69 పట్టణాల్లో 54,056 ఇళ్లు

23 Jan, 2021 11:53 IST|Sakshi

మూడు దశల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణం

ఏడాదిన్నరలో పూర్తిచేసేందుకు కార్యాచరణ

రివర్స్‌ టెండరింగ్‌తో రూ.392.23 కోట్లు ఆదా

సాక్షి, అమరావతి: రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా కాంట్రాక్టులు ఖరారు చేసిన ఇళ్ల నిర్మాణ ప్రక్రియను ఆంధ్రప్రదేశ్‌ టౌన్‌షిప్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీ టిడ్కో) వేగవంతం చేసింది. 69 పట్టణాల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులతో గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో చేపట్టిన 54,056 ఇళ్ల నిర్మాణం ఏడాదిన్నరలో పూర్తిచేయాలని నిర్ణయించింది. టీడీపీ ప్రభుత్వం హయాంలో అత్యధిక రేట్లకు ఖరారు చేసిన యూనిట్లకు ప్రస్తుతం రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియ పూర్తిచేసింది. ఈ ఇళ్ల నిర్మాణానికి మొత్తం 12 దశల్లో నిర్వహించిన రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.392.23 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసింది. వీటి నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం రూ.3,239.39 కోట్లకు టెండర్లు కట్టబెట్టింది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించి రూ.2,847.16 కోట్లకు టెండర్లు ఖరారు చేసింది.

టీడీపీ ప్రభుత్వంలో చదరపు అడుగుకు (ఎస్‌ఎఫ్‌టీకి) రూ.1,815 వ్యయంగా నిర్ణయించగా.. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రూ.1,593కే ఖాయం చేసింది. టిడ్కో ఇళ్ల ప్రాజెక్టుల్లో రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజీ వ్యవస్థ, అంగన్‌వాడీ కేంద్రాలు, ఇతర మౌలిక వసతులు కూడా సమకూర్చనున్నారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఈ 54,056 ఇళ్ల నిర్మాణ పనుల్ని నాలుగు కాంట్రాక్టు సంస్థలు దక్కించుకున్నాయి. ఈ ఇళ్లను మూడుదశల్లో ఏడాదిన్నరలో పూర్తిచేయాలని ఇటీవల కాంట్రాక్టు సంస్థల వారితో సమావేశమైన టిడ్కో ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. టిడ్కో క్వాలిటీ కంట్రోల్‌ విభాగం అధికారులు ఇళ్ల నిర్మాణ నాణ్యతను తరచు పరీక్షిస్తున్నారు.
(చదవండి: స్థలం మాది.. ఇల్లు మాది.. జగనన్న వరం ఇది..)

టిడ్కో నిర్మించే ఇళ్లలో మూడు రకాలు

  1. టిడ్కో నిర్మిస్తున్న 54,056 ఇళ్లల్లో మూడు రకాలున్నాయి. 300, 365, 430 చదరపు అడుగుల వంతున ఈ ఇళ్లు నిర్మిస్తున్నారు.
  2. 300 ఎస్‌ఎఫ్‌టీ ఇళ్లు 47,832 ఉన్నాయి. వీటిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించినట్టుగా ఒక్క రూపాయికే లబ్ధిదారులకు అందిస్తారు. 
  3. 365 ఎస్‌ఎఫ్‌టీ ఇళ్లు 288 ఉన్నాయి. వీటికి టీడీపీ ప్రభుత్వంలో లబ్ధిదారుడు వాటా రూ.50 వేలు భరిస్తే మిగిలినది బ్యాంకు లోన్‌గా నిర్ణయించారు. కాగా లబ్ధిదారు చెల్లించాల్సిన రూ.50 వేలలో సగం అంటే రూ.25 వేలు ప్రభుత్వం చెల్లిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. కాబట్టి లబ్ధిదారు రూ.25 వేలు చెల్లిస్తే చాలు. ప్రభుత్వం రూ.25 వేలు చెల్లిస్తుంది. మిగిలిన మొత్తానికి టిడ్కోనే బ్యాంకుల ద్వారా రుణం ఇప్పిస్తుంది.

430 ఎస్‌ఎఫ్‌టీ ఇళ్లు 5,936 ఉన్నాయి. వీటికి టీడీపీ ప్రభుత్వంలో లబ్ధిదారు వాటా రూ.లక్ష చెల్లించాలని, మిగిలినది బ్యాంకు లోన్‌ అని నిర్ణయించారు. కాగా లబ్ధిదారు చెల్లించాల్సిన రూ.లక్షలో సగం అంటే రూ.50 వేలు ప్రభుత్వం చెల్లిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ప్రకటించారు. కాబట్టి లబ్ధిదారు రూ.50 వేలు భరిస్తే చాలు. ప్రభుత్వం రూ.50 వేలు చెల్లిస్తుంది. మిగిలిన మొత్తానికి టిడ్కోనే బ్యాంకుల ద్వారా రుణం ఇప్పిస్తుంది.

నాణ్యతకు ప్రాధాన్యం 
రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియ ఇప్పటికే సత్ఫలితాలను ఇచ్చింది. ఆ విధంగా ఖరారు చేసిన 54,056 ఇళ్ల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యమిస్తున్నాం. అన్ని వసతులతో టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని ఏడాదిన్నరలో పూర్తిచేయాలని కాంట్రాక్టు సంస్థలకు ఆదేశించాం. - శ్రీధర్‌, టిడ్కో ఎండీ               

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు