Heavy Rains: ఆ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్‌

11 Nov, 2021 17:28 IST|Sakshi

ఏపీలో భారీ వర్షాలపై సీఎం జగన్‌ సమీక్ష

సాక్షి, తాడేపల్లి: తడ, సూళ్లూరుపేట సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఏపీలోని వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో తాడేపల్లిలోని తాన క్యాంప్‌ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. తమిళనాడు సరిహద్దుల్లో ఆప్రమత్తంగా ఉండాలని తెలిపారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు చేరుకున్నాయని, కర్నూలులో మరో రెండు బృందాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. మంగళగిరిలో కూడా అదనపు బృందాలు సిద్ధం చేశామని చెప్పారు. పరిస్థితులను బట్టి వారి సేవలను వినియోగించుకోవచ్చని సీఎం అన్నారు.

చదవండి: మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌కు సీఎం జగన్‌ నివాళి

‘‘అవసరమైన చోట సహాయ శిబిరాలు తెరవండి. సహాయ శిబిరాల్లో ఉంచిన వారిని బాగా చూసుకోండి. వారికి మంచి ఆహారం అందించండి. బాధితులకు వేయి రూపాయల చొప్పున వారికి అందించండి. బాధితులను ఆదుకునేందుకు అన్నిరకాలుగా చర్యలు తీసుకోండి. ఏం కావాలన్నా.. వెంటనే అడగండి. బాధితులకోసం ఒక ఫోన్‌ నంబర్‌ను అందుబాటులో ఉంచండి. వివిధ విభాగాలతో సమన్వయం చేసుకోండి. లైన్‌ డిపార్ట్‌మెంట్లను సిద్ధంచేయండి. ఎస్‌ఓపీల ప్రకారం అన్నిరకాల చర్యలను తీసుకోండి. ముంపు ప్రాంతాలనుంచి ప్రజలను తరలించేలా చర్యలు తీసుకోండి. అవసరమైన మందులను సరిపడా అందుబాటులో ఉంచుకోవాలని’’  సీఎం సూచించారు.

‘‘పీహెచ్‌సీల్లో, ఏరియా ఆస్పత్రుల్లో, జిల్లా ఆస్పత్రుల్లో అన్నిరకాల మందులను ఉండేలా చర్యలు తీసుకోండి. వర్షాల అనంతరం కూడా పారిశుద్ధ్యం విషయంలో చర్యలు తీసుకోండి. అత్యవసర సేవలకు అంతరాయం రాకుండా జనరేటర్లను కూడా చర్యలు తీసుకోండి. విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతింటే.. వెంటనే వాటిని ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. యుద్ధ ప్రాతిపదికిన చర్యలు తీసుకునేలా విద్యుత్‌శాఖ అధికారులు సిద్ధంగా ఉండాలి. తాగునీటిప్యాకెట్లను బాధిత ప్రాంతాల్లో పంపిణీ చేయండి. భారీ వర్షాల కారణంగా రిజర్వాయర్లు, చెరువులు, నీటి పారుదల సదుపాయాల పట్ల అప్రమత్తంగా ఉండండి. గండ్లు పడకుండా చర్యలు తీసుకోండి. ఎప్పటికప్పుడు నీటి ప్రవావాహాలను, వర్షాలను అంచనా వేసుకుంటూ.. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా నీటిని విడుదల చేయండి. ఇదే సమయంలో తీసుకోవాల్సిన అన్ని చర్యలూ తీసుకోవాలని’’ సీఎం పేర్కొన్నారు.

‘‘రోడ్లు ఇతరత్రా మౌలిక సదుపాయాలకు ఎక్కడ నష్టం వాటిల్లినా వెంటనే మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని.. తీవ్ర ప్రభావిత మండలాల్లో అగ్నిమాపక కేంద్రాలను, సిబ్బంది సేవలను వినియోగించుకోవాలన్నారు. ఫోన్‌కాల్‌కు తాము అందుబాటులో ఉంటామని.. ఇంకా ఏం కావాలన్నా వెంటనే తెలియజేయాలని’’ సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు