రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం

13 Nov, 2022 03:33 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:  ‘‘ఎనిమిదేళ్ల క్రితం తగిలిన అతిపెద్ద గాయం నుంచి మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ ఇంకా కోలుకోలేదు. విభజన హామీల్లో పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకూ.. స్టీల్‌ప్లాంట్‌ నుంచి రైల్వే జోన్‌ దాకా పలు అంశాలపై అనేకసార్లు విజ్ఞప్తులు చేశాం. మీరు (ప్రధాని మోదీ) సహృదయంతో వాటిని సానుకూలంగా పరిష్కరించాలని కోరుతున్నాం. రాష్ట్ర ప్రయోజనాలు మినహా మా ప్రభుత్వానికి మరో అజెండా లేదు.. ఉండదు.. ఉండబోదు’’ అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. శనివారం విశాఖ ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో విభజన హామీలను నెరవేర్చాలంటూ ప్రధాని మోదీని సీఎం జగన్‌ మరోసారి కోరారు.

తొలుత వేదికపైకి ప్రధానికి సాదరంగా స్వాగతం పలుకుతూనే.. రాష్ట్ర పరిస్థితులు, చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కేంద్రం అందించాల్సిన సహాయ సహకారాలు, దీర్ఘకాలంగా ప్రజల ఆకాంక్షలను ఆయన ముందుంచారు. ఉత్తరాంధ్ర గడ్డపై నడయాడిన అభ్యుదయ వాదులు గురజాడ అప్పారావు, శ్రీశ్రీ, వంగపండు సూక్తులను తన ప్రసంగంలో సీఎం జగన్‌ ప్రస్తావించారు. ఆ వివరాలివీ.. 

పున్నమి కెరటాలకు మించి.. 
ఇక్కడకి వచ్చిన ప్రజలను చూస్తుంటే ప్రజాకవి, గాయకుడు వంగపండు మాటలు, పాటలు  గుర్తుకొస్తున్నాయి. ‘ఏం పిల్లడో ఎల్దామొస్తవా..!’ అంటూ ఈ రోజు మనం తలపెట్టిన ఈ మహాసభకు ఉత్తరాంధ్ర జనం ప్రభంజనంలా కదలి రావడం కనిపిస్తోంది. ఈ రోజు చారిత్రక ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో ఒకవైపు సముద్రం కనిపిస్తోంది. మరోవైపు జన సముద్రాన్ని తలపిస్తోంది. కార్తీక పౌర్ణమివేళ ఎగసిపడిన కెరటాలకు మించి జన కెరటాలు ఇక్కడ ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. దేశ ప్రగతి రథసారధి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, కేంద్ర మంత్రివర్యులకు, లక్షలాదిగా తరలి వచ్చిన నా అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, అవ్వా తాతలకు ప్రభుత్వం తరపున ఉత్తరాంధ్ర గడ్డ మీద విశాఖలో సాదరంగా స్వాగతం పలుకుతున్నా.  

ఆకాంక్షలకు అద్దం.. 
దేశమంటే మట్టికాదోయ్‌.. దేశమంటే మనుషులోయ్‌ అని చాటి చెప్పిన విజయనగరం వాసి, మహాకవి గురజాడ మాటలు మనందరికీ కర్తవ్య బోధ చేస్తున్నాయి. ప్రజల ఆకాంక్షలకు ఇక్కడకు తరలి వచ్చిన జన సాగరం అద్దం పడుతోంది. ఇదే నేలమీద నడయాడిన మహాకవి శ్రీశ్రీ మాటల్లో చెప్పాలంటే ‘‘వస్తున్నాయ్‌.. వస్తున్నాయ్‌.. జగన్నాథ రథ చక్రాలొస్తున్నాయ్‌..’’ అంటూ కదలివస్తున్న లక్షల జనసందోహం మన ఎదుట కనిపిస్తోంది. దాదాపు రూ.10,742 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్న ప్రధాని మోదీకి అశేష జనవాహిని తరపున, రాష్ట్ర ప్రజలందరి తరపున నిండు మనసుతో కృతజ్ఞతలు.  

ప్రతి కుటుంబం నిలదొక్కుకునేలా..
ప్రజల ప్రభుత్వంగా గత మూడున్నరేళ్లలో పిల్లల చదువులు, వైద్యం, రైతుల సంక్షేమం, సామాజిక న్యాయం, మహిళా సంక్షేమంతో పాటు అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించాం. వికేంద్రీకరణ, పారదర్శకత కోసం గడప వద్దకే పరిపాలన లాంటివి మా ప్రాధాన్యతలుగా అడుగులు వేశాం. ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలదొక్కుకోవడం అంటే ఈ రాష్ట్రంలోని ప్రతి గ్రామం, ప్రతి ఇల్లు, ప్రతి ఒక్క కుటుంబం నిలదొక్కుకోవడమే అని నమ్మి ఇంటింటా ఆత్మ విశ్వాసాన్ని నింపడానికి మా ఆర్థిక వనరుల్లో ప్రతి రూపాయినీ సద్వినియోగం చేశాం. ఒక రాష్ట్ర ప్రభుత్వంగా శక్తి మేరకు మేం చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం మరింత సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నా.   

ప్రతి రూపాయీ పునర్నిర్మాణానికే.. 
ఎనిమిదేళ్ల క్రితం తగిలిన అతిపెద్ద గాయం నుంచి మా రాష్ట్రం  ఇంకా కోలుకోలేదు. మా గాయాలు మానేలా, మా రాష్ట్రం జాతీయ స్రవంతితో కలసి అభివృద్ధి చెందడానికి వీలుగా విశాల హృదయంతో మీరు కేటాయించే ప్రతి సంస్థ, అదనంగా ఇచ్చే ప్రతి రూపాయీ ఏపీ పునర్నిర్మాణానికి గొప్పగా ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని ఏపీ కోసం చేసే ఏ మంచి పనైనా రాష్ట్ర ప్రజానీకం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది. కేంద్ర ప్రభుత్వంతో గానీ, ప్రత్యేకంగా ప్రధాని మోదీతో గానీ మా అనుబంధం పార్టీలకు, రాజకీయాలకతీతం. ఏపీకి, రాష్ట్ర ప్రజలకు గత ప్రభుత్వాలు చేసిన అన్యాయాలను ఇక్కడి ప్రజలు గుర్తు పెట్టుకున్నారు.  

డీజీపీకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అభినందన 
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిన డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని సీఎం జగన్‌ శనివారం అభినందించారు. విశాఖలో ప్రధాని  రెండు రోజుల పర్యటన సందర్భంగా డీజీపీ.. సీనియర్‌ ఐపీఎస్‌ల నేతృత్వంలో  పకడ్బందీగా భద్రతా చర్యలు చేపట్టారు. డీజీపీ పర్యవేక్షణలో తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని నగర పర్యటన, రోడ్‌ షోకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా  జాగ్రత్తలు తీసుకున్నారు. బహిరంగ సభకు లక్షలాది మంది ప్రజలు హాజరైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.   ఈ నేపథ్యంలో పోలీస్‌ శాఖను సీఎం  అభినందించారని డీజీపీ కార్యాలయం వెల్లడించింది.   

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు