వారందరికీ ఇళ్లు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నాం: సీఎం జగన్‌

1 Jan, 2021 12:58 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్లు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఏపీలో 30.75 లక్షల మందికి ఇళ్లపట్టాలు అందజేస్తున్నామని తెలిపారు. శుక్రవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంనుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘68,677 ఎకరాల భూమిని సేకరించి పంపిణీ చేస్తున్నాం. 16,098 ఈడబ్ల్యూఎస్‌ కాలనీలు అభివృద్ధి చేస్తున్నాం. 2022లోపే ఇళ్లు పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం. ( కొత్త సంవత్సర శుభాకాంక్షలు: సీఎం జగన్‌)

మహిళా లబ్ధిదారుల పేరిట ఇళ్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ఈ నిర్ణయం అమలుచేస్తున్నాం. కాలనీల్లో నీరు, విద్యుత్ సహా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. పీఎంఏవై అర్బన్ కింద ఏపీకి 20.21 లక్షల ఇళ్లు కేటాయించార’’ని వెల్లడించారు.

పీఎంఏవై(అర్బన్‌), ఆశా-ఇండియా అవార్డుల కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. పీఎంఏవై అర్బన్‌ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో ఏపీకి 3వ ర్యాంకు సొంతం చేసుకుంది. బెస్ట్‌ ప్రాక్టీస్, ఇన్నోవేషన్‌ ప్రత్యేక కేటగిరీలో రెండు అవార్డులను ఆంధ్రప్రదేశ్‌ సాధించింది. ఉత్తమ సమర్థత చూపిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ విభాగంలో గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌.. మొదటి ర్యాంకు, అవార్డును సొంతం చేసుకుంది.

మరిన్ని వార్తలు