అవినీతి లేకుండా పారదర్శక విధానం: సీఎం జగన్‌

19 Oct, 2020 15:50 IST|Sakshi

నూతన ఇసుక విధానంపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష 

సాక్షి, అమరావతి : ఇసుక తవ్వకాలు, సరఫరాలో ఎక్కడా అవినీతికి తావు ఉండొద్దని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండే ధరలో, పూర్తి పారదర్శక విధానం ఉండాలని అన్నారు. అలాగే ఇసుక సరఫరాలో ఎఫీషియన్సీ పెంచాలని, నాణ్యమైన ఇసుకనే సరఫరా చేయాలని సూచించారు. ఇసుక రీచ్‌లు సామర్థ్యం పెంచితే పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయని, వీలుంటే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ కూడా వస్తుందని సీఎం అంచనా వేశారు. ఈ మేరకు నూతన ఇసుక విధానంపై తన క్యాంప్‌ కార్యాలయంలో అధికారులతో సోమవారం సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో అధికారులకు మంత్రులకు సీఎం పలు సూచనలు, ఆదేశాలు జారీచేశారు. (బీసీలకు బాసటగా..)

సమీక్ష సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ..‘ ఇసుర తవ్వకాల్లో పారదర్శక విధానాన్ని అమలు చేయాలి. రవాణా వ్యయం ఎక్కువగా ఉంటుంది. చలాన్‌ కట్టి ఎవరైనా వచ్చి ఇసుక తీసుకుపోయే విధంగా ఉండాలి. ఏ రేటుకు అమ్మాలి? అన్నది నియోజకవర్గాలు లేదా ప్రాంతాల వారీగా నిర్ధారణ చేయాలి. అంతకన్నా ఎక్కువ రేటుకు అమ్మితే ఎస్‌ఈబీ రంగ ప్రవేశం చేస్తుంది. ఎవరికి వారు రీచ్‌కు వచ్చి కావాల్సిన ఇసుక తీసుకుపోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన సదుపాయాలు కల్పించాలి. కాంట్రాక్టర్‌ స్టాండ్‌బై రవాణా సదుపాయం కూడా కల్పించాలి. ఆ నియోజకవర్గంలో నిర్దేశించిన ధర కంటే ఎక్కువకు అస్సలు అమ్మడానికి వీల్లేదు.

ప్రభుత్వ నిర్మాణాలు, బలహీన వర్గాల ఇళ్లకు సబ్సిడీపై ఇసుక సరఫరా చేయాలి. టోకెన్లు ఇచ్చి ఇసుక సరఫరా చేయవచ్చు. స్థానికంగా ఉన్న వారికి ఇసుక అవసరమైతే, వారికి కూపన్లు ఇచ్చి, వాటిపై సబ్సిడీ ధరకు ఇసుక సరఫరా చేయొచ్చు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు ఎన్ని కిలోమీటర్ల పరిధి వరకు సబ్సిడీ ధరపై ఇసుక సరఫరా చేయవచ్చనే విషయాన్ని పరిశీలించాలి.’ అని పేర్కొన్నారు. సమీక్షలో ఈ అంశాలన్నింటినీ ప్రస్తావించిన సీఎం వైఎస్‌ జగన్, ఇసుక విధానం ఖరారుకు ముందు పత్రికా ప్రకటన ఇచ్చి, ప్రజల సూచనలు, సలహాలు పొందడంతో పాటు, వారి అభిప్రాయం కూడా తీసుకోవాలని మంత్రుల బృందాన్ని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, కొడాలి నానితో పాటు, పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. 

మరిన్ని వార్తలు