కరోనా మరణాల కట్టడిలో భేష్‌

7 Jul, 2021 04:04 IST|Sakshi

చాలా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌ ముందంజ

అత్యధికంగా పంజాబ్‌లో మృతులు 2.69 శాతం

మన రాష్ట్రంలో 0.67 శాతమే

రాష్ట్రంలో 35 వేల దిగువకు యాక్టివ్‌ కేసులు

సాక్షి, అమరావతి: కరోనా మరణాల నియంత్రణలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో ముందంజలో కొనసాగుతోంది. దేశంలో చాలా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌.. మరణాల నియంత్రణపై ప్రత్యేక వ్యూహంతో పట్టు సాధించింది. క్రిటికల్‌ కేర్‌ నిర్వహణ, సకాలంలో బాధితులకు వైద్యమందించడం, ఆక్సిజన్, ఐసీయూ పడకల నిర్వహణ తదితర కారణాల వల్ల బాధితులు కరోనా నుంచి బయటపడుతున్నట్టు తేలింది. మృతిచెందుతున్న వారిలో చాలామంది కోమార్బిడిటీ (జీవనశైలి/ఇతర జబ్బులు) కారణాల వల్ల మరణిస్తున్నారని, కరోనా సోకిన తర్వాత ఆస్పత్రికి రావడంలో జాప్యం కూడా దీనికి కారణమని విశాఖపట్నం కింగ్‌జార్జి ఆస్పత్రికి చెందిన ఓ డాక్టరు అభిప్రాయపడ్డారు. పంజాబ్‌ రాష్ట్రంలో కరోనా బాధితులు 2.69 శాతం మంది మరణిస్తున్నారు.

దేశంలో ఇదే అత్యధికం. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదైనా మరణాలు మాత్రం తక్కువగా ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో కోవిడ్‌ యాక్టివ్‌ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. ఒకదశలో 2 లక్షలకు పైగా ఉన్న యాక్టివ్‌ కేసుల సంఖ్య జూలై 6వ తేదీ నాటికి 33,230కి తగ్గింది. దేశంలో అత్యధికంగా యాక్టివ్‌ కేసులు మహరాష్ట్రలో 1.21 లక్షలు ఉన్నాయి. 1.03 లక్షల యాక్టివ్‌ కేసులతో కేరళ రెండోస్థానంలో ఉంది. కేసులు తగ్గుతున్నాయని జనం గుంపులుగా వెళ్లకూడదని, బయటకు వెళ్లేటప్పుడు విధిగా మాస్కులు ధరించాలని వైద్య ఆరోగ్యశాఖ వివిధ మాధ్యమాల ద్వారా పల్లెలు, పట్టణాల్లో ప్రచారం నిర్వహిస్తోంది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు