వంశధార ట్రిబ్యునల్ తీర్పు సంతోషకరం: సీఎం జగన్‌

22 Jun, 2021 15:30 IST|Sakshi

సాక్షి, అమరావతి: వంశధార జల వివాదాల ట్రిబ్యునల్ తీర్పు సంతోషకరమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ట్రిబ్యునల్ నిర్ణయం ఏపీ, ఒడిశాకు ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. గెజిట్ విడుదలైన తర్వాత వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. నేరడి బ్యారేజీ శంకుస్థాపనకు ఒడిశా ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ వెల్లడించారు.

కాగా వంశధార నదీ జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదానికి ముగింపు పలుకుతూ ఇచ్చిన తుది తీర్పునే వీడబ్ల్యూడీటీ (వంశధార జల వివాదాల ట్రిబ్యునల్‌) ఖరారు చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌ 13, 2017న ఇచ్చిన తుది తీర్పుపై అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం–1956 సెక్షన్‌–5(3) కింద ఒడిశా సర్కార్‌ లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఈ మేరకు సోమవారం వీడబ్ల్యూడీటీ చైర్మన్‌ జస్టిస్‌ డాక్టర్‌ ముకుందకం శర్మ ఉత్తర్వులు జారీ చేస్తూ కేంద్రానికి నివేదించారు.

వంశధార ట్రిబ్యునల్‌ తుది తీర్పును నోటిఫై చేస్తూ కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేస్తే.. ఆ తీర్పు అమల్లోకి వస్తుంది. తుది తీర్పును సవాల్‌ చేస్తూ ఒడిశా సర్కార్‌ దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం ఆధారంగా కేంద్రం ఆ తీర్పును నోటిఫై చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది.

చదవండి: వంశధార జలాల వివాదానికి చరమగీతం
ఆ ఘటన నా మనసును కలచివేసింది: సీఎం జగన్‌ 

మరిన్ని వార్తలు