సరిహద్దుల్లో చిన్న అలజడి రేగినా రక్తం మరిగిపోతుంది

18 Feb, 2021 05:55 IST|Sakshi
తిరుపతిలో సాక్షితో మాట్లాడుతున్న వేణుగోపాల్‌

దేశం కోసం పోరాడాలనే ఆలోచన తప్ప మరో వ్యసనం లేదు

రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ సి.వేణుగోపాల్‌

నేడు ఆయన ఇంటికి వెళ్లి సత్కరించనున్న సీఎం జగన్‌

తిరుపతి (అన్నమయ్య సర్కిల్‌): ఆయన వయసు 95 ఏళ్లు.. పూర్తిగా మంచానికే పరిమితమయ్యారు. అయినా.. నిత్యం దేశం కోసమే ఆలోచిస్తారు. దేశ సరిహద్దుల్లో ఏవైనా అలజడులు తలెత్తినట్టు తెలిస్తే మదనపడిపోతారు. ఆ రోజూ భోజనం కూడా సరిగా చేయరు. ఆయన పేరు సి.వేణుగోపాల్‌.. రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌. ఆర్మీలో పని చేస్తున్నప్పుడు శత్రు దేశాలను వణికించారు. భారత్‌–పాక్‌ యుద్ధ సమయంలో భారత జవాన్ల సత్తా ఏమిటో శత్రు సైన్యానికి రుచి చూపించిన ఆ మహాయోథుడు తిరుపతిలో శేష జీవితాన్ని గడుపుతున్నారు.

1971లో ఇండియా, పాకిస్తాన్‌ సరిహద్దులో జరిగిన యుద్ధంలో ఇండియన్‌ ఆర్మీ సాధించిన విజయాన్ని పురస్కరించుకుని తిరుపతి కేంద్రంగా గురువారం ‘స్వర్ణిమ్‌ విజయ్‌ వర్‌‡్ష’ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరవుతున్నారు. నాటి యుద్ధంలో పాల్గొన్న ప్రధాన అధికారుల్లో ఒకరైన రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ సి.వేణుగోపాల్‌ను ఆయన ఇంటికి వెళ్లి సీఎం సత్కరించనున్నారు. ఈ సందర్భంగా వేణుగోపాల్‌ను ‘సాక్షి’ పలకరించింది. ఆయన ఏమన్నారంటే..

దేశం కోసం పోరాడాలనే ఆలోచనే..
మాది తిరుపతి సరోజినిదేవి రోడ్డు ప్రాంతంలో ఓ సాధారణ కుటుంబం. 1927 నవంబర్‌ 14న పుట్టాను. మా తల్లిదండ్రులు చిన్నస్వామి, రుక్మిణమ్మలకు మేం 9 మంది సంతానం. నేను రెండో వాడిని. అందరూ వివిధ ప్రాంతాల్లో సెటిలయ్యారు. నాకు చిన్నప్పటి నుంచి దేశ సేవ చేయాలనే తపన ఒక్కటే ఉండేది. ఎలాగైనా సైన్యంలో చేరాలని ఆరాటపడేవాడిని. ఆర్మీలో హవల్దార్‌గా చేరి నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (డెహ్రాడూన్‌)లో సీటు సాధించాను. కఠోర శిక్షణ పొంది గుర్కా రైఫిల్స్‌లో చేరి లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ హోదాకు ఎదిగాను. ఈశాన్య రాష్ట్రాల్లో గుర్కా రైఫిల్స్‌ మలౌన్‌ రెజిమెంట్‌లో పనిచేస్తూ మేజర్‌ జనరల్‌ హోదాలో పదవీ విరమణ చేశాను. 1971 డిసెంబర్‌ 4న శుత్రు సైన్యం సరిహద్దులోని వుథాలి, దర్శన ప్రాంతాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేయగా.. ఇండో–పాక్‌ యుద్ధం జరిగింది. అందులో నేను సభ్యుడిగా.. బెటాలియన్‌కు నాయకుడిగా ఉంటూ సైన్యాన్ని అప్రమత్తం చేసి విజయం సాధించాం.

దేశసేవకు గుర్తింపుగా రాష్ట్రపతి చేతుల మీదుగా ‘పరమ్‌ విశిష్ట్‌ సేవా మెడల్‌’ (పీవీఎస్‌ఎం), మహావీర్‌ చక్ర (ఎంవీసీ) అవార్డులు అందుకున్నాను. 1950 నుంచి 1986 వరకు సుమారు 36 ఏళ్లు ఆర్మీలో కొనసాగాను.  ఇప్పటికీ దేశ సరిహద్దులో శత్రుసైన్యాలు అలజడి చేస్తే రక్తం మరిగిపోతుంది. 95 ఏళ్ల వయసులో శరీరం సహకరించకపోయినా దేశం కోసం పోరాడాలనే ఆలోచనే తప్ప మరో వ్యసనం లేదు. అందుకే వివాహం చేసుకోలేదు. ఎవరికైనా సరే వ్యక్తి ప్రయోజనాలు ముఖ్యం కాదు. దేశ ప్రయోజనాల కోసం ఆలోచించే సమాజం కావాలి. అందుకు యువత నడుం కట్టాలి. టెక్నాలజీ మాత్రమే ప్రపంచం కాదు. దేశమే ప్రధానం.. ఆ తరువాతే టెక్నాలజీ. ప్రతి పౌరుడూ రోజుకు కనీసం 5 నిమిషాలపాటు దేశం కోసం ఆలోచన చేయాలి. అప్పుడే దేశం మనకు కోరిన కోర్కెలను తీరుస్తుంది. జై జవాన్‌.. భారత్‌ మాతాకీ జై’ అంటూ ముగించారు.

నేటి నుంచి తిరుపతిలో సాయుధ దళాల స్వర్ణోత్సవాలు
సాక్షి, తిరుపతి/సాక్షి,అమరావతి:  ఆధ్యాత్మిక నగరం తిరుపతి సాయుధ దళాల స్వర్ణోత్సవాలకు సిద్ధమైంది. దాయాది పాకిస్తాన్‌పై భారత సాయుధ దళాల అద్భుత విజయానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ‘స్వర్ణిమ్‌ విజయ్‌ వర్‌‡్ష’ కార్యక్రమాల్లో భాగంగా తిరుపతిలో గురువారం నుంచి శనివారం వరకు స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. 1971 డిసెంబర్‌ 4న బంగ్లాదేశ్‌ విముక్తికి పాక్‌తో జరిగిన యుద్ధంలో భారత్‌ చిరస్మరణీయమైన విజయం సాధించింది. ఆ యుద్ధంలో పాల్గొని పరమవీర చక్ర, మహావీర చక్ర అవార్డులు పొందిన రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ సి.వేణుగోపాల్‌(95). వీరచక్ర అవార్డు పొందిన విశాఖకు చెందిన సన్యాసినాయుడు, కాకినాడకు చెందిన కేజే క్రిస్టోఫర్‌ కుటుంబ సభ్యులను సీఎం సన్మానిస్తారు.  

తిరుపతికి చేరుకున్న విజయ జ్వాల
స్వర్ణిమ్‌ విజయ్‌ వర్‌‡్ష కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలో బయలుదేరిన విజయ జ్వాల (విక్టరీ ప్లేమ్‌) హైదరాబాద్‌ నుంచి బుధవారం తిరుపతికి చేరింది. విజయ జ్వాలకు ఆర్మీ అధికారులు తిరుపతి ఎస్వీ వర్సిటీ పరిపాలనా భవనం వద్ద ఘన స్వాగతం పలికారు.

మరిన్ని వార్తలు