గాంధీ అడుగు నీడలో ఏపీ పాలన : సీఎం జగన్‌

2 Oct, 2020 10:50 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళి అర్పించారు. మహాత్ముడి 151వ జయంతిని పురస్కరించుకుని దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన బోధించిన సత్యం, అహింసా ఎంతో ఉన్నతమైనవని కొనియాడారు. గాంధీ ఆశయాల సాధన కోసం ఆయన సిద్ధాంతాలను పాటిస్తూ పాలనతో ముందడుగు వేస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే గత ఏడాది అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్భంగా ఆయన కలలుకన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాలను స్థాపించి గాంధీ కలలుకన్న దేశాన్ని నిర్మించేందుకు ముందడుగు వేశాం అని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. (బాపు కల నెరవేరిందిలా..)

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల, డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి.. మంత్రి కన్నబాబు, ఎంపీ నందిగం సురేష్, పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి నివాళులర్పించారు.

మరిన్ని వార్తలు