కృష్ణా నది కరకట్ట పనులకు రేపు సీఎం జగన్‌ శంకుస్థాపన

29 Jun, 2021 20:02 IST|Sakshi

సాక్షి, అమరావతి: కృష్ణా నది కరకట్ట విస్తరణ పనులకు రేపు సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10:25 గంటల ప్రాంతంలో సీఎం చేతుల మీదుగా ఈ పనులు ప్రారంభంకానున్నాయి. ప్రకాశం బ్యారేజి వద్దనున్న కొండవీటి వరద ఎత్తిపోతల పథకం నుంచి రాయపూడి వరకు 15.525 కి.మీ. మేర కుడివైపు కరకట్ట రోడ్డు విస్తరణ పనులు జరుగనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం రూ. 150 కోట్లు ఖర్చు చేయనుందని తెలిపారు. అమరావతి స్మార్ట్‌ అండ్‌ సస్టెయినబుల్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నిధులతో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఈ పనులు జరుగనున్నట్లు పేర్కొన్నారు. 10 మీటర్ల వెడల్పుతో రెండు వరుసల రహదారితో పాటు ఇరువైపులా రెండు వరుసల నడకదారులను నిర్మించనున్నట్లు అధికారులు వెల్లడించారు. 

ఈ రహదారిలో కొండవీటి వాగు బ్రిడ్జిని పునర్మించడంతో పాటు వెంకటాయపాలెం, రాయపూడి అవుట్‌ ఫాల్‌ స్లూయిస్, వరద పర్యవేక్షణ కేంద్రాలను నిర్మిస్తామని వివరించారు. ఈ రహదారితో అమరావతిలోని ఎన్‌-1 నుంచి ఎన్‌-3 రోడ్లను అలాగే ఉండవల్లి- రాయపూడి- అమరావతి సీడ్‌ యాక్సిస్‌ రోడ్, గొల్లపూడి- చిన్నకాకాని- విజయవాడ బైపాస్‌ రోడ్లకు అనుసంధానిస్తామని తెలిపారు. కరకట్ట రహదారి నిర్మాణం ద్వారా అమరావతి, సచివాలయం, హైకోర్టు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్ధలు, తాడేపల్లి మండలంలోని ఉండవల్లి, పెనుమాక, తుళ్ళూరు మండలం వెంకటపాలెం, మందడం, ఉద్దండరాయునిపాలెం, రాయపూడి, బోరుపాలెం, అబ్బురాజుపాలెం, అమరావతి మండలం హరిశ్చంద్రాపురం, వైకుంఠపురం గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు.
చదవండి: ప్రధాని మోదీకి సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ

మరిన్ని వార్తలు