కేంద్రమంత్రులకు ఏపీ సీఎం జగన్‌ లేఖలు

14 May, 2022 12:51 IST|Sakshi
సీఎం జగన్‌ (ఫైల్‌ ఫొటో)

సాక్షి, అమరావతి: వంట నూనెలకు కొరత నెలకొన్న నేపథ్యంలో ఆవనూనెపై దిగుమతి సుంకం తగ్గించాలని సీఎం వైఎస్‌ జగన్‌ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌ శుక్రవారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌కు లేఖలు రాశారు.  రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌కు కొరత ఏర్పడినందున ఆవ నూనె దిగుమతులపై సుంకాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.

సన్‌ఫ్లవర్‌ మాదిరిగా ఉండే ఆవాల నూనె కెనడాలో ఎక్కువగా ఉత్పత్తి అవుతోందని తెలిపారు. ప్రస్తుతం ముడి ఆవ నూనెపై 38.5 శాతం, శుద్ధి చేసిన ఆవనూనెపై 45 శాతం దిగుమతి సుంకం ఉందన్నారు. దిగుమతి చేసుకునేందుకు ఈ సుంకాలు ప్రతిబంధకంగా మారినందున వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కనీసం ఏడాది పాటు ఆవనూనెపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని లేఖలో సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు.

60 శాతం విదేశాల నుంచే..
2021–22లో దేశంలో వంటనూనెల వినియోగం 240 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా 40 శాతం మాత్రమే దేశీయంగా ఉత్పత్తి జరిగిందని, 60 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు. 95 శాతం పామాయిల్‌ ఇండోనేషియా, మలేషియాల నుంచి దిగుమతి అవుతుండగా ఉక్రెయిన్, రష్యా నుంచి 92 శాతం సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ దిగుమతి జరుగుతోందని తెలిపారు. ఇరుదేశాల మధ్య తలెత్తిన యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వంటనూనెలకు తీవ్ర కొరత ఏర్పడి ఆ ప్రభావం వినియోగదారులపై పడిందన్నారు. ఫలితంగా సన్‌ఫ్లవర్‌తో పాటు ఇతర వంటనూనెల ధరలు అమాంతం పెరిగాయన్నారు.

విస్తృత తనిఖీలు.. టాస్క్‌ఫోర్స్‌
రాష్ట్రంలో మూడింట రెండొంతుల మంది సన్‌ఫ్లవర్‌నే వినియోగిస్తుండగా పామాయిల్‌ను 28% మంది, వేరుశనగ నూనెను 4.3% మంది వాడుతున్నట్లు సీఎం జగన్‌ పేర్కొన్నారు. మార్కెట్లో వంటనూనెల సరఫరాకు ఇబ్బంది లేకుండా, కృత్రిమ కొరత తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందన్నారు. విజిలెన్స్, పౌరసరఫరా, తూనికలు కొలతల శాఖలు విస్తృతంగా తనిఖీలు చేస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. కొరత లేకుండా వంటనూనెల సరఫరా, రోజువారీ ధరలు సమీక్షించేందుకు టాస్క్‌ఫోర్స్‌నూ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తయారీదారులు, దిగుమతిదారులు, రిఫైనరీలతో  సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ఏపీ ఆయిల్‌ఫెడ్‌ ద్వారా రైతు బజార్లలో సరసమైన ధరలకే నూనెలను విక్రయిస్తున్నామన్నారు.  

చదవండి:  మడకశిరకు వైఎస్‌ జగన్‌ మరో వరం

మరిన్ని వార్తలు