ చందాదా రులు, డిపాజిట్‌దారుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు చెందిన రూ.793.50 కోట్ల విలువైన చరాస్తులను జప్తు చేసేందుకు సీఐడీని అనుమతించింది. వీటిలో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ నగదు, బ్యాంకు ఖాతాల్లో సొమ్ము, నిబంధనలకు విరుద్ధంగా మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టిన పెట్టుబడులున్నాయి.

చిట్టీలు వేసిన చందాదారుల సొమ్మును మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ చెల్లించే స్థితిలో లేనందున ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టం 1999 ప్రకారం హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయస్థానం అనుమతితో చరాస్తుల జప్తునకు సీఐడీ అధికారులు చర్యలు చేపట్టనున్నా రు. ఇదే విషయాన్ని వివరిస్తూ 50 బ్యాంకులు, మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలకు కూడా సమాచారం అందించారు. బ్యాంకులు, ఇతర సంస్థల్లోని నిధుల ను మార్గదర్శి మళ్లించకుండా, డిపాజిట్‌దారుల ప్ర యోజనాలను కాపాడేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. 

చట్టాన్ని పాటించేందుకు నిరాకరణ
కేంద్ర చిట్‌ఫండ్స్‌ చట్టాన్ని ఉల్లంఘిస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ దశాబ్దాలుగా ఆర్థిక అక్రమాలను పాల్పడుతున్నట్లు స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ తనిఖీల్లో వెల్లడైంది. చందాదారుల సొమ్మును నిబంధనలకు మార్గదర్శి తమ అనుబంధ సంస్థలు, మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులుగా మళ్లించినట్లు కీలక ఆధారాలు సేకరించింది.

చిట్‌ఫండ్స్‌ రిజిస్ట్రార్‌ ఫిర్యాదు మేరకు ఏ–1గా చెరుకూరి రామోజీరావు, ఏ–2గా చెరుకూరి శైలజ కిరణ్‌లతోపాటు బ్రాంచి మేనేజర్లపై (ఫోర్‌మెన్‌) సీఐడీ కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్న విషయం విదితమే. కేంద్ర చిట్‌ఫండ్‌ చట్టాన్ని అనుసరిస్తున్నట్లు ఆధారాలు చూపితే కొత్త చిట్టీలకు అనుమతిస్తామని స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ సూచించినా మార్గదర్శి అందుకు నిరాకరించింది.

దీంతో గతేడాది డిసెంబర్‌ నుంచి రాష్ట్రంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కొత్త చిట్టీలు నిలిపివేసింది. ఆరు నెలల్లో దాదాపు రూ.400 కోట్ల విలువైన టర్నోవర్‌ నిలిచిపోయింది. మరోవైపు పాత చందాదారులకు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సకాలంలో చిట్టీల మొత్తాన్ని చెల్లించకపోవడంతో చందాదారులు పెద్ద సంఖ్యలో చిట్స్‌ రిజిస్ట్రార్, సీఐడీకి ఫిర్యాదు చేస్తున్నారు. వీటిని పరిశీలించిన సీఐడీ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఆస్తులను జప్తు చేసేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరింది.  
చదవండి: ఆర్డినెన్స్‌ వివాదం.. ఆప్‌కు షాక్‌ ఇవ్వనున్న కాంగ్రెస్‌..

మరిన్ని వార్తలు