డేటాతో పురోగతికి బాట: సీఎం జగన్

23 Feb, 2021 05:29 IST|Sakshi

ఆర్బీకేలు, సచివాలయాల్లో డేటాను విశ్లేషించాలి

ప్రణాళికా శాఖ సమీక్షలో సీఎం జగన్‌ ఆదేశం

లోపాలను గుర్తించి సరిదిద్దుతూ ముందుకెళ్లాలి

డిజిటల్‌ అసిస్టెంట్‌కు బాధ్యతలు

మండల స్థాయి ఉద్యోగి పర్యవేక్షణ

ఇ–క్రాపింగ్‌ డేటానూ సేకరించాలి

సుస్థిర సమగ్రాభివృద్ధి కోసం ఐరాస, అనుబంధ సంస్థల సహకారం

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాలు, వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల ద్వారా నిర్దేశిత లక్ష్యాలను సాధించడంపై దృష్టి సారించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం వాటిల్లో డేటాను సేకరించడంతో పాటు క్రోడీకరించి విశ్లేషించాలని సూచించారు. ఆర్బీకేలు, సచివాలయాల ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు, జీవన స్థితిగతుల్లో వచ్చిన మార్పులను ప్రతిబింబించేలా సమాచారం ఉండాలన్నారు. కాకి లెక్కలు కాకుండా వాస్తవాలను వెల్లడించేలా ఈ సమాచారం ఉండాలని స్పష్టం చేశారు. ఈ బాధ్యతలను డిజిటల్‌ అసిస్టెంట్‌లకు అప్పగించాలని ఆదేశించారు. దీనిపై పర్యవేక్షించే బాధ్యతలను మండల స్థాయి ఉద్యోగికి అప్పగించాలని సూచించారు.

ప్రణాళికా శాఖ అధికారులతో సీఎం జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా కేంద్రాల పరిధిలో చేపట్టే ఇ–క్రాపింగ్‌ లాంటి డేటాను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, దీనివల్ల ఇ– క్రాపింగ్‌ సక్రమంగా జరుగుతోందా? లేదా? అనే అంశంపై దృష్టి సారించవచ్చన్నారు.

కేవలం డేటాను సేకరించడమే కాకుండా విశ్లేషించడం ద్వారా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిపెట్టాలన్నారు. వివిధ కార్యక్రమాలకు సంబంధించి ఎంతవరకూ లక్ష్యాన్ని చేరుకున్నాం? లోపాలేమిటి? తదితర అంశాలను గుర్తించి ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లాలని సీఎం మార్గనిర్దేశం చేశారు. ప్రభుత్వం చేపట్టిన నాడు–నేడు కార్యక్రమాలకు కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద మరింత సహకారం అందేలా కృషి చేయాలన్నారు.  

ఉగాది రోజు వలంటీర్లకు సత్కారం..
వలంటీర్లను ఉగాది రోజు సత్కరించేందుకు కార్యాచరణ సిద్దం చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. వలంటీర్ల సేవలను గుర్తించేలా ప్రోత్సాహకాలతో వారిని గౌరవించాలన్నారు. సేవారత్న, సేవామిత్ర లాంటి అవార్డులతో ఉత్తమ సేవలు అందించిన వలంటీర్లను సత్కరించాలని సూచించారు. సమీక్షలో ప్రణాళికా శాఖ ఎక్స్‌ అఫీషియో సెక్రటరీ విజయ్‌కుమార్, కనెక్ట్‌ టూ ఆంధ్ర సీఈవో వి.కోటేశ్వరమ్మ, ఆర్టీజీఎస్‌ సీఈవో జె.విద్యాసాగర్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

ఐరాస లక్ష్యాలను సాధించేలా
సచివాలయాలు, ఆర్బీకేలు.. ఇలా గ్రామాల్లోని ప్రభుత్వ వ్యవస్థల్లో ఇంటర్నెట్‌ సరిగా పనిచేస్తోందా? లేదా? అనే వివరాలు ఎప్పటికప్పుడు అందాలని, దీనివల్ల పాలన సమర్థంగా ముందుకు సాగుతుందని సీఎం పేర్కొన్నారు. సుస్థిర సమగ్రాభివృద్ధికోసం ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 17 లక్ష్యాలను అందుకునేలా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ఐరాస, అనుబంధ విభాగాలు సహా ప్రపంచస్థాయి సంస్థల సహకారం తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్, యునెస్కో లాంటి సంస్థలతో కలసి పని చేయాలని సూచించారు. 

మరిన్ని వార్తలు