హక్కుల పరిరక్షణకే సుప్రీంకోర్టుకు.. 

14 Jul, 2021 03:38 IST|Sakshi

కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శికి రాష్ట్ర ప్రభుత్వ సీఎస్‌ లేఖ 

కృష్ణా బోర్డు ఆదేశాలను తుంగలో తొక్కిన తెలంగాణ సర్కార్‌ 

ఆంధ్రప్రదేశ్‌కు వాటా నీరు దక్కకూడదన్నదే వారి ఉద్దేశం   

సాక్షి, అమరావతి:  ‘కృష్ణా బోర్డు ద్వారా కేంద్రం చట్టబద్ధంగా జారీ చేసిన ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం తుంగలో తొక్కి.. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో ఇప్పటికే 62.59 టీఎంసీలను అక్రమంగా వాడుకుని నిరంతరాయంగా విద్యుత్‌ ఉత్పత్తి చేసింది. ఇలా ప్రాజెక్టులను ఖాళీ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కు వాటా నీరు దక్కకుండా చేస్తోంది. దాంతో ఇప్పటికే వృథాగా 7.1 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రజల హక్కులను పరిరక్షించుకోవడానికి సుప్రీంకోర్టును ఆశ్రయించడం మినహా మరో మార్గం కన్పించలేదు’ అని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం వివరించింది.

ఈ మేరకు కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ మంగళవారం లేఖ రాశారు. న్యాయబద్ధంగా విధులు నిర్వర్తించడం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇరుకున పెట్టడానికి కానే కాదని స్పష్టం చేశారు. తెలంగాణ దుందుడుకు చర్యల గురించి కృష్ణా బోర్డుకు, కేంద్ర జల్‌ శక్తి శాఖలకు పలుమార్లు ఫిర్యాదు చేశామని ఆ లేఖలో పేర్కొన్నారు. కేంద్రం.. కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేసి ఉంటే ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదన్నారు.     

మరిన్ని వార్తలు