AP New Districts: నవ శకానికి నాంది 

4 Apr, 2022 05:57 IST|Sakshi

నేడు 13 కొత్త జిల్లాల అవతరణ.. మొత్తంగా 26 జిల్లాలు 

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించనున్న సీఎం జగన్‌ 

అభివృద్ధికి మరింత ఊతం.. ప్రజలకు మరింత చేరువ  

ఆచరణలోకి మేనిఫెస్టోలోని మరో వాగ్దానం  

తద్వారా సుస్థిర ప్రగతికి సత్వరం బాటలు  

ఒకే ప్రాంగణంలో ప్రభుత్వ శాఖల కార్యాలయాలు  

సాక్షి, అమరావతి : కొత్తగా 13 జిల్లాల ఏర్పాటుతో పునర్‌వ్యవస్థీకరించిన 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిపాలన చరిత్రలో నవశకానికి నాంది పలకనుంది. కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సోమవారం ఉదయం 9.05 – 9.45 గంటల మధ్య లాంఛనంగా ప్రారంభించనున్నారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా పాలనను ప్రజల చెంతకు మరింత దగ్గరగా తీసుకువెళ్లనున్నారు.

తద్వారా మేనిఫెస్టోలో ఇచ్చిన జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ వాగ్దానాన్ని నేడు కార్యరూపంలోకి తీసుకు వస్తున్నారు. నిన్న గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు ద్వారా పాలన వికేంద్రీకరణలో తొలి అడుగు వేశారు. నేడు కొత్త జిల్లాల ఆవిర్భావంతో ఈ దిశగా మరో అడుగు ముందుకు వేశారు. రేపు ఇదే స్ఫూర్తితో మూడు ప్రాంతాల సమానాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకు వేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్‌ చర్యలు తీసుకుంటున్నారు.

సత్వరాభివృద్ధి, సమగ్రాభివృద్ధి, సమానాభివృద్ధి, సర్వజనాభివృద్ధి, సంపూర్ణాభివృద్ధి లక్ష్యంగా పాలన వికేంద్రీకరణను చేపట్టారు. అభివృద్ధి ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకూడదని, పాలన సామాన్య ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు చేరువగా ఉండాలని, అభివృద్ధి ఫలాలు అందరికీ పారదర్శకంగా ఇంకా మెరుగ్గా అందాలన్న సమున్నత లక్ష్యంతో నవశకానికి నాంది పలుకుతున్నారు.  

జిల్లాల పెంపుతో ఎన్నో ఉపయోగాలు 
చిన్న జిల్లాల ఏర్పాటు ద్వారా జిల్లా కేంద్రం నుంచి మారుమూల సరిహద్దు గ్రామాలకు దూరభారం తగ్గనుంది. జిల్లా పరిపాలన యంత్రాంగం ప్రజలకు మరింత చేరువకానుంది. ప్రజల ఇంటి వద్దకు పాలన ద్వారా జవాబుదారీతనం ఇంకా పెరగనుంది. 
 పాలనాపరంగా పర్యవేక్షణ పెరగనుంది. అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించే వెసులుబాటు ఉంటుంది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో మరింత వేగంగా మరింత పారదర్శకంగా అమలు చేసే అవకాశం ఉంటుంది. 
 అన్ని ప్రాంతాల సమతులాభివృద్ధికి బాటలు వేయొచ్చు. అభివృద్ధిలో ప్రాదేశిక సమానత్వం, సమ్మిళిత ఆర్థిక వృద్ధి, బడుగు, బలహీన వర్గాల వికాసంతో పాటు సుస్థిర ప్రగతికి బాటలు వేస్తుంది. 
 వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం ప్రజలు వ్యయ ప్రయాసలకోర్చి మైళ్ల కొద్దీ తిరిగే దుస్థితిని తొలగిస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు అధికారి కార్యాలయాలు, వారి క్యాంపు కార్యాలయాలతో సహా అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం కనీసం 15 ఎకరాల సువిశాల స్థలంలో మంచి డిజైన్లతో పది కాలాలపాటు గుర్తుండే విధంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం సాగనుంది.  
జిల్లాల ఏర్పాటులో హేతుబద్ధత  
 ప్రతి జిల్లా దాదాపు ఒక పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి జిల్లాలో సగటున ఆరు, ఏడు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 18 నుంచి 23 లక్షల జనాభా ఉంటుంది. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం, దూరం దృష్ట్యా అరకు పార్లమెంట్‌ నియోజకవర్గం మాత్రం రెండు ప్రత్యేక జిల్లాలుగా ఏర్పాటైంది. 
 ప్రజా సౌకర్యం, పరిపాలన సౌలభ్యం కోసం ప్రతి జిల్లాలో కనీసం రెండు, మూడు, నాలుగు రెవెన్యూ డివిజన్లు ఉండేలా కొత్త డివిజన్లతో కలిపి మొత్తం 72 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 మినహా, ఒక అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా ఒకే జిల్లాలో ఉండేలా కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి.  
సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక నేపథ్యంపై లోతైన అధ్యయనం, ప్రజల నుంచి వచ్చిన 17,500 పైగా విజ్ఞప్తుల పరిశీలన తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నూతన జిల్లాలు ఏర్పాటయ్యాయి.

మరిన్ని వార్తలు