ముగిసిన సీఎం జగన్‌ రెండు రోజుల తిరుమల పర్యటన

12 Oct, 2021 12:57 IST|Sakshi

సాక్షి, తిరుపతి: రెండు రోజుల తిరుమల పర్యటన ముగించుకొని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న సీఎం జగన్‌కు మహా ద్వారం వద్ద టీటీడీ చైర్మన్, ఈఓలు స్వాగతం పలికారు. సీఎం జగన్‌ శ్రీవారి ధ్వజ స్తంభాన్ని నమస్కరిస్తూ ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారికి బియ్యంతో తులాభారం మొక్కులు సమర్పించారు. సీఎం జగన్‌కు అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చి, స్వామివారి తీర్ధప్రసాదాలను అందచేశారు. 





శ్రీవారి దర్శనం అనంతరం సీఎం జగన్‌.. శ్రీవేంకటేశ్వర భక్తి చానల్‌కు సంబంధించి.. కన్నడ, హిందీ చానళ్లను ప్రారంభించారు. సీఎం జగన్‌ వెంట మంత్రులు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, నారాయణ స్వామి, అనీల్ కుమార్ యాదవ్, గౌతమ్ రెడ్డి, చెల్లుబోయిన వేణుగోపాల్, ఎమ్మెల్యేలు ఉన్నారు. చదవండి: బడితోనే అమ్మఒడి

బూందీ పోటును ప్రారంభించిన సీఎం జగన్‌
తిరుమలలో రూ.10 కోట్లతో నూతనంగా నిర్మించిన బూందీపోటు భవనాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు.

అటు తర్వాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నమయ్య భవన్‌లో రైతు సాధికార సంస్థ, టీటీడీ మధ్య జరిగే ఒప్పందం కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం జగన్‌ సమక్షంలో టీటీడీ, రైతు సాధికార సంస్థ మధ్య ఎంవోయూ కుదిరింది. అనంతరం శ్రీ పద్మావతి అతిధి గృహం నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు సీఎం జగన్‌. చదవండి: దేవదేవుడికి సీఎం పట్టువస్త్రాల సమర్పణ

మరిన్ని వార్తలు