ఎయిడెడ్‌ విద్యా సంస్థలపై చంద్రబాబు వైఖరిని ఎండగట్టిన సీఎం వైఎస్‌ జగన్‌ 

27 Nov, 2021 03:57 IST|Sakshi

సంస్థల లక్ష్యం నెరవేరేలా అడుగులు వేస్తుంటే అడ్డంకులు

వాస్తవాలు వక్రీకరించి రాజకీయాలు చేస్తుండటం దుర్మార్గం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎయిడెడ్‌ విద్యా సంస్థల యాజమాన్యాలు, భోదనా సిబ్బంది, విద్యార్థులకు మంచి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు దాన్ని వక్రీకరిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఎయిడెడ్‌ విద్యా సంస్థలకు ప్రభుత్వం వ్యతిరేకం అన్నట్లుగా.. ఏదో అన్యాయం చేస్తున్నట్లుగా గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 వంటి మీడియా బలం ఉంది కాబట్టి.. ఒక అబద్ధాన్ని పదే పదే వాటితో చెప్పించి.. అదే నిజం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. శాసనసభలో శుక్రవారం విద్యారంగంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఏం చెప్పారంటే..

  • గతంలో ఆస్తిపాస్తులు బాగా ఉన్న వారు ఛారిటీ కింద తమ పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలనే లక్ష్యంతో భవనాలు నిర్మించి, వాటిలో పాఠశాలలు, కాలేజీలు పెట్టారు. వాటికి బోధన సిబ్బందిని ఇస్తూ ప్రభుత్వమూ సహకరిస్తూ వచ్చింది. కాలక్రమంలో భవనాలు పాతబడి శిథిలావస్థకు చేరుకున్నాయి.
  • 25 ఏళ్లుగా ఎవరైనా రిటైరైతే.. వారి స్థానాలను భర్తీ చేయడం లేదు. స్కూళ్లు, కాలేజీలు నడపడం ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారిపోయింది. ఒక వైపు ఖర్చులు పెరగడం, మరోవైపు ఆదాయం లేని పరిస్థితుల్లో స్కూళ్లు, కాలేజీలు నిర్వీర్యం అయిపోయాయి.
  • తమను ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకోవాలని ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లో పని చేస్తున్న బోధనా సిబ్బంది ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎయిడెడ్‌ విద్యా సంస్థల ఏర్పాటు వెనక ఉన్న ఉద్దేశం నెరవేరేలా  ఆప్షన్లు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

యాజమాన్యాల అంగీకారంతోనే..

  • నడపలేని పరిస్థితిలో ఉన్న ఎయిడెడ్‌ విద్యా సంస్థలను ఉన్నది ఉన్నట్లుగా ప్రభుత్వానికి అప్పగిస్తే వారి పేరే పెట్టి, శిథిలావస్థలో ఉన్న ఆ భవనాలను నాడు–నేడు పథకం ద్వారా అభివృద్ధి చేసి, విద్యార్థులకు సరిపడా టీచర్లను భర్తీ చేసి, ఆ విద్యా సంస్థల స్థాపన లక్ష్యాలను చేరుకునేందుకు సహాయంగా నిలుస్తుంది.
  • తాము ప్రభుత్వంలో భాగమయ్యేలా చూడాలంటూ ఎయిడెడ్‌ టీచర్లు కూడా డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో వారి డిమాండ్‌ను కూడా పరిగణలోకి తీసుకుని.. వారిని సరెండర్‌ చేసి ప్రైవేటు సంస్థగా యాజమాన్యాలు నడుపుకోవచ్చు. n లేదా ఇప్పుడు ఉన్నది ఉన్నట్లుగా యథా ప్రకారం నడుపుకోవచ్చు. ప్రభుత్వానికి ఏ అభ్యంతరం లేదు. ఇప్పటికే ఎవరైనా ప్రభుత్వానికి అప్పగిస్తూ నిర్ణయించినా, దాన్ని వెనక్కు తీసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇస్తోంది.
  • తప్పును సరిదిద్ది మంచి చేయాలని సంకల్పిస్తే.. దాన్ని కూడా వక్రీకరించి దుర్మార్గంగా రాజకీయాలు చేస్తే, ఏ విధంగా రాష్ట్రం బాగు పడుతుందో ఒక్కసారి ఆలోచించాలని కోరుతున్నాను. 
మరిన్ని వార్తలు