సీఎం జగన్‌ గ్రీన్‌సిగ్నల్‌: 539 కొత్త 104 వాహనాలు

26 Sep, 2021 05:38 IST|Sakshi

కొనుగోళ్లకు సీఎం గ్రీన్‌సిగ్నల్‌

ఇందులో ఇప్పటికే 432 వాహనాల కొనుగోళ్లకు టెండర్లు

వాహనాల కొనుగోళ్లకు రూ.89 కోట్లు, నిర్వహణకు ఏడాదికి రూ.75 కోట్ల వ్యయం

పల్లె ప్రజలకు ఫ్యామిలీ డాక్టర్‌ విధానంలో నాణ్యమైన వైద్యం

మండలానికి రెండు చొప్పున 104 ‘మొబైల్‌ మెడికల్‌’ వాహనాలు

ఇప్పటికే 656 వాహనాల ద్వారా వైద్య సేవలు: వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈవో వినయ్‌చంద్‌

సాక్షి, అమరావతి: గ్రామీణ, మూరుమూల ప్రాంతాల ప్రజలకు వారి ముంగిటే నాణ్యమైన వైద్య సేవలు రానున్నాయి. ఇందుకోసం ఉద్దేశించిన ఫ్యామిలీ డాక్టర్‌ వ్యవస్థను అమల్లోకి తెచ్చేందుకు 539 కొత్త 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ వాహనాలు కొనుగోలు చేసేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో 432 కొత్త 104 వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ వైద్య సేవల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) టెండర్లను ఆహ్వానించింది. మిగతా వాహనాల కొనుగోళ్లకు చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే మండలానికి ఒకటి చొప్పున మొత్తం 656 కొత్త వాహనాల ద్వారా గ్రామీణ, గిరిజన ప్రజలకు అక్కడే వైద్య సేవలందిస్తున్నారు.

మారుమూల ప్రాంతాల ప్రజలకూ..
ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను అమలు చేయడం ద్వారా గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు. ఇందులో భాగంగా మండలానికి రెండేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌వాహనం, ఇద్దరు డాక్టర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో మండలానికి రెండు చొప్పున 104 వాహనాలను సమకూర్చేందుకు కొత్తగా మరో 539 కొనుగోలు చేస్తున్నారు.

టెండర్లలో ఎల్‌–1గా నిలిచిన సంస్థ పేర్కొన్న ధరకు మళ్లీ రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించనున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను అమలు చేస్తున్నారు. ఇందులో సాధకబాధకాలను తెలుసుకుని పటిష్టంగా ఈ కాన్సెప్ట్‌ను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. 258 మండలాల్లో నవంబర్‌ 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. కొత్తగా కొనుగోలు చేసే వాటితో కలిపి రాష్ట్రంలో మొత్తం 1,195 మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ వాహనాలు అందుబాటులోకి వస్తాయి.
 

జనాభాను దృష్టిలో పెట్టుకుని..
జనాభాను దృష్టిలో పెట్టుకుని 104 వాహనాలను వినియోగించాలంటూ సీఎం ఆదేశించారని ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈవో వినయ్‌చంద్‌ తెలిపారు. 539 కొత్త వాహనాల కొనుగోలుకు సుమారు రూ.89 కోట్లు వ్యయం అవుతుందన్నారు. వాటి నిర్వహణకు ఏడాదికి రూ.75 కోట్ల వరకు ఖర్చవుతుందని తెలిపారు. ప్రతి గ్రామ సచివాలయానికి నెలకు కనీసం రెండుసార్లు 104 వాహనంలో వైద్యులు వెళ్లి ఉదయం ఓపీ చూస్తారన్నారు. మధ్యాహ్నం నుంచి ఇంటింటికీ వెళ్లి వైద్య సేవలు అందించడం, పరీక్షలు నిర్వహించడం చేస్తారని వివరించారు. కొత్త 104 వాహనాలు జవనరి 26 నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. ఇందులో భాగంగానే కొత్తగా 176 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు