షీలా కమిటీ సిఫార్సులే దిక్సూచి

28 Sep, 2022 04:38 IST|Sakshi
సమావేశానికి హాజరైన ఏపీ సీఎస్, అధికారులు

ఆ మేరకు విభజించుకుందాం

ఏపీ భవన్‌ ఆస్తులను ఇరు రాష్ట్రాలకు త్వరగా పంచాలి 

విభజన సమస్యల పరిష్కారంపై తెలుగు రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ భేటీలో ఏపీ 

సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్‌ 9లో పొందుపరచిన ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ల మొత్తం ఆస్తులు, అప్పులను షీలా భిడే కమిటీ సిఫార్సుల మేరకు ఇరు రాష్ట్రాలూ విభజించుకుందామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్ర హోంశాఖ వద్ద ప్రతిపాదించింది. విభజన సమస్యల పరిష్కారంపై ఆంధ్రప్రదేశ్‌ అడుగు ముందుకు వేసినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఇందుకు విముఖత వ్యక్తం చేసింది.

కేంద్ర హోంశాఖ మాత్రం ఏపీ ప్రతిపాదనల పట్ల సానుకూలత వ్యక్తం చేస్తూ న్యాయ శాఖ సలహా తీసుకోనున్నట్లు తెలిపింది. రాష్ట్ర విభజనకు సంబంధించి పెండింగ్‌ సమస్యల పరిష్కారంపై ఢిల్లీలో మంగళవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌లతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారుల సమావేశం జరిగింది.  

► షెడ్యూల్‌ 9లో పేర్కొన్న 90 ప్రభుత్వ రంగ సంస్ధలు, కార్పొరేషన్ల ఆస్తులు, అప్పులను ఇరు రాష్ట్రాలకు విభజిస్తూ షీలా భిడే నిపుణుల కమిటీ సిఫార్సులు చేసింది. అయితే 68 సంస్థలకు సంబంధించిన సిఫార్సులను తెలంగాణ ప్రభుత్వం, వీటిలో 53 సంస్ధల సిఫార్సులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇన్ని రోజులుగా అంగీకరిస్తూ వచ్చినా విభజన మాత్రం జరగలేదు.

తాజాగా జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మొత్తం 90 సంస్ధలకు సంబంధించి షీలా భిడే సిఫార్సులను యధాతథంగా అమలు చేయాలని కేంద్ర హోంశాఖను కోరింది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసింది. దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ కోరగా న్యాయ సలహా తీసుకుంటామని కేంద్ర హోంశాఖ కార్యదర్శి తెలిపారు.  

► విభజన చట్టం షెడ్యూల్‌ 10లో పేర్కొన్న ఇన్‌స్టిట్యూట్స్‌ ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించి 2016లో కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం డిమాండ్‌ చేసింది. పదో షెడ్యూల్‌లోని 142 ఇన్‌స్టిట్యూషన్ల ఆస్తులు, అప్పుల పంపిణీ జనాభా ప్రాతిపదికన జరగాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోరుతూ వస్తోంది.

అందుకు అనుగుణంగా ఒక సంస్థ విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా ఇచి్చంది. అయితే కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు సుప్రీం తీర్పునకు విరుద్ధంగా ఉన్నందున ఆ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ డిమాండ్‌ చేసింది. దీనిపై సొలిసిటర్‌ జనరల్‌ అభిప్రాయాన్ని తీసుకోవాలని కేంద్ర హోంశాఖను కోరింది.  

► ఢిల్లీలోని ఏపీ భవన్‌ ఆస్తులను ఇరు రాష్ట్రాలకు త్వరగా పంపిణీ చేయాలని  ఏపీ ప్రభుత్వం కోరగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి సానుకూలంగా స్పందించారు. విభజన చట్టం నిబంధనల మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేయాలని, జాప్యం చేయవద్దని ఏపీ ప్రభుత్వం కోరింది. సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌శర్మ, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్, రాష్ట్ర పునర్విభజన ముఖ్యకార్యదర్శి ఎల్‌.ప్రేమచంద్రారెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

వ్యయం భారీగా పెరుగుతోంది..
► నూతన రాజధాని కోసం రూ.25 వేల కోట్ల వ్యయం అవుతుందని శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికలో పేర్కొన్నారని, ఆ నివేదిక ఇచ్చి చాలా సంవత్సరాలైనందున వ్యయం భారీగా పెరుగుతుందని, ఆ మేరకు నిధులివ్వాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం డిమాండ్‌ చేసింది. మీరిచ్చే రూ.2,500 కోట్లు ఏ మూలకూ  సరిపోవని ఏపీ ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు స్పష్టం చేసింది.  

► నూతన రాజధానికి ర్యాపిడ్‌ రైల్‌ కనెక్టివిటీ ఏర్పాటును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రస్తావించగా వయబుల్‌ కాదని రైల్వే శాఖ పేర్కొంది. దీనిపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేని కారణంగానే విభజన చట్టంలో చేర్చారని, వయబుల్‌ కాకపోయినప్పటికీ కేంద్రం చేపట్టాలని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఏపీ వాదనతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఏకీభవిస్తూ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని రైల్వే శాఖకు సూచించారు. 

మరిన్ని వార్తలు